Blue Aadhaar Card: బ్లూ ఆధార్ కార్డ్ అంటే ఏమిటి? బ్లూ ఆధార్ కోసం ఎలా అప్లై చేయాలి?
Blue Aadhaar Card: ఆధార్ కార్డ్ ఇప్పుడు అత్యంత అవసరమైన డాక్యుమెంట్ గా మారింది. అనేక ఫైనాన్షియల్, బ్యాంకింగ్, గవర్న్మెంట్ కార్యకలాపాల కోసం ఆధార్ ను తప్పని సరి చేశారు. అయితే, ఆధార్ కార్డ్ ల్లో బ్లూ ఆధార్ అనే కార్డ్ కూడా ఉంటుంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Blue Aadhaar Card: ‘బ్లూ ఆధార్ కార్డ్’.. దీనినే ‘బాల్ ఆధార్ కార్డ్ (Baal Aadhaar Card)’ అని కూడా ఉంటారు. నీలి రంగులో ఉండే ఈ బ్లూ ఆధార్ కార్డును 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు జారీ చేస్తారు. పెద్దలకు జారీ చేసే సాధారణ ఆధార్ కార్డుల నుండి దీనిని వేరు చేయడానికి, దీనిని నీలం రంగులో ముద్రిస్తారు. ఈ బ్లూ ఆధార్ కార్డ్ పిల్లలకి 5 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు చెల్లుబాటు అవుతుంది. పిల్లలకు ఐదు సంవత్సరాలు నిండిన తరువాత వారి బయోమెట్రిక్ సమాచారాన్ని అప్ డేట్ చేసి సాధారణ ఆధార్ కార్డ్ ను తీసుకోవాల్సి ఉంటుంది.
బ్లూ ఆధార్ కార్డు ఎలా పనిచేస్తుంది?
ఈ బ్లూ ఆధార్ కార్డు (Blue Aadhaar Card) ను జారీ చేయడానికి పిల్లల బయోమెట్రిక్ డేటా అవసరం లేదు. దీనిని తల్లిదండ్రుల యుఐడితో అనుసంధానిస్తారు. డెమోగ్రాఫిక్ సమాచారం, ఫోటో ఆధారంగా ఈ బ్లూ ఆధార్ యూఐడీని ప్రాసెస్ చేస్తారు.
బ్లూ ఆధార్ కార్డు కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
బర్త్ సర్టిఫికేట్ లేదా ఆసుపత్రి డిశ్చార్జ్ స్లిప్ ఉపయోగించి నవజాత శిశువు కోసం తల్లిదండ్రులు ఈ బ్లూ ఆధార్ కార్డు (Blue Aadhaar Card) లేదా బాల్ ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పిల్లల స్కూల్ ఐడీని కూడా బాల్ ఆధార్ కార్డు కోసం ఉపయోగించుకోవచ్చు.
బ్లూ ఆధార్ కార్డు ఎందుకు ముఖ్యం?
ఈ కార్డు (Blue Aadhaar Card) ను పిల్లలకు అవసరమైన ప్రభుత్వ సంక్షేమ, సహాయ కార్యక్రమాలను పొందడంలో ఉపయోగించుకోవచ్చు. ఈడబ్ల్యుఎస్ స్కాలర్ షిప్ లను అందించడంలో సహాయపడుతుంది. పిల్లల స్కూల్ అడ్మిషన్ల ప్రక్రియలో బ్లూ ఆధార్ కార్డులను సమర్పించడాన్ని కూడా చాలా పాఠశాలలు తప్పనిసరి చేశాయి.
బ్లూ ఆధార్ కార్డు కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
బ్లూ ఆధార్ కోసం రిజిస్టర్ చేసుకోవడం కోసం ఈ కింద పేర్కొన్న స్టెప్స్ ఫాలో కావాలి.
- ముందుగా యూఐడీఏఐ (UIDAI website) వెబ్ సైట్ కు వెళ్లి ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోండి.
- పిల్లల పేరు, తల్లిదండ్రులు/సంరక్షకుల ఫోన్ నంబర్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ కోసం అపాయింట్మెంట్ స్లాట్ ఎంచుకోండి.
- దగ్గరలోని ఆధార్ ఎన్ రోల్మెంట్ సెంటర్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకుని, మీ ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, పిల్లల జనన ధృవీకరణ పత్రంతో సహా అవసరమైన పత్రాలతో నమోదు కేంద్రాన్ని సందర్శించండి.
- దీని తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
- వెరిఫికేషన్ చేసిన 60 రోజుల్లోగా మీ పిల్లల పేరు మీద బ్లూ ఆధార్ కార్డు జారీ అవుతుంది.