Direct flight to Australia: సౌత్ ఇండియా నుంచి నేరుగా ఆస్ట్రేలియాకు ఫ్లైట్
Direct flight to Australia: బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బుధవారం సాయంత్రం ఆస్ట్రేలియాలోని సిడ్నీకి నేరుగా మొదటి విమానం బయలుదేరనుంది.
Direct flight to Australia: ఆస్ట్రేలియన్ ఎయిర్ క్యారియర్ క్వాంటాస్ తన మొదటి డైరెక్ట్ ఫ్లైట్‌ను బుధవారం బెంగళూరు నుండి సిడ్నీకి నడుపుతోంది. QF68 బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA) నుండి సాయంత్రం 6:35 గంటలకు బయలుదేరుతుంది.
ఇది దక్షిణ భారతదేశం నుండి ఆస్ట్రేలియన్ నగరానికి నేరుగా నడిచే మొదటి విమానం కావడం విశేషం. తెలుగు రాష్ట్రాల నుంచి అంతర్జాతీయ ప్రయాణికులు ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్లాల్సి వచ్చేది. ఢిల్లీతో పోలిస్తే.. బెంగళూరు తెలుగు రాష్ట్రాలకు అత్యంత సమీపంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి విమానాలు ఉన్నప్పటికీ నాన్ స్టాప్ విమానాలు లేవు. దీని వల్ల ప్రయాణ సమయం చాలా ఎక్కువగా ఉంటోంది.
బెంగళూరు నుండి సిడ్నీలోని కింగ్స్‌ఫోర్డ్ స్మిత్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దాదాపు 11 గంటల సమయం పడుతుంది. క్వాంటాస్ తన ఎయిర్‌బస్ A330 ద్వారా ఈ ప్రయాణం సాగించనుంది. ఇది భారతీయ ప్రయాణీకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం. మొదటి రోజు ప్రయాణానికి బిజినెస్, ఎకానమీ తరగతులు పూర్తిగా బుక్ అయ్యాయని సంబంధిత యంత్రాంగం తెలిపింది.
మరో క్వాంటాస్ విమానం బుధవారం సిడ్నీ నుండి బెంగళూరుకు రివర్స్ ట్రిప్ చేస్తుంది. విమానం QF67 కూడా పూర్తిగా బుక్ అయి ఉంది. సాయంత్రం 4:55 గంటలకు బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుంది.
ఆస్ట్రేలియన్ ఎయిర్‌లైన్ భారతదేశానికి చెందిన ఇండిగోతో కోడ్‌షేర్ ఒప్పందాన్ని కలిగి ఉంది. దీని ప్రకారం ఇది సిడ్నీ, బెంగళూరు మధ్య వారానికి నాలుగు రిటర్న్ విమానాలను నడుపుతుంది. బుధ, శుక్ర, శని, ఆదివారాల్లో ఈ విమాన సేవలు అందుబాటులో ఉంటాయి.