Taliban: మహిళలపై ఆంక్షలు కొనసాగిస్తాం.. హక్కులను పట్టించుకోం: తాలిబన్లు-women rights not priority says taliban spokesperson zabibullah mujahid ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Taliban: మహిళలపై ఆంక్షలు కొనసాగిస్తాం.. హక్కులను పట్టించుకోం: తాలిబన్లు

Taliban: మహిళలపై ఆంక్షలు కొనసాగిస్తాం.. హక్కులను పట్టించుకోం: తాలిబన్లు

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 15, 2023 04:57 PM IST

Afghanistan - Taliban: మహిళల హక్కులు తమ ప్రాధాన్యం కాదని తాలిబన్ ప్రతినిధి అన్నారు. అఫ్గానిస్థాన్‍లో మహిళలు, బాలికలపై (Women Rights) కఠిన ఆంక్షలపై ప్రపంచ దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

తాలిబన్ల ఆంక్షలకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్న అఫ్గాన్ మహిళలు (ఫైల్)
తాలిబన్ల ఆంక్షలకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్న అఫ్గాన్ మహిళలు (ఫైల్) (AP)

Afghanistan - Taliban: అఫ్గానిస్థాన్‍లో మహిళ హక్కులను తాలిబన్ ప్రభుత్వం హరిస్తూనే ఉంది. ఈ విషయంలో చాలా దేశాల నుంచి తాలిబన్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూనివర్సిటీల్లో మహిళలు చదువుకోవడంపై తాలిబన్లు నిషేధం విధించారు. స్వచ్ఛంద సంస్థల్లో(NGOs)నూ మహిళలు పని చేయకూడదని బ్యాన్ చేశారు. దీంతో తాలిబన్ ప్రభుత్వంపై విమర్శలు అధికమవుతున్నాయి. ఈ తరుణంలో తాలిబన్ ప్రతినిధి జబీబుల్లా ముజాహిద్ స్పందించారు. మహిళల హక్కులు తమ ప్రాధాన్యం కాదని వెల్లడించారు. ఖమా ప్రెస్ ఈ వివరాలను వెల్లడించింది. కఠిన ఆంక్షలను అమలు చేస్తూనే ఉంటామని జబీబుల్లా అన్నారు. వివరాలు ఇవే.

అందుకు అనుమతించం: తాలిబన్

Afghanistan - Taliban: ఇస్లామిక్ చట్టాలను మహిళలు అతిక్రమించడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని తాలిబన్ ప్రతినిధి జబీబుల్లా వెల్లడించారు. అఫ్గాన్‍లోని మహిళల హక్కులపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతున్న తరుణంలోనూ తాము వెనక్కి తగ్గేది లేదనేలా తాలిబన్లు వ్యవహరిస్తున్నారు. “ఇస్లామిక్ షరియాకు అనుగుణంగా అన్ని విషయాలను నియంత్రిస్తున్నాం. షరియాకు వ్యతిరేకంగా ఏ పనిని కూడా మా ప్రభుత్వం అనుమతించదు” అని తాలిబన్ ప్రతినిధి చెప్పినట్టు ఖమా ప్రెస్ రిపోర్ట్ వెల్లడించింది.

ఎన్‍జీవోల్లో మహిళలు పని చేయకూడదని తాలిబన్లు తెచ్చిన నిబంధనలపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అఫ్గాన్‍లోని కొందరు మహిళలు ఆందోళనలు కూడా నిర్వహించారు. తాలిబన్ల ఈ నిర్ణయాన్ని అంతర్జాతీయంగా చాలా దేశాలు వ్యతిరేకించాయి.

ప్రపంచ దేశాల వ్యతిరేకత

Afghanistan - Taliban: మహిళలపై తాలిబన్ల ఆంక్షలను ఇప్పటికే చాలా దేశాలు వ్యతిరేకించాయి. అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్‍తో పాటు మరిన్ని దేశాలు తాలిబన్ నిర్ణయాలను ఖండించాయి. ఐక్యరాజ్యసమితి, ఓఐసీతో పాటు మరిన్ని అంతర్జాతీయ ఆర్గనైజేషన్లు కూడా ఇది సరికాదంటూ తాలిబన్లకు హితవు పలికాయి. యూనివర్సిటీల్లో చదివేందుకు, ఎన్‍జీవోల్లో పని చేసేందుకు మహిళలను అనుమతించాలని సూచించాయి.

అయితే, అంతర్జాతీయంగా వస్తున్న సూచనలను తాలిబన్లు పట్టించుకోవడం లేదు. మహిళల విద్య, ఉద్యోగాలపై కఠిన ఆంక్షలను కొనసాగిస్తామనేలా సంకేతాలు ఇస్తున్నారు.

షరియా చట్టాల ప్రకారమే మహిళలపై ఆంక్షలు విధిస్తున్నామన్న తాలిబన్ల వాదనను ముస్లిం దేశాల కూటమి అయిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ (OIC) ఖండిస్తోందని ఖమా ప్రెస్ పేర్కొంది. మహిళల హక్కులను కాలరాయొద్దంటూ తాలిబన్లకు ఓఐసీ కూడా ఇటీవలే సూచనలు చేసింది. మహిళలను, బాలికలను చదువు, ఉద్యోగం లాంటి హక్కుల నుంచి దూరం చేయవద్దని చెప్పింది. అయితే తాలిబన్లు మాత్రం ఎవరీ మాట వినేలా కనిపిచడం లేదు.

ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చి.. 2021లో తాలిబన్లు మరోసారి అఫ్గానిస్థాన్ పాలనను చేజిక్కించుకున్నారు. మహిళలపై ఎలాంటి ఆంక్షలు విధించబోమని తొలుత హామీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత క్రమంగా ఆంక్షలను విధిస్తూ వచ్చారు. గతం కంటే మరింత ఎక్కువగా మహిళల, బాలికల హక్కులను తాలిబన్లు.. కాలరాస్తున్నారని విమర్శలు ఉన్నాయి.

సంబంధిత కథనం