తర్పణాలు అంటే ఏమిటి? ఇవి ఎందుకు వదులుతారు? వీటి విశిష్టత ఏంటి?
తర్పణాలు ఆంటే ఏంటి? పితృ దేవతలకు మాత్రమే తర్పణాలు సమర్పిస్తారా? అనే విషయాలు, వీటి విశిష్టత గురించి అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
తర్పణాలు అంటే పితృదేవతలకు సమర్పించేవని సాధారణ ప్రజానీకంలో ఒక దురభిప్రాయం ఉంది. కానీ దేవతలకు, నవగ్రహాలకు, రుషులకు కూడా తర్పణాలు ఇస్తారని ఆధ్యాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అన్నారు.
తర్పణం అంటే సమర్పణ అని అర్థమని, ఇది నైవేద్యం కూడా అని చిలకమర్తి తెలిపారు. తర్పణాలు చేసే వస్తువును బట్టి ఉంటాయని, పితృదేవతలకు చేసేది తిలతర్పణమని అన్నారు. అంటే ముడి నువ్వులను నీటితో కలిపి సమర్పించేది. దేవీ దేవతలు, నవగ్రహాల మూల మంత్రాలను జపించినప్పుడు కూడా తర్పణాలు ఇవ్వాలని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ప్రతి పది మూలమంత్ర పఠానలకు ఒకసారి తర్పణ ఇవ్వాలని శాస్త్రం చెబుతోందని చిలకమర్తి తెలిపారు. మానవులమై పుట్టినందుకు మనం మూడు రకాల రుణాలను తీర్చుకోవాల్సి ఉంటుందన్నారు. అవి దేవ రుణం, రుషి రుణం, పితృ రుణం అని తెలిపారు. ఈ జగత్తుకు కారణభూతులైనందుకు దేవతల రుణం, శాస్త్రములు, ధర్మములు, పురాణ, ఇతిహాసాలు అందించారు. వాఙ్మయం అందించినందుకు రుషుల ఋణం, మన జన్మకు కారకులైనవారికి పితృ రుణంతో మనం ఉంటామన్నారు. ఈ మూడు రకాల రుణాలను తర్పణాల ద్వారానే తీర్చుకోగలమని ఆధ్యాత్మికవేత్త ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ప్రతిరోజూ దేవ, రుషి, పితృదేవతలకు తర్పణాలను వదలాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ దేవ, రుషి తర్పణాలను వదలాలని పితృతర్పణ తండ్రిలేని వారు మాత్రమే చేయాలని అన్నారు. సూత్రకారులు యాజ్ఞవల్క్యుడు, ఆపస్తంభుడు వంటివారు ఈ తర్పణాల విధివిధానాలను చక్కగా తెలియజేశారన్నారు. పద్మపురాణంలో కూడా తర్పణాలకు సంబంధించిన వివరాలు ఎన్నో ఉన్నాయన్నారు.
లక్ష్మీదేవి పూజ చేసే సమయంలో ‘ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయన్తీం’ అని జలతర్పణ ఇవ్వాలన్నారు. నీరే కాకుండా ఆవు పాలను కూడా తర్పణంగా సమర్పించవచ్చు. దేవీదేవతలకు, శనికి అల్లం, శొంఠి కూడా తర్పణమిస్తారు. ఈ తర్పణాల సమర్పణలో కొన్ని విధివిధానాలు ఉన్నాయని చిలకమర్తి తెలిపారు.
దేవతలకు, రుషులకు తర్పణాలను సమర్పించేటప్పుడు యజ్ఞోపవీతం సవ్యంగా ఉంచుకోవాలని అంటే ఎడమభుజం మీద ఉండాలన్నారు. దేవ, రుషి తర్పణాలను అక్షతలు నీటితో వదలాలి. దేవ, రుషి తర్పణాలు కుడికాలు మడిచి తూర్పు, పడమర దిక్కులకు తిరిగి తర్పణ ఇవ్వాలని ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. దేవతర్పణం దర్భాగ్రము, రుషి తర్పణం దర్భ మధ్యభాగం నుంచి వదిలిపెట్టాలని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
టాపిక్