Nainital fire: నైనిటాల్ అడవుల్లో కార్చిచ్చు; జనావాసాల్లోకి విస్తరిస్తున్న మంటలు-nainital fire reaches near iaf station helicopters army deployed 10 points ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Nainital Fire: నైనిటాల్ అడవుల్లో కార్చిచ్చు; జనావాసాల్లోకి విస్తరిస్తున్న మంటలు

Nainital fire: నైనిటాల్ అడవుల్లో కార్చిచ్చు; జనావాసాల్లోకి విస్తరిస్తున్న మంటలు

HT Telugu Desk HT Telugu

Nainital fire: ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీ జిల్లాలో ఉన్న నైనిటాల్ అడవుల్లో కార్చిచ్చు చెలరేగింది. కిలోమీటర్ల విస్తీర్ణలో మంటలు వ్యాపించాయి. నైనిటాల్ లోని జనావాసాల్లోకి కూడా మంటలు విస్తరిస్తున్నాయి. మంటలను అదుపు చేయడానికి అగ్ని మాపక సిబ్బందితో పాటు స్థానిక అధికారులు కృషి చేస్తున్నారు.

నైనిటాల్ అడవుల్లో మంటలు (HT file photo)

Nainital fire: ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. గత 36 గంటలుగా ఈ కార్చిచ్చు (Nainital fire) కిలోమీటర్ల మేర చెట్లను ఆహుతి చేస్తుంది. ఈ మంటలను నియంత్రించడంలో సహాయపడటానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF), ఇండియన్ ఆర్మీని ఉత్తరాఖండ్ ప్రభుత్వం పిలిచింది. అగ్నిమాపక చర్యల్లో జిల్లా యంత్రాంగం హెలికాప్టర్లను రంగంలోకి దింపింది. నైనిటాల్ అడవుల్లో చెలరేగిన అగ్నిప్రమాదంపై సమావేశం నిర్వహించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు.

క్షణక్షణానికి విస్తరిస్తున్న మంటలు

నైనిటాల్ అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు క్షణక్షణానికి విస్తరిస్తోంది. మంటలను అదుపు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హెలీకాప్టర్లతో నీటిని గుమ్మరించి మంటలను (Nainital wildfire) అదుపు చేయడానికి ప్రయత్నిస్తోంది. సాధ్యమైనంత త్వరగా మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. కార్చిచ్చును అదుపు చేసేందుకు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సాయం కోరామన్నారు.

నైనిటాల్ లోని హైకోర్టు కాలనీకి మంటలు

నైనిటాల్ అడవుల్లో చెలరేగిన నైనిటాల్ లోని హైకోర్టు కాలనీ వరకు విస్తరించాయి. దాంతో, ఆ ప్రాంతంలోని జనావాసాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పైన్స్ ప్రాంతానికి సమీపంలో ఉన్న కాలనీ సమీపంలో మంటలు వ్యాపించాయి. పైన్స్ సమీపంలో ఉన్న పాత, ఖాళీగా ఉన్న ఇంటిని మంటలు చుట్టుముట్టాయి. పైన్స్ ప్రాంతానికి సమీపంలో ఉన్న భారత ఆర్మీ స్థావరాల దగ్గర వరకు మంటలు (Nainital fire) ప్రమాదకరంగా వ్యాపించాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నైనిటాల్ జిల్లాలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు అతి సమీపానికి మంటలు (Nainital wildfire) విస్తరించాయి. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ను సురక్షితంగా ఉంచడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎం ధామి చెప్పారు. ఈ మంటల కారణంగా నైనిటాల్ లోని నైని సరస్సులో బోటింగ్ కార్యకలాపాలను నిషేధించింది.

గత ఏడాది నవంబర్ నుంచి..

ఉత్తరాఖండ్ లో గత ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు 575 అగ్నిప్రమాదాలు జరిగాయి. 689.89 హెక్టార్ల అటవీ ప్రాంతం దగ్ధమయింది. రూ.14 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. ఉత్తరాఖండ్ లోని జఖోలి, రుద్రప్రయాగ్ లలో అడవుల్లో మంటలు పెడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఒకరైన జకోలీలోని తాడియాల్ గ్రామానికి చెందిన నరేష్ భట్ అడవిలో నిప్పంటించాడు. తన గొర్రెలకు కొత్త గడ్డి వస్తుందని ఆయన ఈ పని చేశాడు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.