home cooling: ఇల్లు చల్లగా ఉండాలంటే.. ఇవి మార్చేయండి.. ఏసీ అవసరమే ఉండదు-tips to make home cool in the hot weather with sustainable ideas ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Tips To Make Home Cool In The Hot Weather With Sustainable Ideas

home cooling: ఇల్లు చల్లగా ఉండాలంటే.. ఇవి మార్చేయండి.. ఏసీ అవసరమే ఉండదు

Koutik Pranaya Sree HT Telugu
May 18, 2023 08:31 AM IST

home cooling: వేసవిలో ఇంటిని చల్లగా ఉంచేందుకు ఇంటికి చేసుకోవాల్సిన మార్పులు ఏంటో చూద్దాం. వీటివల్ల దీర్ఘకాలిక లాభాలు ఎక్కువగా ఉంటాయి.

వేసవిలో ఇల్లు చల్లగా ఉంచే మార్గాలు
వేసవిలో ఇల్లు చల్లగా ఉంచే మార్గాలు (Photo by Kinga Howard on Unsplash)

ఈ ఎండల వల్ల కాంక్రీట్ ఇళ్లు నిప్పుల కొలిమిలా మారిపోతున్నాయి. కూలర్లు, ఏసీలు లేకుండా నిమిషం కూడా ఉండలేని పరిస్థితి. ఖరీదైన ఏసీలు, వసతులు ఏర్పాటు చేసుకోలేని వారు కొన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటే దీర్ఘకాలంలో ఇల్లు ఎప్పటికీ చల్లగా ఉంటుంది.

వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇచ్చే వెదురు, మట్టి, గడ్డి లాంటి వాటితో ఇంటిని చల్లగా ఉంచుకోవడం ఒక మార్గమైతే… మరి కొందరు ఆధునికి పద్ధతుల్లో ఇన్సులేటెడ్ గోడలు, ప్యానెళ్లతో ఇంటిని చల్లబరుచుకుంటున్నారు. ఏసీలు వాడి ఇల్లు చల్లగా ఉండేలా చేసేవాళ్లే ఎక్కువమంది. కానీ దీని ప్రభావం మన ఆరోగ్యంతో పాటే వాతావరణం మీద కూడా ఉంటుంది. అందుకే పర్యవరణానికి హాని చేయకుండా వేడి తగ్గించే కొన్ని మార్గాలేంటో చూద్దాం.

వాల్ క్లాడింగ్స్:

వాల్ క్లాడింగ్స్.. అంటే గోడకు బయటి వైపు పెట్టే ఒక టెక్స్చర్. ఇది వాతావరణానికి, ఇంటి గోడలకు మధ్య అడ్డుగా ఉంటుంది. దానివల్ల గది లోపల ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. ఈ వాల్ క్లాడింగ్స్ ఆధునిక హాట్ కోటింగ్ టెక్నాలజీతో తయారు చేస్తారు. వీటి ఉపరితలం ఎక్కువ రోజులు మన్నడమే కాదు..గీతలు పడవు, గోడలను ఎండనుంచి ఎక్కువసేపు రక్షిస్తుంది. వీటిలో ఇంటికి తగ్గట్లు ఎంచుకునే వీలుగా అనేక రంగుల్లో ఉంటాయి.

రేడియంట్ కూలింగ్:

ఏసీలకు బదులుగా రేడియంట్ కూలింగ్ సిస్టం కూడా మంచి మార్గం. కాకపోతే ఇది ఇల్లు నిర్మాణ దశలో ఉన్నప్పుడే చేయించాల్సి ఉంటుంది. దీనివల్ల ఇల్లంతా చల్లగా ఉంటుంది. పైకప్పు, లేదా ఫ్లూరింగ్ లో ఇంటి నిర్మాణ దశలోనే అమర్చిన పైపుల గుండా మనం అనుకున్న ఉష్ణోగ్రతలో నీరు వెళ్తూ ఉంటుంది. చల్లని నీరు వెళ్లడం వల్ల గది చల్లగా మారుతుంది. సాంప్రదాయ ఏసీ ల కన్నా దీని నిర్వహణ వ్యయం కూడా తక్కువగా ఉంటుంది. పర్యావరణ హితం కూడా.

టెంపరేచర్ షీల్డ్ టైల్స్:

వాల్ క్లాడింగ్స్ లాగే, టెంపరేచర్ షీల్డ్ టైల్స్ కూడా మంచి ప్రత్యామ్నాయం. వీటిని పైకప్పులు, బాల్కనీ, ఇంటి బయట గోడలకు వాడొచ్చు. ఇవి వేడిని గ్రహించవు. దీనివల్ల గదిలోపలి ఉష్ణోగ్రత తగ్గుతుంది. వీటిని ప్రత్యేక మైన మెటీరియల్స్ తో తయారు చేస్తారు. దానివల్ల ఇంటి పైకప్పు లో వాడినపుడు ఎక్కువ వేడి గ్రహించకుండా చేస్తుంది. చల్లగా ఉంచుతుంది. ఇవి ఎక్కువ రోజులు మన్నుతాయి. వీటివల్ల దీర్ఘకాలికంగా ప్రయోజనాలుంటాయి. వేడిని తగ్గించడం వల్ల ఫ్యాన్లు, కూలర్ల వాడకం తగ్గుతుంది. కరెంట్ బిల్ ఆదా అవుతుంది. వీటిని చాలా సంవత్సరాల వరకు మార్చాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మీ ప్రస్తుతం ఉన్న ఇంటి స్లాబు మీద కూడా వీటిని పెట్టించుకోవచ్చు.

WhatsApp channel