Dial Your EO TTD : తిరుమలలోని గదుల కేటాయింపు వ్యవస్థ ఇక తిరుపతిలో-tirumala rooms allotment in tirupati soon ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  Tirumala Rooms Allotment In Tirupati Soon

Dial Your EO TTD : తిరుమలలోని గదుల కేటాయింపు వ్యవస్థ ఇక తిరుపతిలో

HT Telugu Desk HT Telugu
Oct 09, 2022 06:07 PM IST

Tirumala Tirupati Devasthanam : తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు వ్యవస్థను తిరుపతిలో చేపట్టనున్నట్టుగా ఈవో ధర్మారెడ్డి చెప్పారు. అందరి కృషితో బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యాయని తెలిపారు.

తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల తిరుపతి దేవస్థానం

తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు వ్యవస్థను త్వరలో తిరుపతి(Tiurpati)లో చేపట్టనున్నట్టుగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి(TTD EO Dharmareddy) తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఆదివారం డయల్ యువర్ ఈవో(Dial Your EO) కార్యక్రమం నిర్వహించారు. టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, జిల్లా యంత్రాంగం, పోలీసులు, శ్రీవారి సేవకుల సమిష్టి కృషి, భక్తుల సహకారంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యాయని చెప్పారు. టీటీడీ అధికారులు, సిబ్బంది, ఎస్వీబీసీతోపాటు తమ ఛానళ్లలో శ్రీవారి వైభవాన్ని భక్తులకు తెలియజేసిన ప్రచార, ప్రసార సాధనాల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ట్రెండింగ్ వార్తలు

సీఎం జగన్(CM Jagan) సెప్టెంబరు 27వ తేదీన తిరుపతి నుండి తిరుమలకు విద్యుత్‌ బస్సులు ప్రారంభించారని, స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి పెద్దశేష వాహన సేవలో పాల్గొన్నాన్నారు. సెప్టెంబరు 28వ తేదీన నూతనంగా నిర్మించిన పరకామణి భవనం, విపిఆర్‌ గెస్ట్‌ హౌస్‌ ప్రారంభించారన్నారు. గరుడ సేవ(Garuda Seva) నాడు దాదాపు మూడు లక్షల మంది భక్తులకు పైగా వాహనసేవ దర్శనభాగ్యం కల్పించామని ధర్మారెడ్డి వెల్లడించారు.

రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి 147 బస్సుల ద్వారా 6,997 మంది వెనకబడిన పేద వర్గాలవారిని ఉచితంగా తిరుమలకు తీసుకొచ్చి శ్రీవారి మూలమూర్తి దర్శనంతో పాటు వాహనసేవల(Vahana Sevalu) దర్శనం చేయించామని ఈవో తెలిపారు. తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు వ్యవస్థను తిరుపతిలో చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు. తద్వారా తిరుమల(Tirumala)లో గదులు దొరకని భక్తులు తిరుపతిలోనే వసతి పొందే అవకాశం ఉంటుందన్నారు. త్వరలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని మొదలుపెడతామని ధర్మారెడ్డి చెప్పారు.

శ్రీవారి దర్శనార్థం కంపార్ట్‌మెంట్లలో రాత్రి వేళ వేచి ఉండే సామాన్య భక్తులకు ఉదయం త్వరగా దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటామని టీటీడీ(TTD) ఈవో తెలిపారు. వీఐపీ బ్రేక్‌ దర్శన సమయాన్ని ఉదయం 10 గంటలకు మార్పు చేసి ప్రయోగాత్మకంగా అమలుచేస్తామన్నారు.

క్యాలెండర్లు, డైరీలు తిరుమల, తిరుపతిలోని టీటీడీ పుస్తక విక్రయశాలల్లో అందుబాటులో ఉన్నాయని ఈవో ధర్మారెడ్డి చెప్పారు. ఇతర ప్రాంతాల్లోని టీటీడీ సమాచార కేంద్రాల్లో వచ్చే వారం నుండి అందుబాటులో ఉంచుతామని తెలిపారు. పెరటాసి మాసం మూడో శనివారంతో పాటు వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిందని, తిరుమలకు వచ్చే భక్తుల దర్శనానికి దాదాపు 48 గంటల సమయం పడుతోందన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు ఈవో ధర్మారెడ్డి.

'తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో సేవలందించే శ్రీవారి సేవకులు(Srivari Sevakulu) ఆయా మార్గాలను తెలుసుకునేందుకు వీలుగా రూపొందించిన క్యూఆర్‌ కోడ్‌ విధానం విజయవంతమైంది. భక్తుల కోసం త్వరలో తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తాం. నిత్య, వారసేవలు, ఉత్సవాలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తున్నాం. అక్టోబరు 11 నుండి 15వ తేదీ వరకు హైదరాబాద్‌(Hyderabad) ఎన్‌టీఆర్‌ స్టేడియంలో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. అక్టోబరు 11న వసంతోత్సవం, 12న సహస్ర కలశాభిషేకం, 13న తిరుప్పావడ, 14న నిజపాద దర్శనం, 15న సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం నిర్వహించనున్నాం. డిసెంబరులో ప్రకాశం జిల్లా ఒంగోలు, జనవరిలో దిల్లీ లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తాం.' అని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

సెప్టెంబ‌రు నెలలోని వివరాలు

దర్శనం : శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 21.12 లక్షలు.

హుండీ : హుండీ కానుకలు రూ.122.19 కోట్లు.

లడ్డూలు : విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య 98.74 ల‌క్షలు.

అన్నప్రసాదం : అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 44.71 లక్షలు.

కల్యాణకట్ట : తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 9.02 లక్షలు.

WhatsApp channel