Karnataka CM: ఉత్కంఠకు తెర: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య: కాంగ్రెస్ అధికారిక ప్రకటన-siddaramaiah to be karnataka chief minister dk shivakumar his deputy and pcc chief till 2024 polls congress announce off ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Siddaramaiah To Be Karnataka Chief Minister Dk Shivakumar His Deputy And Pcc Chief Till 2024 Polls Congress Announce Off

Karnataka CM: ఉత్కంఠకు తెర: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య: కాంగ్రెస్ అధికారిక ప్రకటన

Chatakonda Krishna Prakash HT Telugu
May 18, 2023 12:34 PM IST

Karnataka CM: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.

Karnataka CM: ఉత్కంఠకు తెర: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య: కాంగ్రెస్ అధికారిక ప్రకటన
Karnataka CM: ఉత్కంఠకు తెర: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య: కాంగ్రెస్ అధికారిక ప్రకటన (PTI)

Karnataka CM: అనేక చర్చల తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు కాంగ్రెస్ (Congress) పార్టీ తెరదించింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సీనియర్ లీడర్ సిద్ధరామయ్య (Siddaramaiah) పేరును కాంగ్రెస్ ఖరారు చేసింది. ఈ విషయాన్ని గురువారం అధికారికంగా ప్రకటించింది. కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ (DK Shivakumar) ఉండనున్నారు. అలాగే 2024 లోక్‍సభ ఎన్నికల వరకు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా శివకుమార్ కొనసాగనున్నారు. ఈ విషయాలను కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా శివకుమార్, కొందరు మంత్రులు ఈనెల 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన వెల్లడించారు. ఈనెల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 సీట్లను కైవసం చేసుకొని ఘన విజయం సాధించింది.

ట్రెండింగ్ వార్తలు

అందుకే నిర్ణయం ఆలస్యం

సిద్దరామయ్య, డీకే శివకుమార్.. ఇద్దరిలో ఎవరిని సీఎం చేయాలన్న నిర్ణయం తీసుకోవడంలో ఎందుకు ఆలస్యమైందో కేసీ వేణుగోపాల్ చెప్పారు. “కొన్ని రోజులుగా మేం ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్నాం. కర్ణాటకలో మాకు అద్భుతమైన నాయకులు ఉన్నారు. సిద్ధరామయ్య అపార అనుభవం ఉన్న నాయకుడు. ముఖ్యమంత్రి అవ్వాలనే కోరిక అందరికీ ఉంటుంది. సీఎం పదవికి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ అర్హులే. అయితే మా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు వరుసగా సంప్రదింపులు జరిపారు. నిర్ణయం తీసుకున్నారు” అని కేసీ వేణుగోపాల్ చెప్పారు. చెరో రెండున్నరేళ్లు సిద్ధరామయ్య, శివకుమార్ సీఎం స్థానాన్ని పంచుకుంటాన్న ఫార్ములాపై కూడా కేసీ వేణుగోపాల్ స్పందించారు. పవర్ షేరింగ్ అంటే అది కర్ణాటక ప్రజలతో పంచుకోవడమేనని అన్నారు.

ఈనెల 13వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 135 స్థానాలను కాంగ్రెస్ పార్టీ సాధించింది. అధికారాన్ని చేపట్టేందుకు అవసరమైన మెజార్టీ కంటే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంది. అయితే, సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పోటీలో ఉండటంతో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం తెచ్చేందుకు హస్తం పార్టీ అధిష్టానం తీవ్ర చర్చలు జరిపింది. సీఎం కుర్చీ కోసం పట్టుబట్టిన శివకుమార్‌ను కాంగ్రెస్ చివరికి డిప్యూటీ సీఎం పదవికి ఒప్పించగలిగింది.

సోనియా గాంధీ జోక్యంతో..

కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షురాలు, సీనియర్ నేత సోనియా గాంధీతో మాట్లాడిన తర్వాత డీకే శివకుమార్ తన పట్టును వీడినట్టు తెలుస్తోంది. సోనియాతో చర్చ తర్వాత.. కర్ణాటకలో నంబర్ 2 స్థానానికి ఆయన అంగీకరించారని సమాచారం. పార్టీ ప్రయోజనాల కోసం సీఎం పదవిని ఇప్పటికి త్యాగం చేసేందుకు ఆయన ఓకే చెప్పారు. అయితే పార్టీ నిర్ణయం పట్ల తాము కాస్త నిరాశగానే ఉన్నామని శివకుమార్ సోదరుడు, ఎంపీ డీకే సురేశ్ అన్నారు.

రెండు రోజులుగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌తో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ ఢిల్లీలో చర్చలు జరిపారు. బుధవారం అర్ధరాత్రి తర్వాత కూడా ఇద్దరు నేతలతో ఖర్గే మాట్లాడినట్టు సమాచారం.

కాగా, సిద్ధరామయ్య రెండోసారి కర్ణాటక ముఖ్యమంత్రిగా పదవి చేపట్టనున్నారు. గతంలో 2013 నుంచి 2018 వరకు సీఎంగా ఆయన పని చేశారు.

IPL_Entry_Point