Friday Feelings| నువ్వు సాయం చేసినా, తిరిగి నీకు గాయం చేసే వాళ్లుంటారు.. నీ వ్యక్తిత్వం విలువ వారికేం తెలుసు!-friday feelings do not let your current circumstances determine your character read this story ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Friday Feelings| నువ్వు సాయం చేసినా, తిరిగి నీకు గాయం చేసే వాళ్లుంటారు.. నీ వ్యక్తిత్వం విలువ వారికేం తెలుసు!

Friday Feelings| నువ్వు సాయం చేసినా, తిరిగి నీకు గాయం చేసే వాళ్లుంటారు.. నీ వ్యక్తిత్వం విలువ వారికేం తెలుసు!

HT Telugu Desk HT Telugu
Feb 10, 2023 04:30 AM IST

Friday Feelings: పరిస్థితుల ప్రభావం లేదా ఒకరి స్వభావం మిమ్మల్ని బాధపెడితే వెంటనే మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోకండి. మీ భావాలు, భావోద్వేగాలు మీ నియంత్రణలో ఉండాలి. ఎందుకో ఈ కథ చదివితే మీకే తెలుస్తుంది.

Friday Feelings
Friday Feelings (Unsplash)

Friday Feelings: మంచితనం అనేది మీ వ్యక్తిత్వం, కానీ కొందరు దానిని అమాయకత్వం అనుకుంటారు, మరికొందరు మీరు బలహీనులు అనుకుంటారు. చాలా మంది మీ మంచితనాన్ని ఆసరా చేసుకొని లబ్ది పొందాలని చూస్తారు. అయినప్పటికీ, మీరు ఎంత మంచి చేసినా మీకు చెడు జరగాలనే కోరుకుంటారు. మీరు సాయం చేసినా తిరిగి మీకు గాయం చేసే వాళ్లుంటారు. మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటానికి మీ చుట్టూ ఎన్నో శక్తులు ఉంటాయి. కొన్నిసార్లు మీరు కూడా డీలా పడిపోవచ్చు. మంచిగా ఉండటం వల్లనే ఈ వంచన చేశారని మీకు అనిపించవచ్చు. మనమెందుకు మంచివాళ్లలాగా ఉండాలి, మనం కూడా వారికి తగినట్లుగా తప్పుడు వ్యక్తిగా తయారవుదాం అని మీ ఆలోచనలు మిమ్మల్ని రెచ్చగొట్టవచ్చు. కానీ, శాంతించండి, మిమ్మల్ని మీరే క్షమించుకోండి.

ఎందుకంటే మీ వంటి వ్యక్తిత్వం అందరికీ ఉండదు, ఈరోజు వారు మీ మంచితనాన్ని వాడుకొని మీకు నమ్మక ద్రోహం చేసినా, కానీ ఏదో రోజు దాని గొప్పతనం అందరికీ తెలిసి వస్తుంది. పండ్లున్న చెట్టుకే రాళ్లు విసురుతారు, అలాగే మీరు విలువైన వారు కాబట్టే మీపై విషం కక్కుతారు. ఏది ఏమైనా ఎవరి కోసమో మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోనవసరం లేదు.

మీరు ఒక్క విషయం గుర్తుంచుకోండి, అందరూ మీలాగా ఆలోచించలేరు, అందరికీ మీరు చేసిన సాయం గుర్తుండదు. కానీ మీరు ఏంటో మీకు మాత్రమే తెలుసు. మీరు మీలా ఉండండి చాలు, మీదారిలో మీరు సాగిపోండి. మీది ఇచ్చే చేయి, వారిది తీసుకునే చేయి. ఒక గొప్ప సూక్తి ఉంది. అదేమిటంటే.. ప్రతిభతో ప్రముఖులు కావొచ్చు, కానీ వ్యక్తిత్వం ఉంటేనే మహాత్ములు అవుతారు. ఒక చిన్న కథ చదవండి..

అనగనగనగా..

ఒక వ్యక్తి బాగా ఒత్తిడికి లోనవుతూ, ఏదైనా ప్రశాంతమైన చోటుకు వెళ్లాలనుకుంటాడు. దగ్గరలో ఉన్న ఒక పార్కుకు వెళ్లి చెట్ల మధ్య తిరుగుతూ స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ ఆస్వాదిస్తాడు. అతడికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, అలాగే నడక కొనసాగిస్తాడు.

గాలి పీల్చుకుంటూ వాదులుతాడు, అయితే కొద్దిదూరం వెళ్లాక అతడికి స్వచ్ఛమైన గాలి కాకుండా పొగలాంటి వాసన వస్తుంది. దీంతో ఇంతటి పచ్చటి పార్కులో పొగ ఎవరు పెట్టారు అనుకుంటూ అటుగా వెళ్తాడు. అక్కడ ఒక చోట ఎవరో మంట పెట్టారు. అయితే ఆ మంటలో ఒక పాము చిక్కుకుంది. దీంతో ఈ వ్యక్తి పాము నుంచి దూరంగా పారిపోకుండా దానిని కాపాడాలని ప్రయత్నిస్తాడు. ఆ వ్యక్తి ఏదో రకంగా కష్టపడి మంటల నుంచి ఆ పామును రక్షిస్తాడు. అయినప్పటికీ ఆ పాము ఇతడిపై బుసలు కక్కుతూ కాటేసి వెళ్లిపోతుంది.

దీంతో అక్కడున్న కొంతమంది ఎందుకయ్యా నీకు ఇది.. చూడు ఇప్పుడు ఆ పామును నువ్వు రక్షించినా, అది నిన్ను కాటు వేసింది అంటారు. అందుకు ఆ వ్యక్తి బదులిస్తూ, పాము కాటు వేస్తుందని తెలుసు అది దాని స్వభావం, తెలిసి కూడా సాయం చేయడం ఒక మనిషిగా నేను చూపించే మానవత్వం అంటాడు.

ఈ కథలో నీతి ఏమిటంటే.. పరిస్థితుల ప్రభావం, ఒకరి స్వభావం మిమ్మల్ని బాధపెడితే వెంటనే మీ వ్యక్తిత్వాన్ని, మీ మంచితనాన్ని మార్చుకోవద్దు. మీరు హేతుబద్ధమైన ఆలోచనలు కలిగిన పరిపూర్ణ వ్యక్తి, మీ వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శం. అందువల్ల మీ భావాలు, భావోద్వేగాలు మీ నియంత్రణలో ఉండాలి.

WhatsApp channel