Kala Bhairavastami Rituals : కాల భైరవాష్టమిరోజు ఈ పనులు చేస్తే.. పాపాలు పోయి.. ఆయురారోగ్యాలు పొందుతారట..
Kala Bhairavastami Rituals : సనాతన ధర్మంలో కాల భైరవ అష్టమికి చాలా ప్రాధన్యతనిస్తారు. కార్తీకమాసంలో వచ్చే ఈ కాల భైరవ అష్టమి రోజు.. కొన్ని పనులు చేస్తే.. చేసిన పాపలు పోతాయని.. ఆయురారోగ్యాములు పొందవచ్చని అంటున్నారు.
Kala Bhairavastami Rituals : పాపాలు నశించడానికి, భూత ప్రేత పిశాచాల భయాలు తొలగడానికి, మానసిక సమస్యలు రాకుండా ఉండటానికి, ఆయురారోగ్యములు పొందడానికి కాలభైరవుడిని పూజిస్తారు. చిలకమర్తి పంచాంగరీత్యా.. ధృక్ సిద్ధాంతం ఆధారంగా.. కార్తీక మాసంలో వచ్చే కృష్ణ పక్ష అష్టమిని.. కాలభైరవాష్టమిగా చేసుకుంటామని.. పంచాంగకర్త శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈ సంవత్సరం కాలభైరవాష్టమి.. 16 నవంబర్ 2022న వస్తుంది. మరి ఆ రోజు ఏమి చేయాలి.. అసలు కాల భైరవాష్టమి అంటే ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కాలభైరవాష్టమి రోజున కాలభైరవుడు జన్మించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. పురాణాల ప్రకారం.. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మధ్య ఎవరు గొప్పవారు అనే వాదన వచ్చినప్పుడు.. ఆ వాదనలో బ్రహ్మ నేనే గొప్పవాడిని అని నిరూపించుకోవడం కోసం పరమశివుని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతారు. ఆ సమయంలో పరమశివుడు ఆగ్రహం పొందుతాడు. ఆ కోపమునుంచి శివుని అవతారమైన కాలభైరవుడు ఉద్భవిస్తాడు. అలా కాలభైరవుడు కార్తీక మాస కృష్ణ పక్ష అష్టమినాడు ఉద్భవించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి.
ఈ కాలభైరవుడు శివుని ఆజ్ఞతో పంచముఖ బ్రహ్మదేవుని పంచముఖాలలో పైన ఉన్నటువంటి శిరస్సును ఖండించాడు. అప్పుడు బ్రహ్మ శిరస్సు కాలభైరవుని చేతికి అంటుకుని ఉండిపోయింది. ఆ బ్రహ్మహత్యా పాతకం తొలగించుకోవడానికి ఆ అంటుకున్న శిరస్సుతో.. కాలభైరవుడు ఈ సృష్టిలోని ముల్లోకాలు తిరిగాడు. ఆ సమయంలో శిరస్సు కాశీ క్షేత్రమునందు ఊడిపడిందని చెప్తారు. ఆ కాశీ క్షేత్ర ప్రవేశముతో.. బ్రహ్మ హత్యాపాతకం కాలభైరవునికి, శివునికి తొలగిపోయినట్లుగా పురాణగాధలు చెప్తున్నాయి.
కాబట్టి భక్తులు ఆరోగ్యమును పొందడానికి, రాహువు బాధలు తొలగించుకోవడానికి, భూత ప్రేత బాధలు పోగొట్టుకోవడానికి, భయాలు పోవడానికి కాలభైరవున్ని పూజించాలి. కాలభైరవున్ని రాహు కాల సమయంలో పూజించినా, కాలభైరవాష్టమిరోజున పూజించినా.. విశేష ఫలితాలు ఉంటాయంటున్నారు. కాల భైరవాష్టమి రోజున కుక్కలకు ఆహారం పెట్టడం వలన కూడా కాలభైరవుని అనుగ్రహం కలుగుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
సంబంధిత కథనం