Chandrayaan-3: చంద్రయాన్ 3 ప్రస్తుత పరిస్థితి ఏంటి?.. విక్రం ల్యాండర్,ప్రజ్ఞాన్ రోవర్ లు ఇక యాక్టివేట్ కావా..?-chandrayaan3 mission amazing vikram lander hop was unplanned isro pulled off a miracle ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Chandrayaan-3: చంద్రయాన్ 3 ప్రస్తుత పరిస్థితి ఏంటి?.. విక్రం ల్యాండర్,ప్రజ్ఞాన్ రోవర్ లు ఇక యాక్టివేట్ కావా..?

Chandrayaan-3: చంద్రయాన్ 3 ప్రస్తుత పరిస్థితి ఏంటి?.. విక్రం ల్యాండర్,ప్రజ్ఞాన్ రోవర్ లు ఇక యాక్టివేట్ కావా..?

Sudarshan Vaddanam HT Telugu
Oct 03, 2023 06:07 PM IST

Chandrayaan-3: చంద్రయాన్ 3 ప్రయోగం దాదాపు పూర్తయినట్లే కనిపిస్తోంది. చంద్రుడి ఉపరితలంపై రాత్రి సమయంలో నిద్రావస్థలోకి వెళ్లిన విక్రం ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లను యాక్టివేట్ చేయడానికి ఇస్రో చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.

చంద్రుడి ఉపరితలంపై విక్రం ల్యాండర్ (ఫైల్ ఫొటో)
చంద్రుడి ఉపరితలంపై విక్రం ల్యాండర్ (ఫైల్ ఫొటో) (ISRO)

Chandrayaan-3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చరిత్రలో చంద్రయాన్ 3 ప్రయోగం అత్యంత సక్సెస్ ఫుల్ ప్రయోగంగా నిలిచింది. తొలిసారి చంద్రుడి ఉపరితలంపై, అది కూడా క్లిష్టమైన దక్షిణ ధృవం సమీపంలో విక్రమ్ ల్యాండర్ ను ల్యాండ్ చేసి భారత్ చరిత్ర సృష్టించింది.

14 రోజుల పాటు..

ఆగస్ట్ 23న విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్ అయింది. ఆ తరువాత కొన్ని గంటల అనంతరం ఆ ల్యాండర్ లో నుంచి ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపైకి దిగి దాదాపు 14 రోజుల పాటు ఆ ప్రాంతంలో కలియతిరిగింది. అక్కడి వాతావరణం, నేల స్వభావం, నేల కంపనాలు, అక్కడి వాతావరణంలోని రసాయన సమ్మేళనాలు.. తదితర అంశాలపై పరిశోధన చేసింది. అమెరికా, రష్యా, చైనాల అనంతర చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టిన 4వ దేశంగా చంద్రయాన్ 3 తో భారత్ చరిత్ర సృష్టించింది.

నిద్రావస్థ లోకి..

చంద్రుడి ఉపరితలంపై సౌర శక్తి తో విక్రం ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు పని చేశాయి. చంద్రుడిపై పగలు 12 గంటలు భూమిపై దాదాపు14రోజులకు సమానం. అంటే, పగలంతా (భూమిపై 14 రోజులు) చంద్రుడిపై సౌరశక్తి తో ప్రయోగాలు చేసిన విక్రం ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లను చంద్రుడి పై రాత్రి సమయం అయిన తరువాత ఇస్రో నిద్రావస్థలోకి పంపించింది. నిద్రావస్థ రాత్రి (భూమిపై 14 రోజులు) గడిచిన తరువాత మళ్లీ వాటిని యాక్టివేట్ చేయాలనుకుంది.

అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతల వల్ల..

చంద్రుడి ఉపరితలంపై రాత్రి (భూమిపై 14 రోజులు) గడిచిన తరువాత మళ్లీ విక్రం ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లను యాక్టివేట్ చేసే ప్రయత్నాలను ఇస్రో ప్రారంభించింది. కానీ ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. రాత్రి సమయంలో చంద్రుడి ఉపరితలంపై మైనస్ 150 (-150 ) డిగ్రీల నుంచి మైనస్ 200 (-200) డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. అంత తీవ్రమైన చలి వాతావరణాన్ని విక్రం ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు తట్టుకోలేకపోయాయని, ఆ తీవ్ర ప్రతికూల వాతావరణం వల్ల వాటిలోని వ్యవస్థలు నాశనం అయి ఉండవచ్చని చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ డైరెక్టర్ పీ వీరముత్తువేల్ అభిప్రాయపడ్డారు. అందువల్లనే వాటిని మళ్లీ యాక్టివేట్ చేయలేకపోతున్నామని వివరించారు. అయితే, చంద్రయాన్ 3 ప్రయోగం నిర్వహించిన ఉద్దేశం, లక్ష్యం నెరవేరాయని ఆయన స్పష్టం చేశారు. చంద్రుడిపై ల్యాండ్ అయిన తరువాత 14 రోజుల పాటు అక్కడి నేల, వాతావరణ పరిస్థితులను విక్రం ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు అధ్యయనం చేసి, వివరాలను భారత్ కు పంపించాలన్నదే చంద్రయాన్ 3 ప్రయోగం లక్ష్యమని స్పష్టం చేశారు. ఆ లక్ష్యం నెరవేరిందని తెలిపారు.

Whats_app_banner