Dal Vada Recipe । దండ కడియాల్ పాట వింటూ.. ఈ దాల్ వడలు తింటుంటే మస్త్ గుంటది!-this delicious dal vadas will make you grove with happiness check recipe inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dal Vada Recipe । దండ కడియాల్ పాట వింటూ.. ఈ దాల్ వడలు తింటుంటే మస్త్ గుంటది!

Dal Vada Recipe । దండ కడియాల్ పాట వింటూ.. ఈ దాల్ వడలు తింటుంటే మస్త్ గుంటది!

HT Telugu Desk HT Telugu
Dec 27, 2022 06:01 PM IST

Dal Vada Recipe: మీకు నచ్చిన పప్పు ధాన్యాలతో గొప్ప రుచిగా ఉండే వడలు చేసుకోవచ్చు. శనగపప్పుతో చేసే దాల్ వడల రెసిపీ ఇక్కడ ఉంది చూడండి.

Dal Vada Recipe
Dal Vada Recipe (Pixabay)

చలికాలంలో సాయంత్రం వేళ ఒక కప్పు చాయ్ తాగుతున్నప్పుడు పక్కనే తినడానికి కొన్ని స్నాక్స్ ఉంటే చాలా బాగుంటుంది కదా. వేడివేడిగా తినడానికి పకోడిలు, గారెలు, వడలు తినాలని చాలా మందికి ఉంటుంది. మీకోసం ఇప్పుడొక రుచికరమైన రెసిపీని పరిచయం చేస్తున్నాం. మనం ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కోసం చేసుకొనే వడలు కాకుండా, దాల్ వడలు ఎప్పుడైనా తిన్నారా?

దాల్ వడలను మీకు నచ్చిన పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలతో కలిపి తయారు చేసుకునే సాంప్రదాయ భారతీయ వడలు. పైనుంచి క్రిస్పీగా, లోపల కొంచెం మెత్తగా ఉండే ఈ దాల్ వడలు ఎంతో రుచిగా ఉంటాయి. టీటైంలో కబుర్లు చెప్పుకుంటూ తినడానికి, అతిథులు వచ్చినపుడు అందించడానికి ఉత్తమంగా ఉంటాయి. దండ కడియాల్ వంటి మాస్ పాట వింటూ దాల్ వడల్ తింటుంటే ఎంత మస్త్ గుంటదో మాటల్లో చెప్పలేం.

మీరూ ఈ దాల్ వడల రుచిని ఆస్వాదించాలనుకుంటే శనగపప్పుతో సులభంగా తయారు చేసుకోగలగే రెసిపీ ఈ కింద ఉంది చూడండి, చూసి చేసుకోండి, చేసుకొని తినండి, తిని ఆనందించండి.

Dal Vada Recipe కోసం కావలసిన పదార్థాలు

  • 1 1/2 కప్పు శనగ పప్పు
  • 1 కప్పు ఉల్లిపాయల ముక్కలు
  • 1 స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్
  • 2-3 టేబుల్ స్పూన్లు కొత్తిమీర
  • 1 కరివేపాకు రెమ్మ
  • 2 స్పూన్ కారం
  • 1/2 టీస్పూన్ ఇంగువ
  • 1/2 టీస్పూన్ పసుపు
  • 1 స్పూన్ సుగంధ దినుసులు
  • ఉప్పు రుచికి తగినట్లుగా
  • నూనె డీప్ ఫ్రై కోసం

దాల్ వడలు రెసిపీ- తయారీ విధానం

  1. ముందుగా శనగ పప్పును చక్కగా కడిగి నీటిలో 2 గంటలు నానబెట్టండి. అనంతరం ఈ నానబెట్టిన శనగపప్పులో కొంచెం ఉప్పు వేసి బాగా దంచండి.
  2. ఇప్పుడు బ్లెండర్ జార్‌లో జీరా, ఫెన్నెల్ సీడ్స్, ఎర్ర మిరపకాయలు, దాల్చినచెక్క వేసి మసాలా పొడిని తయారు చేయండి.
  3. ఇప్పుడు పప్పు మిశ్రమంలో తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం-వెల్లుల్లి పేస్ట్ , రుబ్బిన మసాలా వేసి బాగా కలపండి. మిశ్రమాన్ని సమాన భాగాలుగా విభజించి చిన్న చిన్న బంతులు తయారు చేసుకోవాలి.
  4. ఇప్పుడు, మీడియం మంట మీద పాన్‌లో కొంచెం నూనె వేడి చేసి, వడలను బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు డీప్-ఫ్రై చేయండి.

అంతే దాల్ వడలు రెడీ, వేడి వేడిగా సర్వ్ చేసుకోండి.

WhatsApp channel

సంబంధిత కథనం