bed cleaning: బెడ్ షీట్లు ఎన్ని రోజులకు మారుస్తున్నారు?-process of cleaning bedsheets pillow covers and pillows for good health and sleep ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Process Of Cleaning Bedsheets, Pillow Covers And Pillows For Good Health And Sleep

bed cleaning: బెడ్ షీట్లు ఎన్ని రోజులకు మారుస్తున్నారు?

Koutik Pranaya Sree HT Telugu
Apr 25, 2023 06:20 PM IST

bed cleaning: బెడ్‌షీట్లు, పిల్లో కవర్లు, బ్లాంకెట్లు ఇలా ప్రతిదీ మార్చడానికీ, ఉతకడానికి ఒక పద్ధతి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం.

బెడ్‌షీట్ మార్చడం
బెడ్‌షీట్ మార్చడం

పడుకుని లేస్తాం.. బెడ్ మీద ఏం దుమ్ముంటుందిలే అనుకుని చాలా మంది కొన్ని రోజుల తరబడి బెడ్‌షీట్లు, పిల్లో కవర్లు మార్చరు. ఇంతకీ వాటిని శుభ్రపరచాలో, ఎన్ని రోజులకోసారి మార్చితే మంచిదో చూద్దాం. శుభ్రమైన బెడ్ మంచి నిద్రకు తోడ్పడుతుంది.

బెడ్‌షీట్లు, పిల్లో కవర్లు:

చెమటపట్టే కాలంలో అయినా, చలికాలంలో అయినా కనీసం వారానికి ఒకసారి తప్పకుండా వీటిని మార్చాలి. చెమట రాకపోయినా మన శరీరం మీదున్న మ‌ృతకణాలు , దుమ్ము, దూళి, మనం శరీరానికి రాసుకున్న లోషన్లు, మేకప్, నూనెలు.. ఇలా మనకు తెలీకుండా చాలానే బెడ్‌షీట్లు, పిల్లో కవర్ల మీద పేరుకుపోతాయి. వాటివల్ల మొటిమలు, ఇతర శ్వాస సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. కంటికి కనిపించని ఈ మురికి వల్ల మనకు హాని జరగకూడదంటే సరైన పద్ధతిలో వాటిని ఉతకడం కూడా ముఖ్యమే. నేరుగా ఉతికేయకుండా కనీసం అరగంట వేడినీళ్లలో డిటర్జెంట్ వేసి వీటిని నానబెట్టాలి. తరువాతే చేతితో లేదా వాషింగ్ మెషీన్‌లో వేసి శుభ్రం చేయాలి. ఒకవేళ ఫ్యాన్సీ లేసులు, ఎంబ్రాయిడరీలు ఉన్న బెడ్‌షీట్లు వాడుతున్నట్లయితే వాటిని ఎలా ఉతకాలో వాటిమీద రాసుంటుంది. దాని ప్రకారం శుభ్రం చేయండి. ఉతకడం పూర్తయ్యాక ఎండలో ఆరవేయండి. పూర్తిగా ఆరాక మాత్రమే మడిచి భద్రపరచండి. వీలైతే ఐరన్ కూడా చేసి చూడండి. ఎలాంటి ముడతలు లేకుండా ఉండటం వల్ల మార్పు మీకే తెలుస్తుంది.

దిండ్లు:

మీరు చివరగా మీ దిండ్లను ఎప్పుడు ఉతికారో గుర్తుందా? లేకపోతే వెంటనే వాటిని శుభ్రం చేయండి. దిండ్లను సంవత్సరానికి కనీసం రెండు నుంచి మూడు సార్లు తప్పకుండా ఉతకాలి. దిండ్లకి కవర్లు ఉంటాయి కాబట్టి ఈ సమయం తీసుకోవచ్చు. మధ్య మధ్యలో ఎండలో పెడుతుండాలి. ఉతికేటప్పుడు వాటి ఆకారం దెబ్బతినకుండా ఉండటానికి సాధారణంగా అయితే దిండ్లను డ్రై క్లీనింగ్ చేయడమే మంచిది. అయితే కొన్ని రకాలను మాత్రం ఇంట్లోనే మెషీన్‌లో, చేతితో ఉతకొచ్చు. ఇంట్లో ఉతికే ముందు డిటర్జెంట్ కలిపిన నీళ్లలో నానబెట్టాలి. దిండ్లు డిటర్జెంట్ ని పీల్చుకుంటాయి కాబట్టి వీలైనన్ని ఎక్కువ సార్లు మంచి నీటిలో ముంచి తీయండి. ఉతికాక మధ్యాహ్నపు ఎండలో ఆరనివ్వండి.

దుప్పట్లు:

వెచ్చదనం కోసం కప్పుకునే దుప్పట్లు ఎక్కువ కాలం ఉతకకపోతే మురికిగా తయారవుతాయి. కనీసం ప్రతి రెండు నెలలకు ఒకసారి వాటిని శుభ్రపరచడం మంచిది. వీలైతే లాండరీకి ఇవ్వడం ఇంకా మంచిది. కానీ ఇంట్లోనే ఉతికితే వేడినీళ్లలో నానబెట్టండి. ముందుగా రంగు పోతుందేమో తెలుసుకోడానికి ప్యాచ్ టెస్ట్ చేయండి. వాషింగ్ మెషీన్ లో వేస్తే తక్కువ గాఢత గల డిటర్జెంట్‌తో గోరువెచ్చని నీటితో ఉతకాలి.

WhatsApp channel

టాపిక్