Afghanistan: మహిళలు యూనివర్సిటీల్లో చదవడంపై నిషేధం: తాలిబన్ల మరో వివాదాస్పద నిర్ణయం-taliban bans university education for afghanistan women
Telugu News  /  National International  /  Taliban Bans University Education For Afghanistan Women
Afghanistan: మహిళలు యూనివర్సిటీల్లో చదవడంపై నిషేధం: తాలిబన్ల మరో వివాదాస్పద నిర్ణయం
Afghanistan: మహిళలు యూనివర్సిటీల్లో చదవడంపై నిషేధం: తాలిబన్ల మరో వివాదాస్పద నిర్ణయం (AFP)

Afghanistan: మహిళలు యూనివర్సిటీల్లో చదవడంపై నిషేధం: తాలిబన్ల మరో వివాదాస్పద నిర్ణయం

21 December 2022, 6:51 ISTChatakonda Krishna Prakash
21 December 2022, 6:51 IST

Afghanistan: అఫ్గానిస్థాన్‍లో మహిళలకు యూనివర్సిటీ విద్యపై నిషేధం విధించారు తాలిబన్లు. మరోసారి మహిళలు, బాలికల హక్కులను కాలరాశారు.

Taliban bans university education for women: అఫ్గానిస్థాన్‍ (Afghanistan)లో తాలిబన్లు కఠిన ఆంక్షలతో పాలన కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, బాలికలపై తాలిబన్ యంత్రాంగం ఆంక్షలు విధిస్తూనే ఉంది. మహిళల హక్కులను అణచివేస్తోంది. అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నా.. తాలిబన్లు మాత్రం పంథాను మార్చుకోవడం లేదు. ఈ క్రమంలో మరో వివాదాస్పద నిర్ణయాన్ని అఫ్గానిస్థాన్‍లో తాలిబన్లు అమలులోకి తెచ్చారు. దేశంలోని మహిళలకు యూనివర్సిటీ విద్యపై నిషేధం విధించారు. బాలికలు, మహిళలు ఇక యూనివర్సిటీల్లో అడుగుపెట్టకుండా బ్యాన్ విధించింది తాలిబన్ యంత్రాంగం.

ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలగొట్టి గత సంవత్సరం అప్ఘానిస్థాన్‍లో అధికారాన్ని చేజిక్కించుకున్నారు తాలిబన్లు. కానీ గతంలా కఠిన ఆంక్షలు కాకుండా సవ్యంగా పాలన చేస్తామని హామీ ఇచ్చారు. అయితే మహిళలు, బాలికలపై మాత్రం తాలిబన్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆంక్షలు విధిస్తోంది. సాధారణ జీవనం దగ్గరి నుంచి చదువు, ఉద్యోగాల వరకు అన్ని విషయాల్లోనూ వారి హక్కులను హరిస్తోంది. తాజాగా యూనివర్సిటీ చదువులను మహిళలకు దూరం చేస్తున్నట్టు ప్రకటించింది.

“మహిళలకు విద్యాబోధనను వెంటనే నిలిపివేయండి. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ఉత్తర్వులను అమలు చేయండి” అని అప్ఘానిస్థాన్‍లోని ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలకు ఉన్నత విద్యాశాఖ మంత్రి నేదా మహమ్మద్ నదీమ్ లేఖరాశారు. ఈ లెటర్‌ను ఆ శాఖ ప్రతినిధి ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేశారు.

ఆకాంక్షలను అడ్డుకుంటూ..

యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం జరిగిన పరీక్షల్లో అఫ్గానిస్థాన్‍లో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ పరీక్షలు జరిగి మూడు నెలలు కూడా కాలేదు. ఉన్నత చదువులు అభ్యసించి, మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలనే ఆకాంక్షతో యూనివర్సిటీ ప్రవేశాల కోసం ఎగ్జామ్స్ రాశారు. అయితే ఇప్పుడు అక్కడి తాలిబన్ యంత్రాంగం ఏకంగా.. మహిళలకు యూనివర్సిటీ విద్యనే రద్దు చేసేసింది. దీని వల్ల ఆ దేశ మహిళలు యూనివర్సిటీల్లో చదువుకునే అవకాశమే లేకుండా పోయింది.

‘ఇది సరికాదు’

మహిళలకు యూనివర్సిటీ విద్యపై నిషేధం విధించిన తాలిబన్‍ల నిర్ణయాన్ని చాలా దేశాలు ఖండిస్తున్నాయి. అమెరికా, బ్రిటన్ ఇప్పటికే తమ వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. తాలిబన్లు.. అఫ్గాన్ ప్రజల మానవ హక్కులు, మహిళలు, బాలికల స్వేచ్ఛను గౌరవించే వరకు అంతర్జాతీయ సమాజంలో చట్టబద్ధమైన ప్రభుత్వంగా గుర్తింపు పొందలేదని ఐక్యరాజ్య సమితిలో అమెరికా డిప్యూటీ అంబాసిడార్ రాబర్ట్ వుడ్ అన్నారు. మహిళలకు యూనివర్సిటీ విద్యను దూరం చేయడం అసలు సరికాదని చెప్పారు. కాగా, అమెరికాతో పాటు చాలా దేశాలు అప్ఘానిస్థాన్‍లో తాలిబన్ల ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించలేదు.

మహిళల హక్కులను ఇది కాలరాడమేనని ఐక్యరాజ్య సమితిలో బ్రిటన్ అంబాసిడార్ బార్బరా వుడ్ వార్డ్ అన్నారు. అఫ్గాన్ మహిళలకు యూనివర్సిటీ విద్యను దూరం చేస్తూ తాలిబన్లు తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయం వల్ల ప్రతీ మహిళా ఎంతో నిరాశ చెందుతారని, హక్కులను హరించడం సరికాదని బార్బరా వ్యాఖ్యానించారు.