Weekly Horoscope Telugu। ఈ వారం రాశి ఫలాలు.. ఆ రాశి వారిపై వక్రస్థితిలో శని, జాగ్రత్త!-weekly horoscope telugu check astrological forecast for october 23 to october 29 2022 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Weekly Horoscope Telugu, Check Astrological Forecast For October 23 To October 29, 2022

Weekly Horoscope Telugu। ఈ వారం రాశి ఫలాలు.. ఆ రాశి వారిపై వక్రస్థితిలో శని, జాగ్రత్త!

HT Telugu Desk HT Telugu
Oct 23, 2022 04:30 AM IST

Weekly Horoscope Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు, అక్టోబర్ 23 నుంచి అక్టోబర్ 29, 2022 వరకు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోండి. ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించిన వార ఫలాలు ఇక్కడ ఉన్నాయి.

Weekly Horoscope
Weekly Horoscope (Pixabay)

Weekly Horoscope Telugu: తెలుగు రాశి ఫలాలు (వార ఫలాలు) 23.10.2022 నుండి 29.10.2022 వరకు

ట్రెండింగ్ వార్తలు

సంవత్సరం: శుభకృత్ నామ, అయనం: దక్షిణాయనం, మాసం: ఆశ్వయుజం - కార్తీకం

మేషరాశి :

మేషరాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలున్నవి. కుజుని అనుకూల ప్రభావంచేత, శుక్ర, శని అనుకూల స్థితి వలన ఈవారం చేసే ప్రతీ పని శుభ ఫలితాలిచ్చును. వ్యయస్థానములో గురుని ప్రభావం చేత ఆర్ధిక విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. జన్మ రాహువు ప్రభావం వలన చికాకులు, ఒత్తిడులు అధికముగా ఉండును. అయినప్పటికి మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన మీ తెలివితేటలతో ముందుకు సాగెదరు. కళత్ర స్థానమునందు రవికేతువుల ప్రభావంచేత కుటుంబంలో సమస్యలు కొంత ఇబ్బంది పెట్టును. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు ఈవారం అనుకూల ఫలితములుండును, వ్యాపారస్తులకు లాభవములు చేకూరును. విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితములు ఈ వారం గోచరిస్తున్నవి. మేషరాశివారు మరింత శుభ ఫలితాల కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంగళవారం పూజించుట వలన మరింత శుభ ఫలితములు కలుగును.

వృషభ రాశి :

వృషభరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉన్నది. లాభస్థానము నందు గురుని సంచారము చేత అనుకున్న ప్రతీ పని పూర్తి చేసెదరు. వ్యయ స్థానము నందు రాహువు సంచారము వలన ఖర్చులు పెరుగును. ధనస్థానమునందు కుజుని ప్రభావంచేత ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకొనెదరు. కుటుంబమునందు కలహములు ఏర్పడును. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. మిగిలిన గ్రహాల అనుకూల స్థితి వలన సుఖ భోజన ప్రాప్తి, బంధుమిత్రుల ప్రశంసలు, ఆనందము కలుగును. నూతనంగా వస్తువులు కొనడానికి ప్రయత్నించెదరు. వృషభ రాశివారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వరుని, దుర్గాదేవిని పూజించాలి. దుర్గాష్టకము దుర్గా కవచము పఠించడం వలన శుభ ఫలితము కలుగును.

మిథున రాశి :

మిథునరాశివారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. జన్మరాశి యందు కుజుని సంచారంచేత కుటుంబమునందు సమస్యలు ఒత్తిడులు అధికమగును. ఆరోగ్య విషయములయందు జాగ్రత్తలు వహించాలి. అష్టమ శని ప్రభావం వలన ఆందోళన, ఇబ్బందులు కలుగును. వ్యాపారము, ధన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. శుక్రుడు, బుధుడు అనుకూల స్థితి వలన ఎలాంటి ఇబ్బందులు ఏర్పడినప్పటికి మీ కృషితో ముందుకు సాగెదరు. మృష్టాన్న భోజనము, సౌఖ్యము కలుగును. శని వక్రియై సంచరించుట వలన చికాకులు అధికముగా ఉండును. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. ఈ వారం మరింత శుభఫలితాల కోసం మిథునరాశి వారు బుధవారం రోజు మహా విష్ణువును పూజించి, విష్ణు సహస్రనామాన్ని పఠించవలెను. అలాగే దశరథ శని ప్రోక్త స్తోత్రాన్ని శనివారం పఠించడం మంచిది.

కర్కాటక రాశి :

కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. ఈ వారం మీరు చేసే ప్రయత్నాలకు శుభ ఫలితములు కలుగును. చతుర్ధ స్థానమునందు కేతువు సంచారము వలన స్త్రీలతో జాగ్రత్త వహించాలి. శని వక్రియై సంచరించుట వలన కుటుంబము నందు కొన్ని సమస్యలు బాధించును. గురు, కుజ , రాహు గ్రహాల అనుకూల ప్రభావం చేత అలాగే శని అనుకూలత వలన మీకు అన్ని విధాలుగా ఈ వారం కలిసి వచ్చును. చేసే ప్రతి పని అనుకూలించును. ఉత్సాహముతో ముందుకు సాగెదరు. ఆర్ధిక విషయాలు అనుకూలించును. కుటుంబములో ఉన్న సమస్యలు తొలగును. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్ళటం మంచిది. కర్కాటక రాశివారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సోమవారం శివాలయంలో అభిషేకం చేసుకోవడం మంచిది. శివాష్టకము, లింగాష్టకాన్ని పఠించండి.

సింహ రాశి :

సింహరాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. కుజుని అనుకూల ప్రభావంచేత ధనలాభము, వస్తులాభము, సౌఖ్యము కలుగును. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు లాభము, వ్యాపారస్తులకు వ్యాపార లాభము కలుగును. అష్టమ గురుని ప్రభావము చేత సింహరాశివారు ఆరోగ్య విషయాల యందు జాగ్రత్త వహించాలి. అష్టమ గురుని ప్రభావము వలన కుటుంబ వ్యవహారాల యందు, ఆరోగ్య విషయముల యందు జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకు అనుకూలమైనటువంటివారం. సింహరాశి వారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆదివారం రోజు సూర్యాష్టకము పఠించడం, గురువారం దక్షిణామూర్తిని పూజించాలి.

కన్య రాశి :

కన్య రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలు ఉన్నవి. కన్యారాశివారికి ఈవారం ధనలాభము, వస్తులాభము, కీర్తి కలుగును. మీరు అనుకున్న ప్రతీ పని అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. ధన సంబంధించిన విషయాలు అనుకూలించును. ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నప్పటికి మనోధైర్యంతో ముందుకు వెళ్ళి విజయము పొందెదరు. శని, గురు గ్రహాల అనుకూల ప్రభావం చేత చేసే ప్రతీ పనిలో విజయం పొందెదరు. ప్రయాణములు లాభించును. స్త్రీ సౌఖ్యం కలుగును. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము పొందెదరు. ఉద్యోగస్తులకు ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది. ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం బుధవారం రోజు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం, ఆదివారం ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది.

తులా రాశి :

తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా లేదు. జన్మరాశియందు రవి కేతువుల ప్రభావం చేత శారీరక శ్రమ, ఒత్తిళ్ళు అధికమగును. కుటుంబ విషయాలయందు జాగ్రత్త వహించాలి. రాజకీయాలకు, గొడవలకు దూరంగా ఉండాలి. భాగ్యస్థానము కుజుని అనుకూలత వనల ప్రయాణములు అనుకూలించును. లాభములు కలుగును. సౌఖ్యము పొందెదరు. శత్రువులతో జాగ్రత్త వహించాలి. జన్మరాశి యందు కేతువు, శత్రు స్థానము నందు గురుని సంచారము వలన తులారాశి వారికి ఉద్యోగమునందు ఉద్యోగస్తులకు రాజకీయ ఒత్తిడి, శత్రుత్వ భయము కలుగును. కుటుంబము నందు మానసిక ఒత్తిళ్ళు, ఇబ్బందులు ఏర్పడును. భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు కలుగును. వ్యాపారస్తులకు ఒత్తిళ్ళు అధికమగును. విద్యార్థులకు మధ్య ఫలములు, స్త్రీలకు కుటుంబమునందు సమస్యలు అధికముగా ఉండును. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలెను. అప్పుల ఒత్తిడి వుండును. మిత్రుల ద్వారా సహాయము పొందెదరు. తులారాశి వారికి మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం రోజు దత్తాత్రేయుని ఆరాధించడం మంచిది. శనివారం శనికి తైలాభిషేకం చేసుకుని దుర్గాదేవిని ఆరాధించడం వలన మరింత శుభఫలితాలు పొందెదరు.

వృశ్చిక రాశి :

వృశ్చికరాశికి ఈ వారం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. వ్యయస్థానము రవి, శుక్ర, కేతువుల ప్రభావం వలన ఖర్చులు పెరుగును. దాన ధర్మములు అధికముగా చేసెదరు. శని అనుకూల ప్రభావముచేత, పంచమ స్థానము గురువు, ఆరవ స్థానము రాహువు ప్రభావము చేత అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేసెదరు. వృశ్చికరాశి వారికి ఈ వారం ఉద్యోగస్తులకు ధనలాభము, వ్యాపారస్తులకు మంచి వ్యాపారము, స్త్రీలకు నూతన వస్తు ప్రాప్తి కలుగును. సమాజము నందు కీర్తి కుటుంబము నందు గౌరవము పెరుగును. లాభము రవి ప్రభావము చేత ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయము. వ్యాపారస్తులకు లాభదాయకమైన సమయము. ధనలాభము, కుటుంబ సౌఖ్యము కలుగును. శత్రువులు మిత్రులుగా వ్యవహరించెదరు. వృశ్చిక రాశివారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, దుర్గాదేవిని మంగళవారం రోజు పూజించడం మంచిది.

ధనుస్సు రాశి :

ధనుస్సు రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితములు ఉన్నవి. కుటుంబ సౌఖ్యము, మానసిక ఆనందము కలుగును. సమాజము నందు కీర్తి కలుగును. ప్రయాణములు అనుకూలించును. లాభ స్థానము నందు కేతువు, రవి, శుక్రుడు ప్రభావం చేత ధనలాభము, సౌఖ్యము, ఆనందము పొందెదరు. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయము. వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉండును. ద్వితీయ స్థానమునందు శని సంచారము వలన ఏలినాటి ప్రభావము చేత ఆర్ధిక సమస్యలు, పనుల యందు ఆలస్యము ఏర్పడును. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. మానసిక ఆందోళన కలుగును. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ధనూరాశి వారు గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించడం, శనివారం రోజు దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటివి పఠించటం చేయాలి.

మకర రాశి :

మకర రాశి వారికి ఈ వారం మధ్యస్తముగా ఉన్నది. ఖర్చులు అధికమగును. శారీరక సౌఖ్యం కోసం ధనమును ఖర్చు చేసెదరు. కుటుంబముతో ఆనందముగా గడిపెదరు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. జన్మరాశి యందు శని వక్రియై సంచరించుట వలన అలాగే తృతీయము నందు గురుని ప్రభావం చేత మానసిక ఒత్తిళ్ళు, ఆరోగ్య సమస్యలు అధికముగా ఉండును. నాలగవ ఇంట రాహువు సంచారము వలన కొంత చికాకులు ఏర్పడును. దశమమునందు రవి శుక్ర కేతువుల అనుకూలత వలన మీ కృషితో పట్టుదలతో ముందుకు వెళ్ళి కార్యములు పూర్తి చేసేదరు. ఉద్యోగస్తులకు కష్ట సమయము. వ్యాపారస్తులకు చెడు సమయము. చికాకులు అధికముగా ఉండును. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏలినాటి శని ప్రభావం చేత చేసే ప్రతి పని ఆచితూచీ జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయలి. శనివారం రోజు దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటివి పఠించాలి. శివారాధన చేయడం వలన శుభ ఫలితము కలుగును.

కుంభ రాశి :


కుంభ రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్తం నుండి అనుకూల ఫలితాలున్నాయి. కుంభరాశి వారికి ఈ వారం బృహస్పతి రాహువు, కుజ, శుక్ర గ్రహాల అనుకూలత వలన ఉద్యోగస్తులకు ఉద్యోగము నందు లాభము, సౌఖ్యము కలుగును వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉండును. గత కొంత కాలంగా ఉన్న సమస్యలు ఒక కొలిక్కి వచ్చును. చేసే ప్రతీ పనియందు కొంత అనుకూల ఫలితములు కలిగించును. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు వహించాలి. ధనవ్యయము ఆర్ధిక సమస్యలు ఇబ్బంది పెట్టును. కోర్టు వ్యవహారాలు చికాకులు కలిగించును. ఏలినాటి శని ప్రభావంచేత ప్రతీ పని యందు ఆచితూచి వ్యవహరించటం మంచిది. శత్రువుల బాధలు అధికముగా ఉండును. కుంభ రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయించుకోవడం, దుర్గాదేవికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి దుర్గాష్టకం వంటివి చదువుకుని ఆరాధించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగును.

మీన రాశి :

మీన రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్తముగా ఉన్నది. జన్మరాశి యందు గురుని ప్రభావం చేత మీన రాశి వారికి ఆరోగ్య సమస్యలు, ఒత్తిళ్ళు అధికముగా ఉండును. మిగతా గ్రహముల అనుకూల స్థితి వలన అనుకున్న ప్రతీ పని విజయవంతముగా పూర్తి చేసెదరు. అష్టమ స్థానమునందు రవి, శుక్ర, కేతు ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. మానసికంగా ఉల్లాసముగా ఉండెదరు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించడం మంచిది. విష్ణుసహస్రనామ పారాయణ చేయడం వలన శుభ ఫలితాలు కలుగును. మీన రాశి వారు గురువారం రోజు శనగలు, తాంబూలాన్ని దానం ఇవ్వడం మంచిది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్