PoK merge with India: ‘‘త్వరలో పీఓకే కూడా భారత్ లో కలుస్తుంది..’’- కేంద్ర మంత్రి-union minister claims pok will merge with india sanjay raut reacts ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pok Merge With India: ‘‘త్వరలో పీఓకే కూడా భారత్ లో కలుస్తుంది..’’- కేంద్ర మంత్రి

PoK merge with India: ‘‘త్వరలో పీఓకే కూడా భారత్ లో కలుస్తుంది..’’- కేంద్ర మంత్రి

HT Telugu Desk HT Telugu
Sep 12, 2023 03:01 PM IST

PoK merge with India: పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) కూడా త్వరలో భారత్ లో కలుస్తుందని కేంద్ర మంత్రి, భారతీయ ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ వ్యాఖ్యానించారు. అది కూడా స్వచ్చంధంగా, తనకు తానుగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా భారత్ లో కలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

కేంద్ర మంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్
కేంద్ర మంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్

PoK merge with India: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) పై కేంద్ర మంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో పీఓకే కూడా భారత్ లో విలీనమవుతుందన్నారు. ‘‘మరికొన్ని రోజులు వెయిట్ చేయండి. పీఓకే కూడా తనకు తానే భారత్ లో కలిసిపోతానని చెప్పి ముందుకు వస్తుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

రాజస్తాన్ లో..

రాజస్తాన్ లోని దౌసాలో బీజేపీ నిర్వహిస్తున్న ‘పరివర్తన్ సంకల్ప్ యాత్ర’ లో పాల్గొన్న సందర్భంగా కేంద్ర మంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ లోకి రావడానికి వీలుగా కార్గిల్ సరిహద్దును తెరవాలని పీఓకే ప్రజలు డిమాండ్ చేస్తున్నారన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. త్వరలో భారత్ లో విలీనమవుతామని పీఓకే ప్రజలే స్వచ్చంధంగా ముందుకు వస్తారని వీకే సింగ్ వ్యాఖ్యానించారు. పీఓకేలో ఆజాద్ కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్ అనే ప్రాంతాలు ఉన్నాయి. పీఓకే జనాభా సుమారు 45 లక్షలు. వీరిలో 97% ముస్లింలు. మిగతా 3% హిందువులు, క్రిస్టియన్లు, ఇతర మైనారిటీలు ఉంటారు.

ముందు చైనాను ఆపు..

కేంద్ర మంత్రి వీకే సింగ్ వ్యాఖ్యలపై శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేత, ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. లద్దాఖ్ లో, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ లో భారత భూభాగాన్ని ఆక్రమించిన చైనాను ముందు నిలువరించి, ఆ తరువాత పీఓకే గురించి మాట్లాడాలని రౌత్ వ్యాఖ్యానించారు. చైనా ఇటీవల విడుదల చేసిన మ్యాప్ లో అరుణాచల్ ప్రదేశ్ ను తమ సొంత భూభాగంగా చూపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మణిపూర్ లో కొనసాగుతున్న హింసను ఆపి,అక్కడ శాంతియుత పరిస్థితులను నెలకొల్పి, ఆ తరువాత పీఓకే గురించి మాట్లాడాలన్నారు. పీఓకే భారత్ లో కలుస్తే తాము కచ్చితంగా స్వాగతిస్తామన్నారు. అఖండ భారత్ తమ స్వప్నమన్నారు. పీఓకేను భారత్ లో కలిపివేసేందుకు, ఆర్మీ చీఫ్ గా ఉన్నప్పుడే జనరల్ వీకే సింగ్ ప్రయత్నించి ఉండాల్సింది అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. చైనా ఆక్రమణ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే పీఓకే అంశాన్ని ముందుకు తెచ్చారని ఆప్ నేత సౌరభ్ భరధ్వాజ విమర్శించారు.

Whats_app_banner