Deepavali 2022 । దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి, లక్ష్మీ పూజలకు శుభ ముహూర్తం తెలుసుకోండి!-deepavali 2022 date lakshmi pooja timings surya grahanam according to telugu calendar ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Deepavali 2022 Date, Lakshmi Pooja Timings, Surya Grahanam According To Telugu Calendar

Deepavali 2022 । దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి, లక్ష్మీ పూజలకు శుభ ముహూర్తం తెలుసుకోండి!

HT Telugu Desk HT Telugu
Oct 20, 2022 10:34 AM IST

Deepavali 2022: ఈ ఏడాది దీపావళి రోజునే సూర్యగ్రహణం వస్తుంది. మరి దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి, లక్ష్మీపూజలకు శుభముహూర్తం ఏమిటి తదితర విషయాలు ఇక్కడ చూడండి.

Deepavali 2022
Deepavali 2022 (Unsplash)

Deepavali 2022: దీపావళి పండగ దగ్గర్లోనే ఉంది. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. దీపావళి రోజున దీప మాళికల శోభతో వెలుగొందే గృహ ప్రాంగణాలు, లక్ష్మీ పూజలు, నూతన వస్త్రధారణలు, బాణసంచా మోతలతో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతాయి.

దీపావళి పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా జరుపుకుంటారు.

అయితే ఈ ఏడాది తేదీల విషయంలో కొన్ని సందేహాలు నెలకొన్నాయి. కొన్ని చోట్ల దీపావళి అక్టోబర్ 24వ తేదీ అంటే, మరికొన్ని ప్రాంతాల్లో 25వ తేదీన దీపావళి అని చెబుతున్నారు. అయితే ఇదే రోజున ఈ ఏడాది సూర్యగ్రహణం కూడా సంభవిస్తుంది. మరి అసలు దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి? ధనత్రయోదశి ఎప్పుడు నిర్వహించాలి? లక్ష్మీపూజలు చేసేందుకు శుభ ముహూర్తం మొదలైన అన్ని విషయాలు ఇక్కడ తెలుసుకోండి.

అక్టోబర్ 23: ధన త్రయోదశి

ఈ ఏడాది అక్టోబర్ 23న ధన త్రయోదశి వస్తుంది. ఈరోజు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈరోజున కుబేరుడు, లక్ష్మీ దేవిని పూజిస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ధనత్రయోదశి నాడు కొనుగోలు చేసినది వృద్ధి చెందుతుందని నమ్మకం. అందుకే ప్రజలు బంగారం, వెండి ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అలాగే బట్టలు, గాడ్జెట్లు, వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా ఈరోజు మంచిరోజు

అక్టోబరు 24: నరక చతుర్దశి

హిందూ సంప్రదాయాలు, పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు నరకాసురుడు అనే రాక్షసుడిని ఈరోజువధించారని నమ్ముతారు. ఇదిలా ఉంటే తెలుగు క్యాలెండర్ ప్రకారం, ఈరోజే లక్ష్మీపూజలు నిర్వహిస్తారు. లక్ష్మీ పూజ ముహూర్తం అక్టోబర్ 24న సాయంత్రం 06:53 గంటలకు ప్రారంభమై రాత్రి 08:15 గంటలకు ముగుస్తుంది.

అక్టోబర్ 25: దీపావళి

ప్రధాన పండుగ దీపావళి ఈరోజే. అయితే ఈరోజు సూర్యగ్రహణం ఉంది. ఈ సూర్యగ్రహణము సాయంత్రం 5.01 నిలకు ప్రారంభమై, 6.26 నిలకు వరకు ఉంది. సాయంత్రం 6.30 కు సూర్యగ్రహణం పరిసమాప్తం అయిన తరువాత 7 గం.ల నుండి లక్ష్మీపూజ దీపారాధన, దీపావళి పండుగను జరుపుకోవచ్చునని పండితులు తెలిపారు.

ఉత్తరాదిన అక్టోబర్ 24న దీపావళి

మరోవైపు ఉత్తర భారతదేశంలో అక్టోబర్ 24నే దీపావళిగా అనేక నివేదికలు పేర్కొన్నాయి. అక్టోబర్ 25న సూర్యగ్రహణం ఒకవైపు ఉండగా, అమావాస్య ఘడియలు అక్టోబర్ 24 సాయంత్రం 5:27 కు ప్రారంభమై, అక్టోబర్ 25, సాయంత్రం 4:18 వరకు ముగిసిపోతున్నాయి. కాబట్టి జ్యోతిష్య శాస్త్రం, తిథుల ప్రకారం అమావాస్య ఘడియలు ఉండే అక్టోబర్ 24నే దీపావళి జరుపుకోవాలని సూచిస్తున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం