Kabul blasts | స్కూలు గోడలపై రక్తపు మరకలు.. విద్యార్థుల ఆర్తనాదాలు..!
అఫ్గానిస్థాన్‌లో మళ్లీ పేలుళ్ల మోత మోగింది. రాజధాని కాబూల్‌లోని విద్యాసంస్థలే లక్ష్యంగా మంగళవారం బాంబు దాడులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించినట్టు తెలుస్తోంది. పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
Kabul blast news today | అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో మరోమారు బాంబుల మోత మోగిపోయింది. విద్యాసంస్థలే లక్ష్యంగా మంగళవారం జరిగిన దాడుల్లో ఆరుగురు మరణించినట్టు తెలుస్తోంది. 10మందికిపైగా చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. కొద్ది నిమిషాల వ్యవధిలో వరుస బాంబు దాడులు జరగడంతో గాయాలపాలైన వారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
దస్త్-ఈ-బార్చి అనే ప్రాంతంలోని అబ్దుల్ రహీమ్ షహీద్ హై స్కూల్లో పేలుళ్ల మోత మోగిపోయింది. లోపలికి వెళ్లిన జర్నలిస్టులు, అధికారులు.. అక్కడి పరిస్థితిని చూసి షాక్ అయ్యారు. స్కూలు గోడలకు రక్తపు మరకలు అంటుకుని ఉన్నాయి. పేలుళ్ల ధాటికి నోట్బుక్లు, చిన్నారుల షూలు కాలిపోయి ఉన్నాయి. విద్యార్థుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం నిండిపోయింది.
సూసైడ్ బాంబర్.. ఆత్మహుతికి పాల్పడటంతో ఈ ఘటన జరిగినట్టు సమాచారం. కాగా.. పేలుళ్ల సమయంలో స్కూలులో ఎంతమంది చిన్నారులు ఉన్నారనే విషయంపై ఇంకా సరైన సమాచారం లేదు.
ఘటనకు బాధ్యత వహిస్తూ.. ఇంకా ఎవరూ ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కానీ గతంలో ఈ ప్రాంతానికి పరిసరాల్లోనే ఇస్లామిక్ స్టేట్ సభ్యులు భీకర దాడులకు పాల్పడ్డారని అధికారులు గుర్తుచేస్తున్నారు.
సంబంధిత కథనం