Flipkart’s loss widen: ఫ్లిప్‌కార్ట్‌కు రూ. 4,361 కోట్ల నష్టాలు..
Flipkart’s loss widen: వాల్‌మార్ట్ యాజమాన్యం పరిధిలోని ఫ్లిప్‌కార్ట్ నష్టాలు భారీగా పెరిగాయి.
ఈ కామర్స్ వ్యాపారంలో నిమగ్నమైన ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నేషనల్ ప్రయివేటు లిమిటెడ్ నికర నష్టాలు 51 శాతం పెరిగి రూ. 4,361 కోట్లకు చేరుకున్నాయి.
2022 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం 31 శాతం పెరిగి రూ. 10,659 కోట్లకు చేరుకుంది. వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఈ కంపెనీ రవాణా, మార్కెటింగ్, లీగల్ ఛార్జీలు పెరగడంతో నికర నష్టాలు 51 శాతం పెరిగి రూ. 4,362 కోట్లకు చేరుకున్నాయి.
కంపెనీ మొత్తం వ్యయాలు అంతకుముందు ఏడాది రూ. 10,996 కోట్లు ఉండగా.. ఇప్పుడవి రూ. 15,020 కోట్లకు చేరుకున్నాయి.
ఫ్లిప్‌కార్ట్ ఆపరేటింగ్ రెవెన్యూ 2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 7,804 నుంచి రూ. 10,477 కోట్లకు పెరిగింది. అయితే ఆపరేటింగ్ నష్టాలు లేదా ఎబిటా (వడ్డీలు, పన్నులు, తరగుదల తీసివేయకముందు ఉండే ఆదాయం) నష్టాలు రూ. 3,925 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాదిలో ఇది రూ. 2,267 కోట్లుగా ఉంది.
ఫ్లిప్‌కార్ట్ రెవెన్యూ ప్రధానంగా ఈ-కామర్స్ వ్యాపారం, ఐటీఈఎస్, ఇన్యూరెన్స్ కంపెనీలకు కార్పొరెట్ ఏజెంట్‌గా ఉండడం తదితర సపోర్ట్ సేవల నుంచి వస్తుంది.
కాగా ఎంప్లాయీ బెనిఫిట్స్ మొత్తం వ్యయాల్లో నాలుగో వంతుగా.. అంటే రూ. 3,735 కోట్లుగా ఉంది. కంపెనీ ఇతర వ్యయాలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2022 ఆర్థిక సంవత్సరంలో భారీగా పెరిగాయి. ముఖ్యంగా ట్రాన్సాక్షన్ కాస్ట్ బాగా పెరిగింది.
ఇక ఫ్లిప్‌కార్ట్ అడ్వర్టయిజింగ్, ప్రమోషన్లపై గత ఏడాది రూ. 1,073 కోట్లు ఖర్చుచేయగా, 2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 1946 కోట్లు ఖర్చుచేసింది.
2022 ఆర్థిక సంవత్సరంలో ఫ్లిప్‌కార్ట్ కంపెనీ లీగల్ ఛార్జీలకే రూ. 1,224 కోట్లు చెల్లించింది. అంతకుముందు ఏడాది రూ. 837 కోట్లుగా ఉంది.
2022 ఆర్థిక సంవత్సరంలో ఫ్లిప్‌కార్ట్ వీడియో స్ట్రీమింగ్, డిస్ట్రిబ్యూషన్, హోస్టింగ్ సర్వీసుల్లోకి వెళ్లింది. ఒరిజినల్ కంటెంట్ సృష్టించడం, ఇతర సర్వీసు ప్రొవైడర్ల నుంచి వినియోగించడం ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్ కంపెనీ అడ్వర్టయిజింగ్, ప్రమోషనల్ యాక్టివిటీస్, లాయల్టీ ప్రోగ్రామ్స్ కూడా చేపడుతోంది.