మంచి లైఫ్‌స్టైల్, తక్కువ పన్ను కోసం దేశం మారిన బెంగళూరు జంట.. వాళ్లు ఏం చెబుతున్నారంటే?-bengaluru couple moves to europe for better quality of life lower taxes know their opinion ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  మంచి లైఫ్‌స్టైల్, తక్కువ పన్ను కోసం దేశం మారిన బెంగళూరు జంట.. వాళ్లు ఏం చెబుతున్నారంటే?

మంచి లైఫ్‌స్టైల్, తక్కువ పన్ను కోసం దేశం మారిన బెంగళూరు జంట.. వాళ్లు ఏం చెబుతున్నారంటే?

Anand Sai HT Telugu
Sep 05, 2024 03:03 PM IST

Bengaluru Couple : మంచి లైఫ్‌స్టైల్, తక్కువ పన్ను భారం కోసం ఓ జంట దేశమే మారింది. యూరోపియన్ దేశమైన లక్సెంబర్గ్‌కు వెళ్లింది. అక్కడ పన్ను విధానం, జీవన ప్రమాణాల గురించి వారు చెప్పుకొచ్చారు.

ప్రతీక్ గుప్తా, నేహా మహేశ్వరి
ప్రతీక్ గుప్తా, నేహా మహేశ్వరి

చాలా మంది ఇతర దేశాలకు బతికేందుకు వెళ్తుంటారు. అక్కడి పద్ధతులకు అలవాటై అక్కడే నివసిస్తారు. ఎవరెళ్లినా డబ్బు సంపాదన కోసమే మరో దేశం వైపు వెళ్తుంటారు. అలానే ప్రతీక్ గుప్తా, నేహా మహేశ్వరి అనే జంట బెంగళూరు నుంచి చిన్న యూరోపియన్ దేశమైన లక్సెంబర్గ్‌కు వెళ్లింది. భారతదేశంతో పోలిస్తే ఐరోపాలో నివసించడం వల్ల కలిగే ప్రయోజనాలు, లోపాల గురించి వారు మాట్లాడారు.

ప్రతీక్ అమెజాన్‌లో సీనియర్ అనలిస్ట్ కాగా, నేహా జర్మన్ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఫైనాన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. భారత్‌లో నివసించడం వల్ల పెద్ద ఇంక్రిమెంట్లు వచ్చేవని, అమెరికా లేదా దుబాయ్‌లాంటి దేశాలకు వెళ్లడం ద్వారా కూడా ఎక్కువ సంపాదించవచ్చని ఎన్‌ఆర్‌ఐ దంపతులు అంగీకరిస్తున్నారు. అయితే యూరప్ గురించి కూడా ఈ జంట సంతోషాన్ని వ్యక్తం చేసింది.

'భారత్‌లో కొనసాగడం లేదా అమెరికా వెళ్లడం వల్ల మాకు మరిన్ని కెరీర్, సంపాదన అవకాశాలు లభించేవి. కానీ యూరప్ అందించే మెరుగైన జీవన నాణ్యతను రుచి చూడాలనుకున్నాం. శ్రామిక వర్గం భారతీయులు ఎక్కువ డబ్బు కోసం యూరప్‌కు రారు. అమెరికా లేదా దుబాయ్‌కు వెళితే 1.5-2 రెట్లు ఎక్కువ సంపాదించవచ్చు. నికర పొదుపు కూడా ఎక్కువగా ఉంటుంది.' అని ప్రతీక్ వివరించారు.

తక్కువ పన్నులు, మెరుగైన సేవలు

ప్రతీక్, నేహా తమ ఆదాయంలో 28 శాతం పన్నుగా చెల్లిస్తారు. ఇది భారతదేశంలో చెల్లించే దానికంటే 2-3 శాతం తక్కువ అవుతుంది. ట్యాక్స్ కట్టడమే కాదు.. అక్కడ పొందే సేవల గురించి వారు సంతోషంగా ఉన్నారు. 'మన వ్యక్తిగత ఆదాయంలో 3 శాతాన్ని తప్పనిసరిగా ప్రభుత్వ ప్రాయోజిత ఆరోగ్య బీమాకు అందించాలి. కేవలం 3 శాతం ఖర్చుతో, దంత సంరక్షణ మినహా ఆరోగ్య సంరక్షణ పూర్తిగా ఉచితం.' అని నేహా వెల్లడించారు.

నిరుద్యోగ నిధి

ఈ జంట మెచ్చే లక్సెంబర్గ్ పన్ను మరొక లక్షణం నిరుద్యోగ నిధి, దీనికి వారిద్దరూ వారి వారి ఆదాయాలలో 2 శాతం విరాళం ఇవ్వాలి. ఈ పథకం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

'ఎవరైనా ఉద్యోగంలో నుంచి తొలగించబడితే రెండు సంవత్సరాలు లేదా మరొక ఉద్యోగం దొరికే వరకు చివరిగా తీసుకున్న జీతంలో 80 శాతం ప్రభుత్వం చెల్లిస్తుంది. నా వార్షిక ఆదాయంలో 5 శాతంతో రెండు ప్రధాన అత్యవసర పరిస్థితులకు కవర్ చేస్తాను. అవి వైద్య, ఉద్యోగ నష్టం. దీని వలన అత్యవసర నిధిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు.' అని నేహా చెప్పారు.

లగ్జరీ కార్లు, యూరోపియన్ హాలిడేస్

నేహా, ప్రతీక్‌లకు లక్సెంబర్గ్‌లో నివసించడంతో మరొక ప్రయోజనం ఏంటంటే.. యూరోపియన్ సెలవులు, లగ్జరీ కార్లను కొనుగోలు చేయగలగడం. వీరికి మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ కారు ఉంది. దీని ఖరీదు సుమారు 43,000 యూరోలు. అయితే బెంగళూరులో ఇలాంటి కారు ధర రూ.55 లక్షలు. భారత్ లో రూ.50 లక్షలకు పైగా ఖరీదు చేసే లగ్జరీ కారును అంత సులభంగా కొనలేమని ప్రతీక్ అన్నారు. ఈ జర్మన్ లగ్జరీ కార్ల ధర లక్సెంబర్గ్‌లో చాలా తక్కువని, యూరోల ఆదాయంతో పోలిస్తే ఇది చాలా చౌకగా ఉంటుందని చెప్పారు.

పర్చేజింగ్ పవర్ ప్యారిటీ (పీపీపీ) అనేది ప్రతి దేశంలో ఒక వస్తు, సేవలకు ఎంత ఖర్చు అవుతుందో చూడటం ద్వారా వివిధ కరెన్సీల విలువను పోల్చే ఒక పద్ధతి. జాతీయ ఆదాయాలు, జీవన ప్రమాణాల మధ్య పోలికలను చేయడానికి ఉపయోగించే ఒక సాధనం. మరోవైపు యూరప్‌లో సెలవులు కూడా సరసమైనవని చెబుతుంది ఈ జంట. ఎందుకంటే వారు సంపాదించే కరెన్సీలోనే ఖర్చు చేస్తారు.