CBSE Board Exam 2023: ఫైనాల్ ఎగ్జామ్స్ విద్యార్థుల జాబితా గడువు నేటితో పూర్తి
CBSE Board Exam 2023: సీబీఎస్‌ఈ క్లాస్ 10, సీబీఎస్ఈ క్లాస్ 12 తుది పరీక్షలకు హాజరు కాగోరు అభ్యర్థుల తుది జాబితా సమర్పించేందుకు గడువు నేటితో ముగియనుంది.
CBSE Board Exam 2023: సీబీఎస్ఈ బోర్డు ఎగ్జామ్ 2023 పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల జాబితాను సబ్‌మిట్ చేసేందుకు గడువు నేటితో ముగియనుంది. సీబీఎస్ఈ 10వ తరగతి, సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షకు హాజరుకాబోయే విద్యార్థుల జాబితాను ఆగస్టు 31 నాటికి సమర్పించాలి. అలాగే సీబీఎస్ఈ క్లాస్ 9, సీబీఎస్ఈ క్లాస్ 11 విద్యార్థుల రిజిస్ట్రేషన్ కూడా నేటితో ముగియనుంది.
వీటికి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మూడు వేర్వేరు నోటిఫికేషన్లను ఆగస్టు 26 నుంచి ఆగస్టు 30 మధ్య విడుదల చేసింది. ఆయా గడువు తేదీలకు పొడిగింపు లేదని కూడా హెచ్చరించింది. గడువు తేదీల్లోగా పాఠశాలలు ఆయా వివరాలను సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
గత ఏడాది మాదిరిగా ఈ ఏడాది సీబీఎస్ఈ రెండుసార్లు పరీక్ష నిర్వహించదు. క్లాస్ 10, క్లాస్ 12 పరీక్షలు ఒకేసారి ఉంటాయి. అవి ఫిబ్రవరి 15న ప్రారంభమవుతాయి.
కోవిడ్-19 నేపథ్యంలో సీబీఎస్ఈ 2021-22కు సంబంధించి రెండు సార్లు పరీక్షలు నిర్వహించింది. 2022-23 పరీక్షలకు సంబంధించి సమగ్ర వివరాలు త్వరలోనే సీబీఎస్ఈ నోటిఫై చేయనుంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా సీబీఎస్ఈ బోర్డు కరిక్యులమ్ అనుసరిస్తున్న పాఠశాలలు పెరిగిపోయాయి. ప్రాక్టికల్ అప్రోచ్ కారణంగా సీబీఎస్ఈకి తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి కూడా ఆదరణ పెరుగుతోంది. అలాగే జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సీబీఎస్ఈ సిలబస్ అనుసరిస్తుండడంతో సీబీఎస్ఈ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.