Dahanam review | దహనం వెబ్ సిరీస్ రివ్యూ... మిస్ ఫైర్ అయిన దహనం
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ నిర్మాణంలో రూపొందిన దహనం వెబ్‌సిరీస్ ఇటీవల ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ ద్వారా విడుదలైంది. ఏడు ఎపిసోడ్స్ గా తెరకెక్కిన ఈ సిరీస్ ఎలా ఉందంటే..
యథార్థ గాథలను వెండితెరపై ఆసక్తికరంగా ఆవిష్కరించడంలో దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ సిద్ధహస్తుడు. ముంబై మాఫియా మొదలుకొని రాయలసీమ ఫ్యాక్షనిజం ఆయన టచ్ చేయని క్రైమ్ కథాంశం లేదు. దివంగత పొలిటికల్ లీడర్ పరిటాల రవి కుటుంబ నేపథ్యం, అతడి తండ్రి శ్రీరాములు, సోదరుడు హరి జీవితాల ఆధారంగా రామ్‌గోపాల్‌వర్మ నిర్మించిన తాజా వెబ్‌సిరీస్ దహనం. అగస్త్య మంజు ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. అభిషేక్ దుహాన్, అభిలాష్ చౌదరి, అశ్వత్ కాంత్, నైనా గంగూలీ ఈ వెబ్‌సిరీస్‌లో కీలక పాత్రలను పోషించారు. ఎమ్ఎక్స్ ప్లేయర్ ద్వారా ఈ సిరీస్ విడుదలైంది. రాయలసీమ వర్గ పోరాటాల్ని ఈ వెబ్ సిరీస్ లో రామ్ గోపాల్ వర్మ బృందం ఏ విధంగా చూపించారు? వాస్తవికంగా జరిగిన చరిత్రనే ఇందులో చెప్పారా?లేదా? అన్నది చూద్దాం.
పరిటాల కుటుంబ కథ
రక్త చరిత్ర సినిమాలో పరిటాల రవి జీవితాన్ని చూపించారు రామ్‌గోపాల్‌వర్మ. పగ, ప్రతీకారాలతో అతడి జీవితం ఎలా అంతమైందో చెప్పారు. ఈ ఫ్యాక్షనిజం గొడవలకు దూరంగా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని అనుకున్న రవి అసలు ప్రతీకార పోరాటాన్ని మొదలుపెట్టడానికి కారణాలేమిటనేది ఈ సిరీస్ ద్వారా చెప్పాలని రామ్‌గోపాల్‌వర్మ అనుకున్నారు. పరిటాల రవి తండ్రి శ్రీరాములు తో పాటు అతడి సోదరుడు పరిటాల హరి జీవితాలతో ముడిపడి సాగుతుంది. భూస్వాముల పెత్తనాల్ని ఎదురిస్తూ పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుంటాడు శ్రీరాములయ్య(వినోద్ ఆనంద్). అతడికి ప్రజాదరణ పెరుగుతుండటం ఎమ్మెల్యే నారాయణరెడ్డి(ప్రదీప్ రావత్), అతడి అనుచరుడు చెన్నారెడ్డి కి(షాయాజీషిండే) కంటగింపుగా మారుతుంది. శ్రీరాములయ్యను అతడి అనుచరుడు సిద్దప్ప చేత హత్య చేయిస్తారు. తండ్రి మరణానికి కారణమైన వారిపై పగను పెంచుకుంటాడు శ్రీరాములయ్య కొడుకు నక్సలైట్ హరి(అభిషేక్ దుహాన్). ఒక్కొక్కరి హతమారుస్తుంటాడు. ఈ క్రమంలో తండ్రిని చంపించింది నారాయణరెడ్డి, చెన్నారెడ్డితో పాటు అతడి తనయులు ఓబుల్‌రెడ్డి, రమణారెడ్డి అనే నిజం హరికి తెలుస్తుంది. వారిని ఎదురించి పోరాడాలని హరి నిర్ణయించుకుంటాడు. హరి బ్రతికి ఉంటే తమ ప్రాణాలకు ప్రమాదమని భావిస్తారు చెన్నారెడ్డి, ఓబుల్‌రెడ్డి. హరిని చంపడానికి వారు ఎలాంటి ఎత్తులు వేశారు. వారి ప్లాన్స్ ఫలించాయా? చెన్నారెడ్డి ఫ్యామిలీతో పరిటాల శ్రీరాములు కుటుంబానికి ఉన్న తగాదాకు కారణమేమిటి? అన్నయ్య బాటలోనే అడుగులు వేయాలని రవి (అశ్వత్ కాంత్) ఎందుకు నిర్ణయించుకున్నాడు. హరితో జీవితాంతం కలిసి బతకాలన్న పావని(నైనా గంగూలీ) కల నెరవేరిందా లేదా అన్నదే మిగతా కథ.
హరి బయోపిక్
ఈ సిరీస్ పూర్తిగా పరిటాల హరి బయోపిక్‌లా సాగుతుంది. నక్సలిజంతో మొదలైన పోరు రెండు కుటుంబాల గొడవగా ఎలా మారింది? ఈ పోరాటంలో ఆ ఫ్యామిలీలకు ఎదురైన సంఘర్షణ, ఉద్వేగాల్ని ఇందులో చూపించారు. వాస్తవికంగా జరిగిన చరిత్రకు కమర్షియల్ హంగులను జోడిస్తూ సిరీస్ ను తెరకెక్కించారు. అలాగని ఎక్కువ స్వేచ్ఛ తీసుకోలేదు. రియలిస్టిక్‌గానే ఏం జరిగిందో చెప్పాలని అనుకున్నారు.
రాయలసీమ వర్గ పోరాటాలు
పరిటాల శ్రీరాములు కుటుంబ నేపథ్యాన్ని చూపిస్తూ తొలి ఎపిసోడ్ సాగుతుంది. తండ్రి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా హరి నక్సలిజం వైపు ఎందుకు వెళ్లాడో ఇందులో చెప్పారు. ఈ గొడవలకు దూరంగా తాను ప్రాణంగా ప్రేమించిన సునీతతో కలిసి రవి కొత్త జీవితాన్ని మొదలుపెట్టేందుకు కన్న కలలను ఆవిష్కరించారు. శ్రీరాములు హత్య తర్వాతే అసలు కథ మొదలవుతుంది. తండ్రి మరణానికి కారణమైన వారిని అంతమొందించేందుకు హరి తన అనుచరులైన సురేష్, చమన్‌లతో కలిసి చేసిన ప్రయత్నాలు, చెన్నారెడ్డితో పాటు అతడి తనయుడు ఓబుల్‌రెడ్డి ఉరవకొండ ప్రాంతంలో చేసే అన్యాయాలు, అక్రమాలతో మిగిలిన ఎపిసోడ్స్ సాగుతాయి. ఈ ఆధిపత్య పోరులో గెలుపు ఎవరిదనే అంశాన్ని ప్రజెంట్, ఫ్లాష్‌బ్యాక్ లతో డిఫరెంట్ స్ర్కీన్‌ప్లే టెక్నిక్ ద్వారా చెబుతూ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించేందుకు దర్శకుడు అగస్త్య మంజు ప్రయత్నించారు. నేరుగా కథలోకి వెళ్లకుండా పోలీస్ ఆఫీసర్ కోణం నుంచి చెప్పడం బాగుంది. దహనం కు మరో సీజన్ ఉంటుందని ముగింపులో చెప్పారు.
సోల్ మిస్సయింది
రాయలసీమ ప్రాంతంలో జరిగిన వాస్తవిక కథ ఇది. ఈ సిరీస్ లో కీలక పాత్రల్లో ఇతర భాషలకు చెందిన నటీనటులు ఎక్కువగా కనిపించడంతో డబ్బింగ్ సిరీస్ చూస్తున్న ఫీల్ కలుగుతుంది. సోల్ మిస్సయింది. హరి, రవి, ఓబుల్‌రెడ్డితోపాటు చాలా క్యారెక్టర్స్ చెప్పే డైలాగ్స్ వారి ముఖాల్లో కనిపించే హావభావాలకు సంబంధం ఉండదు. సిరీస్ ద్వారా చెప్పాలనుకున్న కథ చిన్నది కావడం, ఎపిసోడ్స్ ఎక్కువగా ఉండటంతో చాలా చోట్ల సాగదీసిన అనుభూతి కలుగుతుంది. ఓబుల్‌రెడ్డిలోని విలనిజాన్ని ఆవిష్కరించడానికి దర్శకుడు బూతును ఆశ్రయించాడు. అవన్నీ శృతిమించుతూ సాగుతాయి హరి, పావని తో పాటు రవి, సునీత మధ్య అనుబంధాన్ని అర్థవంతంగా చెప్పలేకపోయారు.
నటీనటుల పనితీరు
హరి పాత్ర ప్రధానంగానే ఈ సిరీస్ సాగుతుంది. ఈ పాత్రలో అభిషేక్ దుహాన్ పూర్తిగా తేలిపోయాడు. నటన, డైలాగ్ డెలివరీ బాగాలేవు. రవిగా అశ్వత్ కాంత్ ఎమోషన్స్ చక్కగా పలికించాడు. సురేష్ గా రవి కాలే, చమన్ పాత్రలో కంచెరపాలెం కిషోర్ నటన బాగుంది. పావని పాత్రలో నైనా గంగూళీ పర్వాలేదనిపించింది. శ్రీరాములయ్యగా వినోద్ ఆనంద్ మెప్పించారు. ఓబుల్‌రెడ్డి గా అభిలాష్ చౌదరి విలనిజం వర్కవుట్ కాలేదు. షాయాజీషిండే, ప్రదీప్ రావత్ నటన బాగున్నా వారి డబ్బింగ్ సరిగా కుదరలేదు.
ఒరిజినాలిటీ లేదు
దర్శకుడిగా అగస్త్యమంజు ప్రతిభను చాటిచెప్పే సీన్ ఒక్కటి కనిపించదు. అతడిపై రామ్‌గోపాల్‌వర్మ ప్రభావమే ఎక్కువగా కనిపించింది. కెమెరా షాట్స్, విజువల్స్ అన్ని ఇదివరకే వర్మ చాలా సినిమాల్లో చూసినవే. వాటిలోనూ కొత్తదనం కనిపించలేదు.
ఒరిజినాలిటీ మిస్సయిన ఓ రియలిస్టిక్ బయోపిక్ సిరీస్ ఇది. సినిమా ద్వారా చెబితే రెండు గంటల్లో ఈ కథకు న్యాయం చేయలేమని సిరీస్ ద్వారా కొత్తగా చెప్పాలని ప్రయత్నించిన రామ్ గోపాల్ వర్మ బృందం చేసిన ఈ ప్రయత్నం పూర్తిగా మిస్ ఫైర్ అయ్యింది.
సంబంధిత కథనం
టాపిక్