TS Politics: రేవంత్ రెడ్డి 'ఘర్‌ వాపసీ' నినాదం.. కమలదళంలో అలజడి..! వ్యూహం ఫలించేనా..?-telangana assembly elections ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Assembly Elections

TS Politics: రేవంత్ రెడ్డి 'ఘర్‌ వాపసీ' నినాదం.. కమలదళంలో అలజడి..! వ్యూహం ఫలించేనా..?

HT Telugu Desk HT Telugu
May 20, 2023 05:30 AM IST

Telangana Assembly Elections 2023: తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కీలక నేతలు కూడా పార్టీలు మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్… తెలంగాణ బీజేపీలో అలజడి రేపినట్లు అయింది.

రేవంత్ రెడ్డి కామెంట్స్... బీజేపీలో అలజడి
రేవంత్ రెడ్డి కామెంట్స్... బీజేపీలో అలజడి

Telangana Assembly Elections 2023 Updates: మరికొద్ది నెలల్లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలు రచించే పనిలో పడ్డాయి. ఓ వైపు ప్రజల్లోకి వెళ్తూనే... ప్రత్యర్థులను ఢీకొట్టేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్టీలో చేరికలపై కూడా దృష్టిపెడుతున్నాయి. ప్రత్యర్థులను బోల్తా కొట్టించేలా అడుగులు వేస్తున్నాయి. అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత… రాష్ట్రంలో కాంగ్రెస్ మరింత దూకుడు పెంచేందుకు సిద్ధమైంది. పార్టీని వీడిన నేతలను తిరిగి రప్పించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అది కాస్త…. తెలంగాణ బీజేపీలో అలజడి రేపినట్లు అయింది.

ట్రెండింగ్ వార్తలు

బీజేపీలోకి వెళ్లిన కాంగ్రెస్ నేతలను ఉద్దేశిస్తూ టీపీసీసీ అధ్యక్షు రేవంత్ రెడ్డి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఇది కాస్త తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు కాంగ్రెస్ లోకి రావాలని ఆయన బహిరంగంగానే విజ్ఞప్తి చేశారు. ఇదే మా ఆహ్వానం అని... అవసరమైతే తాను పది మెట్లు కిందకి దిగుతానంటూ మాట్లాడేశారు. తనతో మాట్లాడటం ఇష్టం లేకపోతే హైకమాండ్ పెద్దలతోనే నేరుగా మాట్లాడవచ్చు అంటూ హింట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ కామెంట్సే... తెలంగాణ బీజేపీలో గుబులు రేపుతోంది. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్ కాంగ్రెస్ లోకి వెళ్తున్నారంటూ ప్రచారం జరగుతోంది. దీనిపై సదరు నేతలు స్పందించాల్సి వచ్చింది. తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని... తాము బీజేపీలోనే ఉంటామని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ను ఢీకొట్టే సత్తా బీజేపీకే ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఫలితంగా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన పలువురు నేతలు డైలామాలో పడినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఓపెన్ ఆఫర్ కాస్త... కమలదళంలో అలజడికి కారణమైందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కొందరు నేతలు తిరిగి సొంత గూటికి చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు కీలకమైన కర్ణాటకలో గెలవటం ద్వారా తెలంగాణ కాంగ్రెస్ నేతల్లోనూ మరింత ఆత్మవిశ్వాసం పెరిగినట్లు కనిపిస్తోంది. నిజానికి కర్ణాటక కాంగ్రెస్ లోనూ విభేదాలు ఉన్నప్పటికీ... ఎన్నికల నాటికి అన్నింటిని పక్కనపెట్టేశారు. ప్రత్యర్థిని పడగొట్టడమే లక్ష్యంగా పని చేశారు. అలాంటి ఫార్ములానే తెలంగాణలో కూడా అమలు చేసేందుకు హస్తం అధినాయకత్వం ప్రయత్నిస్తోంది. ఆ దిశగా ఇప్పటికే మిషన్ ను షురూ చేసింది. పాదయాత్రలు, దీక్షలు, నిరసన ర్యాలీలతో ప్రజల్లోకి వెళ్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు.... కొద్దిరోజుల కిందటే అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీని హైదరాబాద్ కు రప్పించారు. యూత్ ను ఆకర్షించేలా డిక్లరేషన్ ను కూడా ప్రకటించారు. మరికొద్దిరోజుల్లోనే రాహుల్ గాంధీ కూడా రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.... పక్కాగా ప్రణాళికలు రచిస్తూ ముందుకెళ్లాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఎన్నికలకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. ఇప్పటికే ఎంపీ కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి నేతలు సమైక్యరాగం వినిపిస్తున్నారు. ఎలాగైనా బీఆర్ఎస్ సర్కార్ ను ఓడించాలని పిలుపునిస్తున్నారు. విబేధాలను పక్కనపెట్టి కలిసిగట్టుగా పని చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా కర్ణాటక ప్రజలు ఇచ్చిన బూస్ట్ తో ఇక్కడ కూడా ఆ దిశగానే పని చేసే అవకాశం ఉంది. హైకమాండ్ కూడా... ఏ చిన్న అవకాశాన్ని వదలుకోకుండా... వర్కౌట్ చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే పార్టీని వీడిన నేతలను రప్పించాలని చూస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం