DOST 2022 : తెలంగాణలో లక్ష డిగ్రీ సీట్లు ఫ్రీజ్
Degree Admissions 2022 : తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. దీంతో వివిధ కోర్సుల్లో లక్ష డిగ్రీ సీట్లను ఫ్రీజ్(స్తంభింప) చేశారు.
కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ మరియు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీఎస్‌సీహెచ్‌ఇ) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని బీఏ, బీకామ్, బీఎస్‌సీ వంటి వివిధ కోర్సులలో 1 లక్ష డిగ్రీ సీట్లను తాత్కాలికంగా ఫ్రీజ్(హోల్ట్) చేశారు. డిగ్రీ కోర్సుల్లో సీట్లకు డిమాండ్ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) అడ్మిషన్ కౌన్సెలింగ్‌లో గత మూడేళ్లలో జీరో అడ్మిషన్లు(Zero Admissions) నమోదు చేసిన కాలేజీలు, కోర్సుల్లో సీట్లు స్తంభించాయి. అలాగే మొత్తం ఇన్‌టేక్ కంటే 15 శాతం కంటే తక్కువగా నమోదు చేసిన కళాశాలలు(Colleges), కోర్సులలోని సీట్లు ప్రస్తుత విద్యా సంవత్సరానికి తాత్కాలికంగా నిలిపివేశారు. దోస్త్ 2022 ప్రత్యేక దశ వెబ్ కౌన్సెలింగ్ సమయంలో ఈ సీట్లు అడ్మిషన్‌లకు అందుబాటులో ఉండవు.
15 సీట్ల కంటే తక్కువ ఉన్న కోర్సులు, కళాశాలల్లోని విద్యార్థులు వేరే కళాశాల(Colleges)లో ఒకే లేదా వేరే కోర్సుకు మారడానికి ఎంపిక ఇస్తారు. ఇప్పటి వరకు 978 డిగ్రీ కాలేజీల్లో 4.60 లక్షల సీట్లలో 1.53 లక్షల మంది విద్యార్థులు రిపోర్టు చేశారు. 'ఇది సీట్లపై తాత్కాలిక స్తంభన మాత్రమే. మేం అఫిలియేషన్‌ను రద్దు చేయడం లేదా సీట్లను రద్దు చేయడం లేదు. అయితే ప్రస్తుతం జరుగుతున్న కౌన్సెలింగ్‌లో ప్రవేశాలకు ఈ సీట్లు అందుబాటులో ఉండవు.' అని ఓ అధికారి తెలిపారు.
ఇదిలా ఉండగా దోస్త్(DOST) స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ ద్వారా డిగ్రీ అడ్మిషన్ల కోసం వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి, వాటిని వినియోగించుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 7గా ఉంది. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.400గా నిర్ణయించారు. స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అక్టోబర్ 7న, సీట్లు అక్టోబర్ 9న కేటాయిస్తారు. ప్రొవిజనల్ సీట్ అలాట్‌మెంట్ పొందిన వారు అక్టోబర్ 9 నుంచి 10 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టు చేసి అక్టోబర్ 10 నుంచి 11 మధ్యలో సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాలి.