Monsoon cravings: వర్షాకాలంలో పకోడీ తినాలనిపించడానికి కారణమిదే.. ఆరోగ్యకరమైన చిరుతిండ్లు ఏంటంటే..-why we crave for samosa or spicy foods during rainy season ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monsoon Cravings: వర్షాకాలంలో పకోడీ తినాలనిపించడానికి కారణమిదే.. ఆరోగ్యకరమైన చిరుతిండ్లు ఏంటంటే..

Monsoon cravings: వర్షాకాలంలో పకోడీ తినాలనిపించడానికి కారణమిదే.. ఆరోగ్యకరమైన చిరుతిండ్లు ఏంటంటే..

HT Telugu
Jul 19, 2023 04:30 PM IST

Monsoon cravings: వర్షాకాలంలో కారంకారంగా,వేడివేడిగా ఉన్న సమోసాలు, పకోడీలు చూస్తే నోరు కట్టేసుకోలేం. అలాంటి ఆహారం తినాలి అనిపించడానికి కారణాలు ఉన్నాయని చెబుతుంది సైన్స్. అవేంటో చూద్దాం.

వర్షాకాలంలో ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వర్షాకాలంలో ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వేసవిలో చల్లని కూల్ డ్రింకులు, చలికాలంలో క్యారట్ హల్వా, వర్షాకాలంలో పకోడీలు, సమోసాలు తినాలనిపిస్తుంది. రోడ్డుపక్కన పకోడీ తింటే అనారోగ్యమని తెలిసినా నోరు కట్టేసుకోలేం. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. హానికరమని తెలిసినా కూడా వాటిని తినకుండా ఉండలేకపోవడానికి కొన్ని కారణాలున్నాయట.

yearly horoscope entry point

ఎందుకు ఫ్రై చేసిన ఆహారం తినాలనిపిస్తుందంటే..

మన శరీరంలో హ్యాపీ హార్మోన్ సెరొటోనిన్ స్థాయులు వర్షాకాలంలో తగ్గిపోతాయి. దానికి కారణం సూర్యరశ్మి లేకపోవడం, దానివల్ల శరీరంలో విటమిన్ డి ఉత్పత్తిలో కూడా మార్పులొస్తాయి. ఈ లేమిని సర్దుబాటు చేయడం కోసం మన శరీరం కార్బోహైడ్రేట్లు కావాలని కోరుకుంటుంది. కార్బోహైడ్రేట్లు శరీరంలో సెరొటోనిన్ స్థాయుల్ని పెంచుతాయి. దీంతోపాటే డీప్ ఫ్రై చేసిన స్నాక్స్ లో తేమ లేకుండా పొడిగా ఉంటాయి. నోట్లోవేసుకోగానే కరకరలాడతాయి. మన చుట్టూ ఉన్న చల్లని వాతావరణానికి ఈ ఆహారం తింటే మనకు నచ్చుతుంది.

కారంగా ఉన్న ఆహారం ఎందుకు తినాలనిపిస్తుంది?

వర్షాకాలంలో క్రిస్పీగా, ఫ్రై చేసిన స్నాక్స్‌తో పాటూ కాస్త కారంగా తినాలని కూడా అనిపిస్తుంటుంది. మిరపకాయల్లో క్యాప్సైసిన్ ఉంటుంది. మనం కారం తినగానే నోట్లోని నరాల గ్రాహకాలకు ఇది మనం ఏదో వేడి పదార్థం తిన్నామనే భావన కలగజేస్తుంది. దాంతో మెదడు మనకు చెమట పట్టేలా చేస్తుంది. మనలో ఆనందాన్ని పెంచే డోపమైన్ ను మన రక్తంలోకి విడుదల చేస్తుంది.

ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది?

డీప్ ఫ్రై చేసిన ఆహారాల్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువుతో పాటూ కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. ఈ సమస్యలేమీ రాకుండా ఎలాంటి చిరుతిండ్లు తీసుకోవచ్చంటే..

  • వేడిగా ఏదైనా తినాలనిపిస్తే ఒక మొక్కజొన్న పొత్తును ముక్కలుగా చేసి, మసాలాలు, బటర్ వేసుకుని రోస్ట్ చేసుకోవచ్చు. చివరగా నిమ్మరసం పిండుకుని తింటే అమోఘంగా ఉంటుంది.
  • పచ్చి మొలకలు, కూరగాయ ముక్కు, మొక్కజొన్న గింజలతో చేసిన సలాడ్ రుచిలో తీసిపోదు.
  • ఆలూచాట్, ఆలూ దహీ చాట్, లేదా బేక్ చేసిన బంగాళదుంపలతో చాట్ చేసుకోవచ్చు.
  • కూరగాయలతో చేసిన వేడివేడి గ్రిల్డ్ శ్యాండ్‌విచ్ పకోడీలకు మంచి ప్రత్యామ్నాయం.
  • కాల్చుకున్న పాపడ్ మీద కూరగాయ ముక్కలు, పుదీనా చట్నీ వేసుకుని తింటే అదిరిపోతుంది.
  • పేలాలతో చేసిన చాట్ లో కూరగాయ ముక్కలు, లేదా ఒక కప్పు పాప్ కార్న్ తినండి.

వర్షాకాలంలో కారంగా, వేడిగా తినాలనే కోరికని ఈ ఆరోగ్యకరమైన ఆహారాలతో తీర్చేసుకోండి.

Whats_app_banner