TTD : ప్రైవేటు సంస్థలకు విరాళాలు ఇవ్వొద్దు: టీటీడీ-ttd cautions devotees over fake advertisements on annadanam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd : ప్రైవేటు సంస్థలకు విరాళాలు ఇవ్వొద్దు: టీటీడీ

TTD : ప్రైవేటు సంస్థలకు విరాళాలు ఇవ్వొద్దు: టీటీడీ

HT Telugu Desk HT Telugu
Sep 19, 2022 08:23 AM IST

TTD తిరుమలలో అన్నదానం పేరు చెప్పే ప్రైవేటు సంస్థలకు విరాళాలు ఇవ్వొద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. అలాంటి విరాళాలు టీటీడీకి చేరవని స్పష్టం చేసింది.

ప్రైవేట్‌ వారికి అన్నదాన విరాళాలు ఇవ్వొద్దని టీటీడీ సూచన
ప్రైవేట్‌ వారికి అన్నదాన విరాళాలు ఇవ్వొద్దని టీటీడీ సూచన (HT)

TTD తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉచితంగా అన్నప్రసాదం అందజేస్తున్నామని టీటీడీ వెల్లడించింది. అన్నదానం పేరు చెప్పే ప్రైవేటు సంస్థలకు విరాళాలు ఇవ్వొద్దని భక్తులకు స్పష్టం చేసింది. సికింద్రాబాద్ అనంత గోవిందదాస ట్రస్టుకు, తమకు ఎలాంటి సంబంధం లేదని టీటీడీ వెల్లడించింది. అక్రమంగా విరాళాలు సేకరించే ట్రస్టులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

TTD ఆధ్వర్యంలో నిత్యాన్నదానం నిరంతరం సాగుతుంది. అన్నదాన ట్రస్టుకు పెద్దఎత్తున భక్తులు విరాళాలు సమర్పిస్తుంటారు. దీంతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అన్నదానం ట్రస్టుకు విరాళాలు అందుతుంటాయి. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులు స్వామి వారి అన్నదాన సత్రంలో అన్న ప్రసాద స్వీకరాన్ని అదృష్టంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో టీటీడీకి సంబంధం లేని వ్యక్తులు ఇటీవల కాలంలో అనిధికారికంగా విరాళాలు సేకరిస్తున్నట్లు టీటీడీకి ఫిర్యాదులు అందుతున్నాయి.

తిరుమల కొండపై అన్నదానం పేరుతో వివిధ ప్రాంతాల్లో భక్తుల నుంచి విరాళాలు సేకరిస్తున్న వారితో అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది. ప్రైవేట్ వ్యక్తులు సేకరించే విరాళాలతో టీటీడీకి ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేసింది.

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వెంగమాంబ అన్నదాన సత్రంలో నిత్యం వేలాది మందికి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అడ్డుపెట్టుకుని ప్రైవేట్ వ్యక్తులు విరాళాలు సేకరణ జరుపుతుండటంతో వారితో అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది. అనధికారికంగా విరాళాలు సేకరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తిరుమల శ్రీవారిని పేరును తలపించేలా రకరకాల అనుకరణ పేర్లతో ప్రైవేట్ వ్యక్తులు విరాళాలను సేకరిస్తున్నట్లు టీటీడీ విజిలెన్స్‌ విభాగం గుర్తించింది.

కొండపై ఎలక్ట్రిక్ బస్సులు….

తిరుమల కొండ నుంచి ఇతర ప్రాంతాలకు టీటీడీ విద్యుత్ బస్సులు ప్రవేశపెడుతోంది. ఈ బస్సులను సీఎం జగన్ ఈ నెల 27న బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రారంభించనున్నారు. ఎలక్ట్రిక్‌ బస్సులు ఇప్పటికే అలిపిరి డిపోకు చేరుకున్నాయి. తిరుమల-తిరుపతి, తిరుపతి-రేణిగుంట ఎయిర్ పోర్టు మధ్య 64 బస్సులు, కడప, నెల్లూరు, మదనపల్లె పట్టణాలకు 12 చొప్పున ఈ విద్యుత్ ఆధారిత బస్సులను నడపనున్నారు.

IPL_Entry_Point

టాపిక్