Revanth Reddy Comments : 'మీరంతా పార్టీలోకి వచ్చేయండి'.. ఓ మెట్టు దిగుతానంటూ రేవంత్ రెడ్డి కామెంట్స్-tpcc chief revanth reddy comments on farmer congress leader ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Revanth Reddy Comments : 'మీరంతా పార్టీలోకి వచ్చేయండి'.. ఓ మెట్టు దిగుతానంటూ రేవంత్ రెడ్డి కామెంట్స్

Revanth Reddy Comments : 'మీరంతా పార్టీలోకి వచ్చేయండి'.. ఓ మెట్టు దిగుతానంటూ రేవంత్ రెడ్డి కామెంట్స్

HT Telugu Desk HT Telugu
May 18, 2023 06:50 PM IST

TPCC Revanth Reddy Latest News: కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉంటుందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన… పార్టీ మారిన నేతల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

TPCC Revanth Reddy Comments: కర్ణాటక ఎన్నికల ఫలితాలను పట్టించుకోవాల్సిన పనిలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన... వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోవటం ఖాయమన్నారు. కర్ణాటక తీర్పు కేసీఆర్‌కు కంటగింపుగా మారిందన్నారు. జేడీఎస్ తో కలిసి కేసీఆర్ చేసిన కుట్రను ముందే బయటపెట్టామని చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన పలువురు నేతలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వివేక్‌, కొండా విశ్వేశ్వర రెడ్డి, రాజగోపాల్‌ రెడ్డి, ఈటల, జూపల్లి, పొంగులేటి లాంటి నేతలకు బీజేపీ సిద్ధాంతాలతో వారికి ఏ మాత్రం సంబంధం లేదన్నారు. కేసీఆర్ ఎదుర్కొనే క్రమంలో ఆ పార్టీలోకి వెళ్లారని చెప్పుకొచ్చారు. అయితే కేసీఆర్ ను ఓడించాలని బలంగా కోరుకుంటున్న వీరంతా తిరిగి కాంగ్రెస్ గూటికి రావాలని కోరారు. అవసరమైతే పార్టీ కోసం పది మెట్లు కిందకు కూడా దిగుతానంటూ కామెంట్స్ చేశారు. తన వల్ల ఇబ్బంది అనుకుంటే... పార్టీకి చెందిన సీనియర్ నేతలతో కూడా మాట్లాడవచ్చని అన్నారు.

" కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణా రావు అందరూ కాంగ్రెస్ పార్టీ లోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటిది, ఒక్కోసారి తల్లితండ్రులను కాదని ప్రేమించిన వాడితో లేచిపోతాం. తిరిగి ఏం మొహం పెట్టుకొని ఇంటికి పోతాం అని వాడు కొట్టినా, సిగరెట్ తో కాల్చినా బాధ భరిస్తాం. మీలాంటి వారిని తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ తిరిగి చేర్చుకోవాలని ఉంటుంది. కేసీఆర్‌ను ఓడించడానికి అందరూ కాంగ్రెస్ తో కలిసి రావాలి. నాతో ఏమైనా ఇబ్బంది ఉంటే అధిష్టానంతో మాట్లాడి పార్టీలోకి రావొచ్చు" అంటూ రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని... తప్పకుండా అధికారంలోకి వస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఛత్తీస్ గడ్ మోడల్ ను ఇక్కడ అమలు చేస్తామన్నారు. ఇక బీజేపీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ పై రేవంత్ రెడ్డి స్పందించారు. దమ్ముంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం... బీసీ గణనను చేపట్టాలని డిమాండ్ చేశారు. కేవలం ఓట్ల కోసం బీసీల అంశాన్ని బీజేపీ తెరపైకి తీసుకువచ్చిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందని కేసీఆర్ కు అర్థమైందన్నారు. అందుకే ఎమ్మెల్యేలపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.

Whats_app_banner

సంబంధిత కథనం