Veg Kurma Recipe: ఫంక్షన్ల లాంటి రుచితో వెజ్ కూర్మా రెసిపీ.. ఇంట్లో ఎలా చేయాలంటే..
Veg Kurma Recipe: వెజ్ కూర్మా రుచికరంగా ఎలా చేయాలో పక్కా కొలతలతో సహా చూసేయండి.
వెజ్ కూర్మా (flickr)
రెస్టరెంట్లలో, ఫంక్షన్లలో చాలా సార్లు వెజ్ కూర్మా తింటూ ఉంటాం. అయితే ఇంట్లో అలాంటి రుచి రావాలంటే ఒక కూర్మా మసాలాతో ఈ కూర వండాలి. ఇప్పుడు కూర్మా మసాలాతో సహా వెజ్ కూర్మా ఎలా చేసుకోవాలో వివరంగా చూసేయండి.
వెజ్ కూర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు:
మసాలా కోసం:
4 చెంచాల కొబ్బరి తురుము
గుప్పెడు జీడిపప్పు (నానబెట్టినవి)
2 చెంచాల గసగసాలు
చెంచా పుట్నాలు
సగం చెంచా ధనియాలు
పావు చెంచా సోంపు
పావు చెంచా జీలకర్ర
2 లవంగాలు
2 యాలకులు
4 మిరియాలు
1 మరాఠీ మొగ్గ
2 పచ్చిమిర్చి, తరుగు
2 వెల్లుల్లి రెబ్బలు
చిన్న అల్లం ముక్క
కూరగాయలు:
1 కప్పు క్యాలీఫ్లవర్ ముక్కలు
సగం కప్పు బంగాళదుంప ముక్కలు
సగం కప్పు బటానీ
సగం కప్పు బీన్స్ ముక్కలు
సగం కప్పు క్యారట్ ముక్కలు
2 చెంచాల నూనె
1 ఉల్లిపాయ, తరుగు
1 టమాటా, ముక్కలు
కరివేపాకు రెబ్బ
పావు చెంచా పసుపు
సగం చెంచా కారం
2 చెంచాల పెరుగు
వెజ్ కూర్మా తయారీ విధానం:
- ముందుగా కూరగాయలన్నీ శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. క్యాలీఫ్లవర్ కూడా కాస్త వేడినీళ్లలో మరిగించి శుభ్రం చేయాలి.
- ఇప్పుడు మిక్సీలో మసాలా కోసం అని ఇచ్చిన లిస్టులో ఉన్న పదార్థాలన్నీ వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని మిక్సీ పట్టుకోవాలి.
- ఒక ప్రెజర్ కుక్కర్లో నూనె వేసుకుని వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేగనివ్వాలి. అవి రంగు మారాక కరివేపాకు, టమాటాలు, పసుపు, కారం వేసుకుని కలియబెట్టాలి.
- ఇప్పుడు ముక్కలు కాస్త మెత్తబడ్డాక కూర్మా కోసం మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకుని కలుపుకోవాలి. ఒక అయిదు నిమిషాల పాటూ సన్నం మంట మీద మసాలా బాగా వేగనివ్వాలి.
- నూనె తేలడం గమనిస్తే ఇప్పుడు పెరుగు వేసుకుని బాగా కలపాలి. అందులోనే తరుగుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసుకుని కలుపుకోవాలి. 2 కప్పులు నీళ్లు పోసుకుని కలపాలి.
- మూత పెట్టుకుని 2 విజిల్స్ వచ్చేదాకా ఆగాలి. అంతే వేడివేడిగా వెజిటేబుల్ కూర్మా సర్వ్ చేసుకోవడమే.