కోల్‌కతాలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనను నిరసిస్తూ వైద్యుల నిరసనలు తారస్థాయికి చేరాయి. దేశంలోని అతిపెద్ద వైద్య సిబ్బంది సంస్థ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆగస్టు 17, శనివారం ఉదయం నుంచి దేశవ్యాప్త సమ్మెను మొదలుపెట్టింది. దశాబ్ద కాలంలోనే అతిపెద్ద సమ్మెగా భావిస్తున్న ఈ స్ట్రైక్‌లో అనేక వైద్య సేవలు నిలిచిపోనున్నాయి.
కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తూ 31 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఆగస్టు 9న జరిగిన ఈ ఘటన తర్వాత కోల్‌కతాలో భారీ ఎత్తున్న నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో దేశవ్యాప్తంగా వైద్యవర్గాలు పెద్దఎత్తున నిరసనలు, సమ్మెలకు దిగాయి.
ఇక శనివారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు సమ్మె చేపట్టనున్నట్టు ఐఎంఏ శుక్రవారమే ప్రకటించింది. దీనికి వైద్య వర్గాలు మద్దతు ప్రకటించాయి.
• ఆగస్టు 17, శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 18 ఆదివారం ఉదయం 6 గంటల వరకు దేశవ్యాప్త సమ్మెను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రకటించింది.
• ఈ వారాంతంలో చాలా ఆసుపత్రి విభాగాలు మూతపడి ఉంటాయి.. సాధారణ ఔట్ పేషెంట్ విభాగాలు (ఓపీడీలు), ఎలక్టివ్ సర్జరీలు మూతపడనున్నాయి.
• నిత్యావసర సేవలు యథావిధిగా కొనసాగుతాయి. ఇందులో అత్యవసర సంరక్షణ, క్లిష్టమైన చికిత్సలు ఉన్నాయి. ఇవి యథావిధిగా కొనసాగుతాయి.
• ఏవైనా అత్యవసర వైద్య అవసరాలు తలెత్తితే వాటిని కొనసాగించేందుకు క్యాజువాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయి.
• ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులతో సహా ఆధునిక మెడిసిన్ వైద్యులు పనిచేసే అన్ని రంగాలపై సమ్మె ప్రభావం ఉంటుంది.
• అమృత్‌సర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆగస్టు 16 నుంచి తదుపరి నోటీసు వచ్చే వరకు అవుట్ పేషెంట్ విభాగాలు (ఓపిడిలు), ఆపరేటింగ్ థియేటర్లు (ఓటిలు), వార్డులతో సహా అన్ని అత్యవసర, ఎలక్టివ్ ఆసుపత్రి సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
* ఆగస్టు 16న మధ్యాహ్నం 2 గంటలకు దిల్లీలోని నిర్మాణ్ భవన్ నుంచి రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్లు సంయుక్త నిరసన ర్యాలీ నిర్వహించనున్నాయి.
• కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం-హత్య ఘటనకు నిరసనగా దిల్లీ మెడికల్ అసోసియేషన్ (డీఎంఏ) ఆగస్టు 16 సాయంత్రం 5 గంటలకు ఇండియా గేట్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనుంది.
* ఈ ఘటనకు నిరసనగా మహారాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ (ఎంఏఆర్డీ) ఆగస్టు 16న ముంబైలోని ఆజాద్ మైదానంలో నిరసన చేపట్టనుంది.
• ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం-హత్యకు నిరసనగా సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్టు) ఆగస్టు 16న సిలిగురిలో 12 గంటల సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చింది. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి చాలా దుకాణాలు మూతపడటంతో నగరంలో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
సంబంధిత కథనం