Best Serums: ముఖానికి సీరం ఎలా ఎంచుకోవాలి? ఏ రకాలుంటాయి?
Best Serums: ముఖానికి సమస్య, అవసరం తగ్గట్లు సీరం ఎంచుకోవాలి. కొన్ని టిప్స్ తెల్సుకుంటే మీకు ఎలాంటి సీరం నప్పుతుందో తెలుస్తుంది. అవేంటో చూసేయండి.

ఇటీవల కాలంలో ఫేస్ సీరమ్‌ల వాడకం ఎక్కువ అయింది. మార్కెట్‌లో రకరకాల బ్రాండ్ల సీరమ్‌లు అందుబాటులో ఉంటున్నాయి. అయితే వీటిని వాడటం వల్ల అసలు ఉపయోగాలు ఏమిటి? ఏఏ ఫేస్ సీరమ్‌లు మంచివి అనే విషయం అవగాహన ఉండాల్సిందే. ఆ వివరాలేంటో తెల్సుకుని మీరూ మంచి సీరమ్‌లను ఎంపిక చేసుకోండి.
ఫేస్ సీరమ్‌లతో ప్రయోజనాలు :
ఫేస్ సీరమ్‌ల్లో చాలా రకాలు ఉంటాయి. ప్రతి చర్మ సమస్యకు తగిన సీరమ్‌లు ఉంటాయి. మన చర్మం ఆరోగ్యంగా, నిగారింపుగా ఉండాలంటే ముందు హైడ్రేటెడ్‌గా ఉండటం అనేది అత్యవసరం. ఫేస్ సీరమ్‌లు చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. అందువల్ల డల్‌గా ఉన్న చర్మం కాస్తా మెరుస్తూ ఉన్నట్లు మారుతుంది. వీటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే నష్టం నుంచి కాపాడతాయి. వీటిలో యాంటీ ఏజింగ్ సీరమ్‌లూ ఉంటాయి. అవి ముడతలు, గీతల్ని రాకుండా చేసి యవ్వనంగా ఉండేందుకు సహకరిస్తాయి. కొందరికి ముఖ చర్మంపై నల్లటి మచ్చలు వస్తుంటాయి. అలాంటి వారు విటమిన్ సీ సీరమ్‌లను వాడటం వల్ల పిగ్మంటేషన్, నల్ల మచ్చల్లాంటివి తగ్గి ముఖ చర్మం అంతా ఒకే రకమైన ఛాయను సంతరించుకుంటుంది. మొటిమలు, వైట్‌హెడ్స్, బ్లాక్‌హెడ్స్ లాంటి సమస్యలకూ ఇవి పరిష్కారాన్ని చూపిస్తాయి.
ఏ సమస్యలకు ఏవి మంచి ఫేస్ సీరమ్‌లు :
- సాధారణ చర్మం ఉన్న వారు ఎలాంటి ఫేస్ సీరమ్‌ని వాడుకున్నా బాగానే ఉంటుంది. అయితే వ్యక్తిగత అవసరాల అనుగుణంగా వాటిని ఎంపిక చేసుకోవాలి. హైడ్రాలిక్ యాసిడ్, గ్లిజరిన్ లాంటివి ఎక్కువగా ఉండే సీరమ్‌లు పొడి చర్మం ఉన్నవారికి, సాధారణ చర్మం ఉన్న వారికి కూడా బాగా ఉపయోగపడతాయి.
- జిడ్డు చర్మం ఉన్న వారికి చర్మంలో సీబమ్ ఉత్పత్తి తగ్గాలి. అందుకనే వీరు నియాసినమైడ్ లాంటివి ఉన్న సీరమ్‌లను ప్రయత్నించాలి. ఇది జిడ్డును నియంత్రించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది.
- కొంత మందికి ముఖం నిండా మొటిమలు వచ్చేసి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలాంటి వారు సాల్సిలిక్ యాసిడ్ ఉన్న వాటిని ఎంచుకోవాలి. ఇది వాపుల్ని తగ్గించి మొటిమల్ని నియంత్రిస్తుంది. మొటిమల్ని కలిగించే బ్యాక్టీరియాల్లాంటివి ఉంటే వాటిపైనా సమర్థవంతంగా పని చేస్తాయి.
- కొంత మందికి చిన్న వయసులోనే గీతలు, ముడతల్లాంటివి వచ్చేసి ముసలితనం వచ్చినట్లుగా అనిపిస్తుంది. అలాంటి వారు రెటీనాల్ ఉండే సీరమ్‌ని వాడుకోవాలి.
- కొంత మందికి ముఖ చర్మం కాంతి విహీనంగా ఉంటుంది. అలా డల్ స్కిన్ ఉన్న వారు విటమిన్ సీ ఉన్న సీరమ్‌ని ఉపయోగించుకోవడం వల్ల ఫలితాలు బాగుంటాయి.