One nation, One election: జమిలి ఎన్నికల కమిటీ సభ్యులు వీరే.. కాంగ్రెస్ నేతకు కూడా స్థానం.. న్యాయ శాఖ నోటిఫికేషన్
One nation, One election: జమిలి ఎన్నికల నిర్వహణ దిశగా కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందుకు సిఫారసులు చేయడానికి ఏర్పాటుచేసిన మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీలో సభ్యులను నియమిస్తూ న్యాయ శాఖ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
One nation, One election: దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీలకు, లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న కేంద్రం ఆలోచిస్తోంది. ఈ దిశగా సిఫారసులు చేయడానికి ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా, శనివారం, ఆ కమిటీ సభ్యుల పేర్లను వెల్లడిస్తూ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.
వీరే సభ్యులు..
ఈ కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వం వహిస్తారు. కమిటీలో..
- అమిత్ షా (కేంద్ర హోం మంత్రి)
- ఆధిర్ రంజన్ చౌధరి (కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ)
- గులాం నబీ ఆజాద్ (జమ్మూకశ్మీర్ నేత)
- ఎన్ కే సింగ్ (15వ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్)
- సుభాష్ చంద్ర కశ్యప్ (లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్)
- హరీశ్ సాల్వే (సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది)
- సంజయ్ కొఠారీ (మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్)
సభ్యులుగా ఉంటారు.
తక్షణమే విధుల్లోకి..
ఈ కమిటీ తక్షణమే విధుల్లోకి దిగుతుందని, జమిలి ఎన్నికలకు సంబంధించి సాధ్యమైనంత త్వరగా సిఫారసులతో కూడిన నివేదికను ఇస్తుందని న్యాయ శాఖ తెలిపింది. ఈ కమిటీ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ హాజరవుతారు. అలాగే, ఈ కమిటీ సెక్రటరీగా న్యాయ శాఖ కార్యదర్శి నితిన్ చంద్ర వ్యవహరిస్తారు.
ఇవే ఆ కమిటీ విధులు..
దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీలకు, లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై సాధ్యాసాధ్యాలను, అడ్డంకులను, సమస్యలను ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. ఇందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలపై, ప్రత్యేకంగా చట్టాలేమైనా చేయాలా? అనే విషయంపై సిఫారసులు చేస్తుంది. రాజ్యాంగంతో పాటు ఏయే చట్టాల్లో, ఏయే మార్పులు చేయాలో సూచిస్తుంది. గడువుకు ముందే సభ రద్దైతే ఏం చేయాలి?.. హంగ్ సభ ఏర్పడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి?.. అవిశ్వాస తీర్మానం గెలిస్తే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి?.. పార్టీ ఫిరాయింపులపై ఎలాంటి నిర్ణయాలుండాలి?.. మొదలైన అంశాలను కూడా ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది.