summer decor: ప్రకృతితో బంధం పెంచే.. బయోఫిలిక్ డిజైన్ గురించి తెలుసా?-latest home decor trends in 2023 for summer ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Latest Home Decor Trends In 2023 For Summer

summer decor: ప్రకృతితో బంధం పెంచే.. బయోఫిలిక్ డిజైన్ గురించి తెలుసా?

Koutik Pranaya Sree HT Telugu
May 03, 2023 10:11 AM IST

summer decor: వేసవిలో ఇంటిని అలంకరించుకోడానికి, ఈ 2023 సంవత్సరంలో కొన్ని కొత్త విధానాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. అవేంటంటే..

ఇంటీరియర్ డెకొరేషన్
ఇంటీరియర్ డెకొరేషన్ (Pixabay )

గదులన్నీ ఎప్పుడూ ఒకేలా ఉంటే ఏం బాగుంటుంది. అప్పుడప్పుడు కొన్ని మార్పులు చేస్తూ ఉండాలి. ఇంటికి కొత్తదనంతో పాటూ, మనసుకీ కాస్త భిన్న వాతావరణంలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా కొన్ని ఇంటీరియర్ ట్రెండ్లు వచ్చేశాయి. వాటితో మీ ఇంటిని ఎలా మార్చుకోవచ్చో చూడండి.

గోద్రెజ్ ఇంటీరియో జనరల్ మేనేజర్ లలితేష్ మంద్రేకర్, HT లైఫ్ స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 2023 సంవత్సరంలో ట్రెండ్ అవుతున్న ఇంటీరియర్ డిజైన్ గురించి చెప్పారు.

బయోఫిలిక్ డిజైన్:

బయోఫిలిక్ డిజైన్ అంటే..మనుషులకీ ప్రకృతికీ మధ్య సంబంధం ఉండేలా చేసే డిజైనింగ్. మొక్కలు, నీళ్లు, సహజమైన వెలుతురు వీటన్నింటితో అలంకరించడం. ఈ సంవత్సరం ఈ డిజైన్‌కి ఎక్కువ ప్రాధాన్యత వస్తోంది. ఇంట్లో సరైన చోటులో మొక్కలు పెట్టడం, చిన్న ఫౌంటేన్ల లాంటి డిజైన్లు, వెలుతురు ఇంట్లో పడేలా డిజైనింగ్ చేయడం ఇప్పుడు వచ్చిన ఇంటీరియర్ ట్రెండ్. తక్కువ స్థలం ఉన్నపుడు, అపార్ట్‌మెంట్లకు ఈ డిజైన ప్రత్యేకత తెచ్చిపెడుతుంది.

ఎర్గోనామిక్ ఫర్నీచర్:

ఎర్గోనామిక్స్ అంటే మన చుట్టూ ఉన్న వస్తువల వల్ల మనకు సౌకర్యం కలిగేలా చేయడం. దానివల్ల మన పనితీరు మెరుగుపడుతుంది. ఆరోగ్యం బాగుండటంలో సాయపడుతుంది. ఉదాహరణకు ఏదో అలంకరణ కోసం మామూలు కుర్చీ ఒకటి మీ ఆఫీసు పని కోసం వాడుతున్నారనుకోండి.. ఎర్గోనామిక్ డిజైన్ అంటే దానికి ఒక కుషన్ ఉండాలి. దాని వల్ల నడుం నొప్పి రాదు. అలాగే మీ కాళ్లు చాచుకునేంత స్థలం ఉండాలి. టేబుల్, కుర్చీ ఒక ప్రత్యేకమైన ఎత్తులో ఉండాలి. కేవలం అలంకరణ కోసమే కాకుండా ఆరోగ్యాన్ని , సౌకర్యాన్ని ఇచ్చేవే ఎర్గోనామిక్ ఫర్నీచర్.

ఖాళీ సమయంలో కూర్చునే రిక్లైనర్లు, కుర్చీలు కూడా మనకున్న ఆరోగ్య సమస్యలకు అనుగుణంగా .. అంటే మెడ నొప్పి, నడుం నొప్పి లాంటి వాటికి తగ్గట్లు కుషన్లు వేయడం, పరుపులతో మెత్తగా ఉండేలా డిజైన్ చేయడం ప్రత్యేకత.

పేస్టల్ రంగులు:

అటు మోడర్న్‌గా, ఇటు ఆహ్లాదంగా కనిపించే లుక్ రావాలంటే పేస్టల్ రంగుల్ని వాడాలి. కాస్త నీలిరంగు, ఆకుపచ్చరంగుకు దగ్గర్లో ఉండే రంగులైతే మనసుకు ప్రశాంతతను తీసుకొస్తాయి. రంగుల ప్రభావం మనమీద చాలా ఉంటుంది. అలిసిన కళ్ల ముందు ముదురు ఎరుపు రంగు కనిపిస్తే మనం ఇంకా అలిసిపోతాం. అదే తెలుపు, లేత పసుపు, బూడిద రంగుల్ని చూస్తే తెలియకుండానే హాయిగా ఉన్న భావన కలుగుతుంది.

అలాగే గోడలకు, షెల్ఫులకు ఒకే రంగు వాడకుండా.. కాస్త భిన్నత్వం ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు గోడలకు బూడిద రంగు వాడితే.. షెల్ఫుకు సీ గ్రీన్ లాంటి రంగులు వాడితే దృష్టి ఆకర్షిస్తాయి. వాటిలో పెట్టే వస్తువులు కూడా మంచి రంగురంగుల్లో ఎంచుకోవచ్చు.

WhatsApp channel