Bharat Jodo Yatra: ‘ఈ యాత్ర నా కోసం, మా పార్టీ కోసం కాదు..’: భారత్ జోడో యాత్ర ముగింపు సభలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
Bharat Jodo Yatra - Rahul Gandhi: 135 రోజుల పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర నేడు ముగిసింది. శ్రీనగర్‌లో యాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన సభలో రాహుల్ మాట్లాడారు.
Bharat Jodo Yatra - Rahul Gandhi: భారత్ జోడో యాత్ర తన కోసం, తమ పార్టీ కోసం చేయలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశ ఐక్యత, దేశ ప్రజల కోసం తాను ఈ యాత్ర నిర్వహించానని స్పష్టం చేశారు. 135 రోజుల పాటు సాగిన భారత్ జోడో యాత్ర ముగింపు (Bharat Jodo Yatra Concluded) కార్యక్రమం కశ్మీర్‌లోని శ్రీనగర్ (Srinagar) లో నేడు (జనవరి 30) జరిగింది. మంచు తీవ్రంగా కురుస్తున్నా ఈ యాత్ర ముగింపు సభ జరిగింది. హిమపాతం మధ్యే రాహుల్ గాంధీ ప్రసంగించారు. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీతో పాటు ఆ పార్టీకి చెందిన నేతలు కొందరు పాల్గొన్నారు. పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాతో పాటు మరికొన్ని ప్రతిపక్షాలకు చెందిన నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
అదే మా లక్ష్యం
Bharat Jodo Yatra - Rahul Gandhi: “నేను ఈ యాత్ర నా కోసమో, కాంగ్రెస్ పార్టీ కోసమో చేయలేదు. దేశ ప్రజల కోసమే నిర్వహించా. దేశ పునాదులను దెబ్బతీయాలని చూసే భావజాలానికి వ్యతిరేకంగా పోరాడడమే మా లక్ష్యం” అని రాహుల్ గాంధీ అన్నారు. జమ్ము కశ్మీర్‌లో బీజేపీ నేతలు పాదయాత్ర చేయగలరా అని ప్రశ్నించారు. “జమ్ము కశ్మీర్‌లో ఇలా ఏ బీజేపీ నేత కూడా నడవలేరని నేను కచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే వారు భయపడుతున్నారు” అని రాహుల్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ వాటిని సంరక్షిస్తుంది
Bharat Jodo Yatra: ప్రేమ, నిజాయితీ, అహింసతో ఈ దేశ నిర్మాణం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ వాటిని సంరక్షిస్తుందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) అన్నారు. భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. “నా సోదరుడు ఐదు నెలల నుంచి నడుస్తున్నారు. ఈ ప్రయాణం చాలా సుదీర్ఘం అని నేను మొదట్లో ఆలోచించాను. ప్రజలు ఎలా ఆహ్వానిస్తారని అనుకున్నాను. కానీ రాహుల్ గాంధీ యాత్ర ఎక్కడ జరిగిందో.. అక్కడ ప్రజలు ఎంతో ప్రేమతో ఆయనను ఆహ్వానించారు” అని ప్రియాంక అన్నారు. అలాగే జమ్ము కశ్మీర్‌కు వెళుతుంటే తన సొంత ఇంటికి వెళుతున్నట్టు ఉందని రాహుల్ గాంధీ తనకు మెసేజ్ చేశారని తెలిపారు.
భారత్ జోడో యాత్రకు తెర
Bharat Jodo Yatra: శ్రీనగర్‌లోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PCC) కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణతో భారత్ జోడో యాత్ర ముగిసింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు మరికొందరు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమానికి 21 పార్టీలకు ఆహ్వానం పంపింది కాంగ్రెస్.
4వేల కిలోమీటర్లు
Bharat Jodo Yatra: గతేడాది సెప్టెంబర్ 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారిలో భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించారు. 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో సుమారు 3,970 కిలోమీటర్ల పాటు ఈ పాదయాత్ర సాగింది. 135 రోజుల పాటు జరిగింది. కశ్మీర్‌లో నేడు ముగిసింది.
సంబంధిత కథనం