Reliance SBI Card: చేతులు కలిపిన రిలయన్స్, ఎస్బీఐ; మార్కెట్లోకి రిలయన్స్ ఎస్బీఐ కార్డ్, నెలకో సినిమా ఫ్రీ
Reliance SBI Card: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐ భాగస్వామ్య సంస్థ ఎస్బీఐ కార్డ్, రిలయన్స్ రిటైల్ తో చేతులు కలిపింది. రెండు సంస్థల భాగస్వామ్యంతో రెండు కొత్త క్రెడిట్ కార్డులు మార్కెట్లోకి వచ్చాయి.
Reliance SBI Card: ఎస్బీఐ కార్డ్, రిలయన్స్ రిటైల్ ల భాగస్వామ్యంలో రెండు వేరియంట్లలో కొత్త క్రెడిట్ కార్డులను ఆవిష్కరించారు. అవి రిలయన్స్ ఎస్బీఐ ప్రైమ్ కార్డ్ (Reliance SBI Prime Card) , రిలయన్స్ ఎస్బీఐ కార్డ్ (Reliance SBI Card). ఈ కార్డ్స్ తో వినియోగదారుల షాపింగ్ అనుభవం మరింత అద్భుతంగా మారుతుందని సంస్థ చెబుతోంది. రిలయన్స్ ఎస్బీఐ ప్రైమ్ కార్డ్ తీసుకున్నవారు ప్రతీ నెల బుక్ మై షో లో రూ. 250 విలువైన ఒక సినిమాను ఉచితంగా బుక్ చేసుకోవచ్చు.
రూపే క్రెడిట్ కార్డ్
ఎస్బీఐ కార్డ్, రిలయన్స్ రిటైల్ ల భాగస్వామ్యంలో వస్తున్న ఈ రెండు క్రెడిట్ కార్డులను రీ సైకిల్డ్ ప్లాస్టిక్ తో తయారు చేస్తున్నారు. ఇవి రూపే ప్లాట్ ఫామ్ పై పని చేస్తాయి. రిలయన్స్ రిటైల్ లోని వివిధ కేటగిరీల ప్రొడక్ట్స్ ను ఈ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసినప్పుడు వినియోగదారుడికి అత్యధిక రివార్డు పాయింట్లతో పాటు పలు ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. రివార్డు పాయింట్లు, వెల్ కం బెనిఫిట్స్, ట్రావెల్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రయోజనాలు, టార్గెట్ ను మించి స్పెండ్ చేస్తే రెన్యూవల్ ఫీజు నుంచి మినహాయింపు, రిలయన్స్ రిటైల్ ఓచర్స్.. మొదలైన ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
Reliance SBI Card: రూ. 499 తో రిలయన్స్ ఎస్బీఐ కార్డ్..
ఈ కార్డు రెన్యువల్ ఫీజు రూ. 499, పన్నులు అదనం. ఒకవేళ ఒక సంవత్సరంలో రూ. 1 లక్ష కు పైగా ఈ కార్డుతో లావాదేవీలు చేస్తే, తదుపరి సంవత్సరం రెన్యువల్ ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది. ఇవి ఇతర ప్రయోజనాలు..
- రిలయన్స్ రిటైల్ స్టోర్‌లలో ఖర్చు చేసే ప్రతీ రూ. 100కి 5 రివార్డ్ పాయింట్‌లు లభిస్తాయి. అదనంగా, డైనింగ్, సినిమాలపై ఖర్చు చేసే రూ. 100 కి మరో 5 రివార్డ్ పాయింట్లు ఉంటాయి.
- అన్ని పెట్రోల్ పంపులలో 1 శాతం సర్‌ఛార్జ్ మినహాయింపు ఉంటుంది.
- వివిధ రిలయన్స్ రిటైల్ స్టోర్‌లలో రూ. 3,200 విలువైన అదనపు డిస్కౌంట్ వోచర్‌లు లభిస్తాయి.
- రిలయన్స్ రిటైల్ స్టోర్లలో ఈ కార్డు ద్వారా సంవత్సరంలో రూ. 25,000 ఖర్చు చేస్తే.. రూ.500 విలువైన రిలయన్స్ రిటైల్ వోచర్ లభిస్తుంది. ఒకవేళ రూ. 50 వేలు ఖర్చు చేస్తే రూ. 750 విలువైన వోచర్, రూ. 80 వేలు ఖర్చు చేస్తే, రూ. 1000 విలువైన వోచర్ లభిస్తుంది.
Reliance SBI Prime Card: రూ. 2999 తో రిలయన్స్ ఎస్బీఐ ప్రైమ్ కార్డ్..
ఈ కార్డు రెన్యువల్ ఫీజు రూ. 2999, పన్నులు అదనం. ఒకవేళ ఒక సంవత్సరంలో రూ. 3 లక్ష కు పైగా ఈ కార్డుతో లావాదేవీలు చేస్తే, తదుపరి సంవత్సరం రెన్యువల్ ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది. ఇవి ఇతర ప్రయోజనాలు..
- జాయినింగ్ ఫీజు చెల్లించగానే, రూ. 3 విలువైన రిలయన్స్ డిస్కౌంట్ వోచర్ లను అందిస్తారు.
- రిలయన్స్ రిటైల్ స్టోర్‌లలో ఖర్చు చేసే ప్రతీ రూ. 100కి 10 రివార్డ్ పాయింట్‌లు లభిస్తాయి. అదనంగా, ఫ్లైట్ బుకింగ్స్, డైనింగ్, సినిమాలపై ఖర్చు చేసే రూ. 100 కి మరో 5 రివార్డ్ పాయింట్లు ఉంటాయి.
- అన్ని పెట్రోల్ పంపులలో 2 శాతం సర్‌ఛార్జ్ మినహాయింపు ఉంటుంది.
- వివిధ రిలయన్స్ రిటైల్ స్టోర్‌లలో రూ. 11,900 విలువైన అదనపు డిస్కౌంట్ వోచర్‌లు లభిస్తాయి.