Drinking Water Mistakes: నీటిని తాగే విషయంలో తప్పుడు అపోహలతో ఉన్నారేమో.. ఇవి తెల్సుకోండి..
Drinking Water Mistakes: నీళ్లు తాగేటప్పుడు కొన్ని తప్పులు చేయకూడదు. ఎంత తాగుతున్నాం, ఎప్పుడు తాగుతున్నాం అనే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే.

మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, మన చర్మం హైడ్రేటెడ్‌గా ఉండాలన్నా మనం రోజూ తగినంత నీటిని తాగాల్సిందే. రోజుకు కనీసం ఏడెనిమిది గ్లాసుల నీటిని తాగాలని వైద్యులు సిఫార్సు చేస్తుంటారు. అయితే వీటిని తాగేప్పుడు అంతా సాధారణంగా చేసే కొన్ని తప్పులు ఉంటాయి. అవేంటో తెలుసుకుని వాటిని చేయకుండా ఉండేందుకు ప్రయత్నించండి.
నీళ్లు తాగేటప్పుడు చేయకూడని తప్పులు:
ఉదయం నిద్ర లేచిన తర్వాత అంతా చేయాల్సిన మొదటి పని నోటిని పుక్కిలించి శుభ్రం చేసుకోవాలి. తర్వాత పరగడుపునే నీటిని తాగాలి. రాత్రంతా మనం ఏం తినకుండా, తాగకుండా ఉంటాం. కాబట్టి ఉదయాన్నే నీటిని తాగితే మళ్లీ శరీరం హైడ్రేటెడ్‌గా మారుతుంది. జీవ క్రియలు ఊపందుకుంటాయి.
నీటిని ఏ సమయంలో తాగాలి. ఏ సమయంలో తాగకూడదు అనే విషయంలో కచ్చితంగా అవగాహనతో ఉండాలి. మరీ ముఖ్యంగా అన్నం తినడానికి అరగంట ముందు ఓ గ్లాసుడు నీరు తాగాలి. అలా చేయడం వల్ల గ్యాస్ ఇబ్బందులు ఎక్కువగా తలెత్తవు. ఇంకా అన్నం తిన్నప్పుడు జీర్ణ రసాలు సరిగ్గా విడుదల అయి అరుగుదల సమస్యలు ఉండవు.
కొందరు నీటిని తాగేప్పుడు చాలా వేగంగా గటగటా తాగేస్తుంటారు. అలాగే ఒకేసారి అర లీటరు నుంచి లీటరు వరకు తాగుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల శరీరం పోషకాలను శోషించుకోవడానికి ఇబ్బంది పడుతుంది. పోషకాల్ని సరిగ్గా తీసుకోకుండానే విసర్జించేస్తుంది. ఎక్కువ నీటిని ఒక్కసారే తాగేయకుండా చిన్న చిన్న మొత్తంలో రోజంతా నీటిని తాగుతూ ఉండటం అనేది అవసరం.
కొంత మంది దాహంగా ఉన్నప్పుడు మాత్రమే నీటిని తాగాలని అనుకుంటారు. శరీరానికి అవసరం ఉన్నప్పుడు అదే అడుగుతుందని పొరపాటు పడుతుంటారు. దాహం వేసినా వేయకపోయినా రోజూ కనీసం రెండు లీటర్ల నీటిని తాగాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. సాయంత్రానికి ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి. అలాగే కొంత మంది టీ, కాఫీ, శీతల పానీయాల్లాంటి వాటిని ఎక్కువగా తాగుతుంటారు. ఆ ద్రవాలను కూడా నీటి లెక్కతో కలిపి లెక్క వేసుకోకూడదు. మిగిలినవి ఏమి తాగినప్పటికీ కూడా నీటిని రెండు లీటర్లు తాగాలని గుర్తుంచుకోవాలి.
ఏం నీటిని తాగుతున్నాం అనేది కూడా ఎప్పుడూ మనం దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయమే. ఇంటికి సరఫరా అయ్యే కుళాయి నీళ్లు అన్ని చోట్లా ఒకేలా ఉండవు. వాటిలో ఎక్కువగా క్లోరిన్, ఫ్లోరైడ్, ప్లాస్టిక్ నానో పార్టికిల్స్ లాంటివి ఉండే ప్రమాదం ఉంటుంది. ఇవన్నీ సంతానోత్పత్తి, హార్మోన్ల విడుదల, మెదడు పనితీరులపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి మీ దగ్గర వస్తున్న నీరు తాగేందుకు ఎంత వరకు సురక్షితం అనేది పరీక్ష చేయించుకుని ఉపయోగించుకోవడం మంచిది.