Indian Consulate Vandalised : అమెరికాలో ఇండియన్ కాన్సులేట్‌పై ఖలిస్థానీ మద్దతుదారులు దాడి!
Indian Consulate Vandalised : పలువురు ఖలిస్థానీ మద్దతురులు.. అమెరికా సాన్ ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్‌పై దాడి చేశారు. ఫలితంగా కార్యాలయానికి మంటలు అంటుకున్నాయి.
Indian Consulate Vandalised : ఖలిస్థానీ మద్దతుదారులు మరోమారు రెచ్చిపోయారు! అమెరికా సాన్ ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్‌ను కొందరు ధ్వంసం చేశారు. ఈ ఘటనను అమెరికా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
ఇదీ జరిగింది..
స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఈ ఘటన జరిగింది. తాజా ఘటనలో ఇండియన్ కాన్సులేట్ కార్యాలయానికి మంటలు అంటుకున్నాయి. సరైన సమయంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. కార్యాలయానికి పెద్దగా ప్రమాదం జరగలేదని స్థానిక, రాష్ట్ర, ఫెడరల్ అధికారులు ధ్రువీకరించారు.
మరోవైపు సాన్ ఫ్రాన్సిస్కోలో దాడికి గురైన కార్యాలయం గోడలపై 'హింసతో హింస పుడుతుంది,' అన్న పదాలు రాసి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. అదే సమయంలో ప్రో ఖలిస్థాన్ బృందం "ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్"కు చెందిన ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ మరణ వార్తకు సంబంధించిన న్యూస్ పేపర్ ఒకటి ఘటనాస్థలంలో దొరికింది. ఈ హర్దీప్ సింగ్‌ను కెనడాలో గత నెలలో కాల్చి చంపేశారు. అతను కెనేడియన్ ఆర్మ్ ఆఫ్ సిక్స్ ఫర్ జస్టీస్ అనే బృందాన్ని కూడా నడిపేవాడు.
46ఏళ్ల నిజ్జార్ స్వస్థలం జలంధర్. కాగా.. కెనడాలో ఎన్నో ఏళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న బాబర్ ఖల్సా ఇంటర్నేషనల్ ఉగ్ర ముఠాకు అతను ఆర్థిక సాయం చేసేవాడని ఆరోపణలు ఉన్నాయి. నిజ్జార్ మరణంతో ఖలిస్థానీ మద్దతుదారులు.. ఇండియన్ కాన్సులేట్‌పై దాడి చేసినట్టు తెలుస్తోంది.
ఖండించిన అమెరికా ప్రభుత్వం..
తాజా ఘటనను అమెరికా హోంశాఖ తీవ్రంగా ఖండించింది.
"సాన్ ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్‌పై జరిగిన దాడిని అమెరికా తీవ్రంగా ఖండిస్తోంది. దౌత్య కార్యాలయాలు, విదేశీ దౌత్య కార్యాలయాలపై దాడిని అమెరికా సహించదు. ఇదొక క్రిమినల్ అఫెన్స్," అని యూఎస్ హోంశాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ట్వీట్ చేశారు.
పెరుగుతున్న దాడులు..!
ఖలిస్థానీ మద్దతుదారుల హింసాత్మక చర్యలు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయి. సాన్ ఫ్రాన్సిస్కోలోనే.. కొన్ని నెలల క్రితం, ఇండియన్ కాన్సులేట్‌లోకి దూసుకెళ్లారు. రెండు ఖలిస్థానీ జండాలను అక్కడ ఎగురవేశారు. లండన్, కెనడాల్లోనూ ఈ తరహా ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
మరోవైపు కెనడాలో ప్రో ఖలిస్థానీ మద్దతుదారులు భారీ ర్యాలీని చేపట్టారు. ఈ 'ఫ్రీడం ర్యాలీ'తో టోరంటో, ఒట్టావాలోని భారతీయ రాయబార కార్యాలయాలకు ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది.
సంబంధిత కథనం