Budget 2024: ఎన్నికల ముందు బడ్జెటే కానీ.. ప్రజాకర్షక పథకాల ఊసే లేదు.. గెలుపుపై అంత ధీమానా?-budget 2024 lacks populist steps shows modi govts confidence as ls polls fast approaching ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Budget 2024: ఎన్నికల ముందు బడ్జెటే కానీ.. ప్రజాకర్షక పథకాల ఊసే లేదు.. గెలుపుపై అంత ధీమానా?

Budget 2024: ఎన్నికల ముందు బడ్జెటే కానీ.. ప్రజాకర్షక పథకాల ఊసే లేదు.. గెలుపుపై అంత ధీమానా?

Sudarshan Vaddanam HT Telugu
Feb 01, 2024 07:25 PM IST

Budget 2024: ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గురువారం కేంద్ర ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా జులైలో, కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడ్తుంది.

పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం చేస్తున్న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. చిత్రంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్
పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం చేస్తున్న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. చిత్రంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ (ANI)

ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గురువారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ లో పెద్దగా ప్రజాకర్షక పథకాలనేమీ ప్రకటించలేదు. నిజానికి, మరి కొద్ది నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. అందువల్ల, ఏ ప్రభుత్వమైనా, ఎన్నికల ముందు ప్రవేశపెట్టే బడ్జెట్ లో ఓట్లు రాబట్టే ప్రజాకర్షక పథకాలను ప్రకటిస్తూ ఉంటుంది.

సాదా సీదా బడ్జెట్

కానీ, మోదీ ప్రభుత్వం మాత్రం ఈ బడ్జెట్ ను సాదా సీదాగా ముగించింది. ఎలాంటి ప్రజాకర్షక పథకాలను ప్రకటించలేదు. మరికొద్ది నెలల్లో ప్రభుత్వ గడువు ముగియనుంది. ఏప్రిల్ లేదా మే నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సాధారణంగా బడ్జెట్లో ప్రజాకర్షక పథకాలను ప్రకటిస్తారు. కానీ మోదీ ప్రభుత్వం అలాంటి ఓట్లను రాబట్టే పథకాలను ప్రకటించలేదు. కేవలం, గత పదేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించింది. తమ పాలనలో దేశం సాధించిన అభివృద్ధిని వివరించింది. తమ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించింది.

గెలుపుపై ధీమానా?

ఏప్రిల్ లేదా మే నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అంటే, ఎన్నికలకు గట్టిగా 3 నెలల సమయం కూడా లేదు. అయినా, ఈ బడ్జెట్ (Budget) లో ప్రజాకర్షక, సంక్షేమ పథకాల జోలికి పోలేదు. కొన్ని పథకాల కొనసాగింపును ప్రకటించారు. మరికొన్ని పథకాలకు కేటాయింపులను పెంచారు… అంతే. ఇలా సాదాసీదా బడ్జెట్ ను ఎన్నికల ముందు ప్రకటించడంపై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో (lok sabha elections 2024) కచ్చితంగా విజయం సాధిస్తామన్న నమ్మకం ఉంది కాబట్టే ఇలా సింపుల్ గా బడ్జెట్ ను రూపొందించారని వారు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో విపక్ష కూటమి ఇండియా గట్టి గా ప్రయత్నిస్తోంది. కానీ, ఆ కూటమిలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. పశ్చిమబెంగాల్ లో ఒంటరి పోటీ అని టీఎంసీ చీఫ్ మమత బెనర్జీ, పంజాబ్ లో ఒంటరి పోటీ అని ఆప్ సీఎం భగవంత్ మన్ ఇప్పటికే ప్రకటించారు. కూటమిలో కీలక నేతగా ఉన్న బిహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్ కూటమికి చెయ్యిచ్చి, బీజేపీతో మళ్లీ జత కలిశారు. ఈ నేపథ్యంలో, రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు నల్లేరుపై నడకేనని, అందువల్ల, ఈ బడ్జెట్ లో ఓట్లు రాబట్టే పథకాలను ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని బీజేపీ భావించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు

గత పదేళ్ల విజయాలే ప్రచారాస్త్రాలా?

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో, గత 10 సంవత్సరాలలో అనేక ప్రజా అనుకూల సంస్కరణలతో దేశం ఎలా పరివర్తన చెందిందనే విషయాన్ని వివరించడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోందనే విషయాన్ని నొక్కి చెప్పారు. 2047 నాటికి భారతదేశాన్ని వికసిత భారత్ గా మార్చడానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. ప్రభుత్వం ప్రస్తుత సంస్కరణలను కొనసాగిస్తుందని, రాష్ట్రాల ఏకాభిప్రాయంతో మరికొన్ని సంస్కరణలను తీసుకువస్తుందని స్పష్టం చేశారు. 80 కోట్ల మందికి ఉచిత రేషన్, ముద్రా యోజన రుణాలు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) ప్రభావం, నైపుణ్యాభివృద్ధిలో సాధించిన విజయాలను ఆర్థిక మంత్రి హైలైట్ చేశారు.

IPL_Entry_Point