53 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యానికి పెరిగిన సోలార్ విద్యుత్తు
న్యూఢిల్లీ, మే 25: దేశంలో ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య దాదాపు 3 గిగావాట్ల కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్లను స్థాపించినట్టు మెర్కామ్ ఇండియా ఒక నివేదికలో బుధవారం వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంలో స్థాపిత సామర్థ్యం కంటే 50 శాతం ఇది అధికమని తెలిపింది.
‘ఇండియా దాదాపు 3 గిగావాట్ల సోలార్ కెపాసిటినీ జనవరి-మార్చి త్రైమాసికంలో స్థాపించింది. అంతకుముందు త్రైమాసికంతో పోల్చితే ఇది 2.6 గిగావాట్లు ఎక్కువ. వార్షికంగా చూస్తే స్థాపిత సామర్థ్యం 50 శాతం పెరిగింది..’ అని మెర్కామ్ ఇండియా రీసెర్చ్ తెలిపింది.
ఈ త్రైమాసికంలో 2.7 గిగావాట్ల మేర సోలార్ విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్లు స్థాపించింది. ఇది అంతకుముందు త్రైమాసికంతో పోల్చితే 23 శాతం వృద్ధి కాగా, వార్షికంగా చూస్తే 53 శాతం వృద్ధి సాధించిందని తెలిపింది.
పెరిగిన ఉత్పత్తి సామర్థ్యంలో 85 శాతం భారీ పరిమాణం గల ప్లాంట్లు కాగా, 15 శాతం రూఫ్‌టాప్ ఇన్‌స్టలేషన్స్ అని నివేదిక తేల్చింది. ఇప్పటివరకు దేశంలో మొత్తంగా 52 గిగావాట్ల సోలార్ కెపాసిటీ ఉన్నట్టు నివేదిక తెలిపింది.
దేశంలో 54 గిగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్తు ప్రాజెక్టులు వివిధ అభివృద్ధి దశల్లో ఉన్నాయని, మరో 33 గిగావాట్ల ప్రాజెక్టులకు టెండర్ల ప్రక్రియ పూర్తవ్వాల్సి ఉందని తెలిపింది.
‘ప్రభుత్వం చిన్నపాటి ప్రోత్సాహం ఇస్తే.. ఇండియా 60 గిగావాట్ల లార్జ్ స్కేల్ ఇన్‌స్టలేషన్ టార్గెట్ -2022ను అధిగమించడంలో సాయం చేసినట్టు అవుతుంది. ఇది ఒక గొప్ప విజయం కాగలదు..’ అని మెర్కామ్ కాపిటల్ గ్రూప్ సీఈవో రాజ్ ప్రభు అన్నారు.
10 గిగావాట్ల సామర్థ్యం దాటిన రాష్ట్రంగా రాజస్థాన్ మొదటి స్థానంలో ఉంటుందని, ఆ రాష్ట్రం లార్జ్ స్కేల్ పీవీ ఇన్‌స్టలేషన్ సామర్థ్యం మార్చి 2022 నాటికి 10 గిగావాట్లు దాటిందని తెలిపింది. దేశంలోని మొత్తం స్థాపిత సామర్థ్యంలో ఇది 24 శాతంగా ఉందని తెలిపింది.
జనవరి-మార్చి త్రైమాసికంలో స్థాపిత సామర్థ్యంలో రాజస్తాన్ 52 శాతం, గుజరాత్ 18 శాతంతో అగ్రశ్రేణిలో నిలిచాయని నివేదిక తెలిపింది. ఆ తరువాత కర్ణాటక 8 శాతంతో మూడోస్థానంలో నిలిచిందని వివరించింది.
జనవరి-మార్చి త్రైమాసికంలో టెండర్ ప్రక్రియకు సంబంధించిన కార్యాచరణ అంతకుముందు త్రైమాసికంతో పోల్చితే 6 గిగావాట్ల మేర తగ్గిందని తెలిపింది.
‘ఏప్రిల్ 1, 2022 నుంచి సోలార్ సెల్స్, మాడ్యుల్స్‌పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ అమల్లోకి వచ్చినందున జనవరి-మార్చి నెలల్లో వీటి దిగుమతుల్లో గణనీయమైన వృద్ధి కనిపించింది..’ అని నివేదిక తెలిపింది.
జనవరి-మార్చి త్రైమాసికంలో డెవలపర్లు దాదాపు 10 గిగావాట్ల సోలార్ స్థాపిత సామర్థ్యానికి సరిపడా సోలార్ మాడ్యూల్స్ నిల్వ పెట్టుకున్నారని, ఏప్రిల్ 1 నుంచి బేసిక్ కస్టమ్స్ డ్యూటీ పెరుగుతున్నందునే ఇలా చేశారని తెలిపింది.
మెర్కామ్ కాపిటల్ గ్రూప్ సబ్సిడరీ అయిన మెర్కామ్ కమ్యూనికేషన్స్ ఇండియా సంస్థ క్లీన్ ఎనర్జీపై పరిశోధన చేస్తోంది.