Costliest Tea: మన దేశంలో అత్యంత ఖరీదైన టీ ఇదే, కొనాలంటే లక్షలు ఖర్చు పెట్టాలి-this is the most expensive tea in our country one has to spend lakhs to buy it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Costliest Tea: మన దేశంలో అత్యంత ఖరీదైన టీ ఇదే, కొనాలంటే లక్షలు ఖర్చు పెట్టాలి

Costliest Tea: మన దేశంలో అత్యంత ఖరీదైన టీ ఇదే, కొనాలంటే లక్షలు ఖర్చు పెట్టాలి

Haritha Chappa HT Telugu
Apr 27, 2024 07:00 AM IST

Costliest Tea: టీ తాగనిదే ఎంతోమందికి తెల్లవారదు. టీ చాలా చవకైన ధరలోనే దొరుకుతుంది. కానీ మన దేశంలోనే అతి ఖరీదైన టీ ఒకటి ఉంది. ఇది కొనడం అందరి తరం కాదు.

ఖరీదైన టీ
ఖరీదైన టీ (Pixabay)

Costliest Tea: మన దేశంలో టీ తాగడం అనేది సంస్కృతిలో భాగంగా మారిపోయింది. తెల్లారాక టీ పొట్టలో పడ్డాకే పనులు ప్రారంభించే వారు ఎంతోమంది. ముఖ్యంగా డార్జిలింగ్, అసోం టీలను ఇష్టపడే వారి సంఖ్య చాలా ఎక్కువ. మన దేశంలో డార్జిలింగ్, అసోం, నీలగిరి వంటి ప్రాంతాలు అనేక రకాల తేయాకులకు ప్రసిద్ధి చెందినవి. అతి పెద్ద టీ ఉత్పత్తిదారుల్లో మన దేశం కూడా ఒకటి.

మనదేశంలో ఎన్నో రకాల టీలు ఉన్నాయి. వాటిల్లో అతి ఖరీదైనది ఒకటి ఉంది. దాన్ని కొనాలంటే అందరి వల్ల కాదు. కేవలం కోటీశ్వరులు మాత్రమే తాగే టీ ఇది. డార్జిలింగ్‌లో ఈ టీని పండిస్తారు. అక్కడ చవక ధరల్లో అనేక రకాల తేయాకులు పండిస్తూ ఉంటారు. అలాగే మన దేశంలోనే అత్యంత టీ ని కూడా అక్కడ పండించారు. డార్జిలింగ్ లో మాత్రమే ఈ తేయాకులను అమ్ముతున్నారు. కిలో టీ పొడి ధర లక్షన్నర రూపాయలు. భారతదేశంలో ఇంతవరకు కిలో టీ పొడి అంత ధరకు అమ్ముడుపోవడం ఇదే తొలిసారి.

ఈ టీ తాగాలనుకుంటే డార్జిలింగ్ లోని మాల్ రోడ్డు ప్రాంతానికి వెళ్లాలి. అక్కడే ఒక దుకాణంలో అత్యంత ఖరీదైన ఈ తేయాకులు లభిస్తాయి.

అతి ఖరీదైన టీ

ఇక ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ పొడి కూడా ఉంది. ఇది మన దేశంలో పండదు. దీని ధర కిలో 8 కోట్ల 20 లక్షల రూపాయల కన్నా అధికంగానే ఉంటుంది. ఈ తేయాకుల్ని చైనాలోని పూజియాన్ ప్రొవిన్స్ లో ఉన్న పర్వతాల్లో మాత్రమే పండిస్తారు. ఆ తేయాకు రకం పేరు ‘డా హాంగ్ పావో’.

బంగారం కన్నా ఖరీదైన టీ పొడిగా దీన్ని చెప్పుకుంటారు. ఒక గ్రాము టీ పొడి కొనాలంటే 82,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఒక గ్రాము స్వచ్ఛమైన బంగారం ధర 6000 రూపాయలు ఉంది. అంటే ఇది బంగారం కన్నా విలువైనది. ఈ టీ పొడిని చాలా తక్కువగా పండిస్తారు. చైనా ఈ తేయాకును తమ జాతీయ సంపదగా ప్రకటించింది. చైనా అధ్యక్షులు అప్పుడప్పుడు ఇతర దేశాల అధ్యక్షులకు ఈ టీ పొడిని బహుమతులుగా పంపిస్తూ ఉంటారు.

చైనాలోనూ కొనాలంటే ఈ తేయాకు రకం దొరకదు. అప్పుడప్పుడు దీన్ని వేలం వేస్తూ ఉంటారు. అలాంటి సమయంలోనే కొనుక్కోవాలి. అది కూడా 50 గ్రాములు, 100 గ్రాములు లెక్కన వేలం వేస్తారు.

చైనాలో పురాతన కాలం నుంచి డా హాంగ్ పావో తేయాకు సాగు జరుగుతోంది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే ఈ టీ అంత ఖరీదని చెప్పుకుంటారు. చైనాలో మింగ్ రాజవంశం పాలిస్తున్న కాలంలోనే ఈ తేయాకుల గొప్పతనం బయటపడిందని అంటారు. అప్పుడు మింగ్ రాజ్యానికి చెందిన రాణి అనారోగ్యానికి గురైందని, ఆ సమయంలో చైనా వైద్యులు డా హాంగ్ పావో టీ ని అందించారని, ఆమె కోలుకుందని చెబుతారు. అప్పటినుంచి ఈ తేయాకులను పండించడం ప్రారంభించారని అంటారు. మింగ్ రాజ్యానికి చెందిన రాజులు కూడా ఈ తేయాకును ప్రతిరోజూ ప్రత్యేకంగా చేయించుకుని తాగేవారని చెబుతారు.

WhatsApp channel

టాపిక్