Infosys moonlighting : 'రెండో ఉద్యోగం చేస్తే.. ఇంటికి పంపించేస్తాము'
Infosys moonlighting : మూన్‌లైటింగ్‌పై ఈ మధ్యకాలంలో ఐటీ పరిశ్రమలో తెగ చర్చ జరుగుతోంది. తాజాగా దీనిపై ఇన్ఫోసిస్ కూడా స్పందించింది.
Infosys moonlighting news : మూన్‌లైటింగ్‌పై కీలక ప్రకటన చేసింది దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్. ఉద్యోగులు మూన్‌లైటింగ్ చేయడానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలకు పాల్పడే వారి కాంట్రాక్టులు కూడా రద్దు చేస్తామని తేల్చిచెప్పింది. ఇన్ఫోసిస్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం.. ఒకేసారి రెండు ఉద్యోగాలు చేయడం కుదరదని పేర్కొంది.
ఓ కంపెనీ వ్యక్తి.. తన ఉద్యోగం అయిపోయిన తర్వాత వేరే సంస్థకు పనిచేసి రెండో ఆదాయ వనరును పొందడాన్ని ఇంగ్లీష్‌లో మూన్‌లైటింగ్ అంటారు. సాధారణంగా.. రెండు కంపెనీల్లో పని చేస్తున్న విషయాన్ని ఉద్యోగులు రహస్యంగా ఉంచుతారు.
ఐటీ కంపెనీల్లో ఇటీవలి కాలంలో మూన్‌లైటింగ్ ఘటనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సంస్థ ఆమోదం పొందకుండానే అటు ఇటు హడావుడిగా పనులు చేసేస్తున్నారు ఉద్యోగులు. మూన్‌లైటింగ్ వల్ల ప్రొడక్టివిటీ దెబ్బతింటుందని, డేటా బ్రీచ్ జరిగే అవకాశం ఉందని ఐటీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఫలితంగా మూన్‌లైటింగ్ చర్యలకు చెక్ పెట్టేందుకు ఐటీ సంస్థలు కృషిచేస్తున్నాయి.
"ఇన్ఫోసిస్‌లో రెండో ఉద్యోగం చేసేందుకు ఎంప్లాయీస్ హ్యాండ్‌బుక్ అండ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంగీకరించదు. మేము దీనికి వ్యతిరేకం," అని ఉద్యోగులకు పంపిణీ చేసిన అంతర్గత సర్క్యూలర్‌లో పేర్కొంది ఇన్ఫోసిస్. ఫలితంగా ఐటీలో మూన్‌లైటింగ్ వ్యవహారంపై మళ్లీ హాట్‌టాపిక్‌గా మారింది.
IT moonlighting : మూన్లైటింగ్కి పాల్పడటం 'చీటింగ్'తో సమానం అని.. కొన్ని వారాల క్రితం విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ పేర్కొన్నారు. "ఐటీలో మూన్‌లైటింగ్ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఇది ఇప్పుడు హాట్‌టాపిక్. కానీ ఇది చాలా సింపుల్ విషయం. ఇది చీటింగ్‌తో సమానం," అని అన్నారు.
"మూన్‌లైటింగ్ ఎక్కువ రోజులు పనిచేయదు. ఉద్యోగులు ఎథిక్స్‌ని దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించాలి. స్వల్పకాలిక లాభాల కోసం ఇలాంటి పనులు చేస్తే దీర్ఘకాలంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మీరు చాలా కోల్పోతారు," అని టీసీఎస్ సీఓఓ ఎన్. గణపతి సుబ్రమణియం వెల్లడించారు.
మరో ఐటీ సంస్థ ఎంఫసిస్.. 36వేలకుపైగా ఉద్యోగులపై నిఘా పెట్టినట్టు వెల్లడించింది. మూన్‌లైటింగ్ చేస్తే సహించమని స్పష్టం చేసింది.
అయితే.. మూన్లైటింగ్కి అనుకూలంగా ఉన్న వారు కూడా ఉన్నారు.
"కాంట్రాక్టుల పేరు చెప్పి ఉద్యోగులను ఇన్ఫోసిస్ నియంత్రించలేదు. కోర్టులో ఆ కాంట్రాక్టులు చెల్లవు. ఉద్యోగులు 9గంటల పాటు పనిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాళ్లు ఏం చేస్తారనేది సంస్థలకు అనవసరం," అని ఎన్ఐటీఈఎస్(నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్) అధ్యక్షురాలు హర్‌ప్రీత సింగ్ సలుజ పేర్కొన్నారు.
సంబంధిత కథనం