Infertility causes: ఈ 7 లైఫ్‌స్టైల్ అంశాల కారణంగా గర్భధారణ ఆలస్యం-watch out for these 7 lifestyle issues that can delay conceiving ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Watch Out For These 7 Lifestyle Issues That Can Delay Conceiving

Infertility causes: ఈ 7 లైఫ్‌స్టైల్ అంశాల కారణంగా గర్భధారణ ఆలస్యం

HT Telugu Desk HT Telugu
Nov 21, 2022 11:27 AM IST

Infertility causes: సంతానలేమి సమస్యలకు జీవనశైలి అంశాలు ప్రధానంగా కారణమవుతున్నాయి. ఆయా అంశాలపై వైద్య నిపుణుల సలహాలు, సూచనలు మీకోసం.

స్మెర్మ్ కదలికలను పరీక్షిస్తున్న వైద్య నిపుణులు (ఫైల్ ఫోటో)
స్మెర్మ్ కదలికలను పరీక్షిస్తున్న వైద్య నిపుణులు (ఫైల్ ఫోటో) (AFP)

దేశంలో సుమారు 2.2 కోట్ల నుంచి 3.3 కోట్ల జంటలు సంతానలేమి (ఇన్‌ఫెర్టిలిటీ) సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య ఆధునిక ప్రపంచంలో వేగంగా పెరుగుతోంది. మీరు ఎంత బాగా నిద్ర పోతున్నారు? ఏం తింటున్నారు? ఎక్కడ పనిచేస్తున్నారు వంటి అన్ని అంశాలు ఫర్టిలిటీపై ప్రభావం చూపుతాయి. జీవనశైలి ప్రవర్తనల్లో ఏవి ఫెర్టిలిటీని ప్రభావితం చేస్తున్నాయి? ఏవి ప్రయోజనకారిగా ఉంటాయి వంటి అంశాలను అర్థం చేసుకొని దానికి అనుగుణంగా మన లైఫ్‌స్టైల్ మార్చుకుంటే ఫెర్టిలిటీ సామర్థ్యం పెరుగుతుంది.

వ్యక్తుల పునరుత్పత్తి ఆరోగ్యం వారి సాధారణ ఆరోగ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. విభిన్న జీవనశైలి ఎంపికలు దీనిని ప్రభావితం చేస్తాయి. దంపతులు సంతానం కోసం ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? ఎలాంటి న్యూట్రిషన్ తీసుకుంటున్నారు? బరువు ఎంత ఉంది? వ్యాయామం చేస్తున్నారా? సైకలాజికల్‌గా ఒత్తిడి ఫీలవుతున్నారా? తీవ్రమైన కాలుష్యం ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నారా? వంటి అనేక అంశాలు ఫెర్టిలిటీని ప్రభావితం చేస్తాయి.

ఇవి తీసుకుంటే ఇన్‌ఫెర్టిలిటీ: డాక్టర్ క్షితిజ్, ఇందిరా ఐవీఎఫ్

ఇందిరా ఐవీఎఫ్ సీఈవో, కోఫౌండర్ డాక్టర్ క్షితిజ్ ముర్దియా హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయా అంశాలను నొక్కిచెప్పారు. ‘మద్యపానం, కెఫైన్ తీసుకోవడం, నిషేధిత మత్తుపదార్థాలు తీసుకోవడం, సిగరెట్లు తాగడం గర్భం దాల్చే సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. ఉదాహరణకు లైఫ్‌స్టైల్ డిసీజ్‌గా పిలుచుకునే డయాబెటిస్ మహిళల్లో పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్)కు దారితీస్తుంది. ఇదే డయాబెటిస్ పురుషుల్లో టెస్టోస్టిరోన్ స్థాయిని తగ్గిస్తుంది. ఈ రెండు అంశాలు పునరుత్పత్తి సామర్థ్యాన్ని ప్రభావితం చేసి ఇన్‌ఫెర్టిలిటీకి దారితీస్తాయి..’ అని చెప్పారు.

‘దీర్ఘకాలిక డయాబెటిస్ పేషెంట్లు రక్తప్రసరణ సమస్యలను, నరాలు, కండరాల బలహీనత సమస్యలను ఎదుర్కొంటారు. ఇది ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ (అంగస్తంభన) సమస్య, శ్రీఘ్రస్కలన సమస్యలకు దారితీస్తుంది. ఇది ఫెర్టిలిటీ సమస్యలకు కారణమవుతుంది. డయాబెటిక్ కాని మహిళలతో పోలిస్తే టైప్-1 డయాబెటిక్ మహిళల్లో గర్భధారణ అవకాశఆలు తగ్గిపోతాయి. అలాగే మిస్‌క్యారేజ్ (గర్భం నిలవకపోవడం) ప్రమాదాలు పెరిగిపోతాయి. ఒబెసిటీ, ఎనీమియా (రక్తహీనత) సంక్లిష్టతలను పెంచుతాయి. అలాగే పర్యావరణంలో ఉండే హానికారక పదార్థాల కారణంగా కూడా ఫెర్టిలిటీ సమస్యలు ఎదురవుతాయి. రేడియోయాక్టివ్ పదార్థాలు, ఫ్యాక్టరీ వాయువులు, అధిక పరిమాణంలో కాలుష్యం సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. ఎక్కువ కాలం ఈ వాతావరణంలో ఉంటే పురుషులు, స్త్రీలల్లో పునరుత్పత్తి వ్యవస్థ దెబ్బతింటుంది. అండాల పరిమాణం, స్వరూపం, వీర్యకణాలు దెబ్బతింటాయి..’ అని వివరించారు.

‘దంపతులు ఏడాదికంటే ఎక్కువ కాలం సంతానం కోసం ప్రయత్నించినప్పటికీ గర్భధారణ జరగకపోతే దంపతులు ఫెర్టిలిటీ వైద్య నిపుణులను సంప్రదించాలి. సంతానం కలగడం లేదని స్ట్రెస్‌కు గురైతే మానసిక ఆరోగ్యం పాడై సమస్య ఇంకా తీవ్రరూపం దాల్చుతుంది. అందువల్ల ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే పునరుత్పత్తి సామర్థ్యం మెరుగవుతుంది..’ అని చెప్పారు.

గర్భధారణ ఆలస్యమవడానికి కారణమయ్యే లైఫ్‌స్టైల్ అంశాలు

గర్భధారణ ఆలస్యమవడానికి గల జీవనశైలి అంశాలను పీడీ హిందూజా హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ గైనకాలజీ, అబ్‌స్టెట్రిక్స్ వైద్య నిపుణులు డాక్టర్ సుజిత్ వివరించారు.

  1. భాగస్వాముల ఇద్దరి ఫెర్టిలిటీ సామర్థ్యాన్ని నిర్ధారించడంలో వయస్సు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే దంపతులు సంతానం కోసం ప్రయత్నించినా గర్భధారణ జరగకపోతే.. వయస్సు ఎక్కువగా ఉన్న జంట 6 నెలలకే ఫెర్టిలిటీ నిపుణులను సంప్రదించాలి. ఇక మిగిలిన వారు ఏడాదిపాటు ప్రయత్నించినా గర్భధారణ జరకపోతే నిపుణులను సంప్రదించాలి. వయస్సు పెరిగిన కొద్దీ డయాబెటిస్ మెలిటస్, హైపర్‌టెన్షన్ వంటి జీవనశైలి వ్యాధులు పెరిగే ప్రమాదం ఎక్కువవుతుంది. ఇది దంపతుల లిబిడోను, ఫెర్టిలిటీ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల చికిత్స కోసం ఔషధాలను అర్థవంతంగా వాడాలి.
  2. ఆరోగ్యకరమైన బరువును మెయింటేన్ చేయాలి. అది హార్మోనల్ అసమతుల్యతను నిరోధిస్తుంది. లేదంటే ఈ అసమతుల్యత ఫెర్టిలిటీపై ప్రభావం చూపుతుంది. అలాగే మిస్‌క్యారేజ్, ఇతర సంక్లిష్టతలకు దారితీస్తుంది. ఒబెసిటీ, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(పీసీఓఎస్) ఉన్న మహిళల్లో 5 శాతం బరువు కోల్పోయినా ప్రెగ్నెన్సీ అవకాశాలను పెంచుతుంది. అధిక బరువు ఉండి సంతానలేమితో బాధపడుతున్న మహిళలు మెరుగైన ఫలితం కోసం బరువు తగ్గాలని సూచిస్తారు. అధిక బరువు ఒవేరియన్ డిస్‌ఫంక్షన్, ఇన్‌ఫెర్టిలిటీతో ముడివడి ఉంటుంది.
  3. రెగ్యులర్‌గా ఓ మోస్తరు వ్యాయామం ఎండార్ఫిన్ల విడుదలకు సాయపడుతుంది. ఇది రిలాక్సేషన్‌కు, అలాగే బరువును అదుపులో ఉంచుకోవడానికి సాయపడుతుంది. అయితే అధిక వ్యాయామం పరిస్థితి తీవ్రతను పెంచుతుంది. తక్కువ బరువు ఉ్న మహిళలు అతిగా వ్యాయామం చేస్తే, లేదా అనబాలిక్ స్టెరాయిండ్స్ తీసుకుంటే హార్మోన్ల అసమతుల్యతకు దారితీసి ఫెర్టిలిటీ సమస్యలకు కారణమవుతుంది.
  4. ప్రస్తుత తరం మత్తుపదార్థాలకు అలవాటు పడుతోంది. ముఖ్యంగా పొగ తాగడం, ఇతర పొగాకు ఉత్పత్తులు వాడడం, మరిజువానా, హెరాయిన్, కొకైన వంటి మాదక ద్రవ్యాలు వాడడం, కెఫైన్‌కు అలవాటు పడడం, అతిగా మద్యపానం, వంటివి ఫెర్టిలిటీ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ అలవాట్లు ఉంటే వెంటనే మానేయాలి.
  5. సంతానలేమితో బాధపడుతున్న దంపతులు యాంగ్జైటీ, ఎమోషనల్ స్ట్రెస్‌ను దూరం చేసుకోవాలి. అలాగే న్యూట్రిషన్ ఫెర్టిలిటీని మెరుగుపరుస్తుంది. అందువల్ల సమతుల ఆహారం తీసుకోవాలి.
  6. రేడియేషన్ థెరఫీ, కీమో థెరఫీ మహిళల్లో ఇన్‌ఫెర్టిలీటీ సమస్యకు దారితీస్తుంది. ఈ ట్రీట్మెంట్ తీసుకునే వారు ఎంబ్రియో ఫ్రీజింగ్ వంటి ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్‌ మార్గాలను ఎంచుకోవాలి.
  7. విద్యుదయస్కాంత తరంగాలను విడుదల చేసే మొబైల్ ఫోన్‌ల వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల వాడకాన్ని తగ్గించడం ద్వారా ఇన్‌ఫెర్టిలిటీ సమస్యలను దూరం చేసుకోవచ్చు. మన దైనందిన జీవితంలో రసాయనాలు, పురుగుమందుల అవశేషాలను వినియోగిస్తున్నామని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పర్యావరణంలో ఉన్న అన్ని ప్రమాదకర పదార్థాలను నివారించలేం. కానీ వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు.

WhatsApp channel