HanuMan: హనుమాన్‍కు ఆ వెర్షన్ రానుంది: ఆసక్తికర విషయం చెప్పిన దర్శకుడు ప్రశాంత్ వర్మ-hanuman remastered version movie will surprise more says director prasanth varma at 50 days event teja sajja ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hanuman: హనుమాన్‍కు ఆ వెర్షన్ రానుంది: ఆసక్తికర విషయం చెప్పిన దర్శకుడు ప్రశాంత్ వర్మ

HanuMan: హనుమాన్‍కు ఆ వెర్షన్ రానుంది: ఆసక్తికర విషయం చెప్పిన దర్శకుడు ప్రశాంత్ వర్మ

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 02, 2024 03:07 PM IST

HanuMan Director Prasanth Varma: హనుమాన్ సినిమా 50 రోజుల వేడుకను మూవీ టీమ్ నిర్వహించింది. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పారు.

దర్శకుడు ప్రశాంత్ వర్మ
దర్శకుడు ప్రశాంత్ వర్మ

HanuMan Movie: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ సినిమా భారీ బ్లాక్‍బాస్టర్ అయింది. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ సూపర్ హీరో చిత్రం సంచలన విజయం సాధించింది. రూ.40 కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కించిన ఈ మూవీ సుమారు రూ.350 కోట్ల వసూళ్లతో దుమ్మురేపింది. తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లోనూ మంచి వసూళ్లను సాధించింది. చాలా ప్రశంసలను పొందింది. జనవరి 12న రిలీజైన ఈ చిత్రం 50 రోజులను పూర్తి చేసుకుంది. ఈ తరుణంలో నేడు (మార్చి 2) హనుమాన్ మూవీ టీమ్ 50 రోజుల వేడుక నిర్వహించింది.

హనుమాన్ సినిమా 150 థియేటర్లలో 50 రోజులను పూర్తి చేసుకుందని మూవీ టీమ్ తెలిపింది. ఈ చిత్రం రిలీజై 50 రోజులు పూర్తయిన సందర్భంగా నేడు హిస్టారిక్ 50 డేస్ సెలెబ్రేషన్స్ నిర్వహించింది. ఈ ఈవెంట్‍లో దర్శకుడు ప్రశాంత్ వర్మ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

రీమాస్టర్డ్ వెర్షన్ వచ్చేస్తోంది

హనుమాన్ సినిమా రీమాస్టర్డ్ వెర్షన్ రానుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలిపారు. ఈ వెర్షన్ మరింత సర్‌ప్రైజ్ చేస్తుందని అన్నారు. అయితే, ఈ హనుమాన్ రీమాస్టర్డ్ వెర్షన్ మళ్లీ థియేటర్లలో రిలీజ్ అవుతుందా లేదా ఓటీటీలోకి వస్తుందా అనేది ప్రశాంత్ వర్మ స్పష్టతనివ్వలేదు. “ఈ సినిమా రీమాస్టర్డ్ వెర్షన్ రానుంది. ఇది ఇంకా ఎక్కువ సర్‌ప్రైజ్ చేయబోతోంది” అని ప్రశాంత్ వర్మ అన్నారు.

హనుమాన్ సినిమా 150 థియేటర్లలో 50 రోజులు ఆడడం అనేది చాలా మందికి నమ్మకాన్ని ఇస్తుందని ప్రశాంత్ వర్మ చెప్పారు. అందుకే ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం సినిమా ఓ వీకెండ్ ఆడితే చాలా డబ్బులు వచ్చేస్తాడనే మైండ్ సెట్ ఉందని, అయితే 50 రోజులు, 100 రోజులు కూడా ఆడుతుందనే నమ్మకాన్ని కొత్తగా వచ్చే దర్శకులు, నిర్మాతల్లో కలిగించేందుకు ఈ ఈవెంట్ చేస్తున్నట్టు వెల్లడించారు.

త్వరలో విదేశీ భాషల్లో..

హనుమాన్ సినిమాను త్వరలో అంతర్జాతీయ భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు ప్రశాంత్ వర్మ చెప్పారు. జపాన్, చైనా, స్పెయిన్‍‍లోని డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడామని, వారికి బాగా నచ్చిందని అన్నారు. త్వరలోనే అంతర్జాతీయ రిలీజ్ ఉంటుందని తెలిపారు. ప్రపంచ దేశాల్లో కూడా తెలుగు సినిమా గొప్పదనాన్ని హనుమాన్ చాటనుందని ప్రశాంత్ వర్మ సంతోషం వ్యక్తం చేశారు.

ఆధ్యాత్మికతను జోడించి సూపర్ హీరో సినిమాగా హనుమాన్‍ను ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన విధానంపై చాలా ప్రశంసలు వచ్చాయి. ఈ చిత్రంలో ఆంజనేయుడిని చూపించిన విధానం, పీఎఫ్‍ఎక్స్ అందరినీ మెప్పించాయి. ఈ సినిమాలో తేజ సజ్జా సరసన అమృత అయ్యర్ హీరోయిన్‍గా చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి నిర్మించారు. హనుమాన్‍కు సీక్వెల్‍గా జై హనుమాన్ సినిమా రానుంది.

హనుమాన్ సినిమా మార్చి 8వ తేదీన జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుందని అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Whats_app_banner