Metabolism | జీవక్రియ బాగుండాలంటే ఆయుర్వేదం ప్రకారం ఏం చేయాలి? ఏం చేయకూడదు?
తిన్నది అరగటం లేదా? ఆయుర్వేదం ప్రకారం ఆహారం తేలికగా జీర్ణం అవ్వాలంటే ఏం చేయాలి? ఏం చేయకూడదో ఇక్కడ తెలుసుకోండి.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే, శరీరం అన్ని విధాల సహకరించాలంటే మంచి జీవక్రియను కలిగి ఉండటం చాలా ముఖ్యం. మనం తినే ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ ఇది. మెటబాలిజం నెమ్మదిగా ఉండటం వల్ల బరువు పెరగడమే కాకుండా చర్మ సమస్యలు, జుట్టు రాలడం, ఏకాగ్రత లోపించడం, దీర్ఘకాలికమైన అలసట, పేగు సంబంధ రుగ్మతలు, ఆకలి కోరికలను అదుపు చేసుకోలేకపోవడంసహా ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
ఆయుర్వేదంలో పోషక రసాలు (పోషకాలు), ధాతువులు (కణజాలం) తీసుకునే ఆహారం పరిమాణం, అవసరమయ్యే సమయం మీద జీవక్రియ రేటు గురించి చర్చ ఉంటుంది.
ఢిల్లీలోని క్రియా శరీర్ AIIA విభాగం HOD, ప్రొఫెసర్ డా. కల్పనా దిలీప్ హెచ్‌టి డిజిటల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శరీరం నిర్ధిష్ట పరిమాణంలోలో బాలా (శక్తి), ఉష్ణ (వేడి) అలాగే ధాతు తర్పణ (వ్యాప్తి) ఉత్పత్తి చేయడానికి నిర్ధిష్ట సమయం అవసరమని తెలిపారు.
ఆయుర్వేదం ప్రకారం, జీవక్రియను మెరుగుపరచడానికి కొన్ని పద్ధతులు మార్చుకోవాలని సూచించారు. అవేంటో ఇక్కడ కింద జాబితా ఇచ్చాము చూడండి.
వీటిని నివారించాలి:
- అసమయ భోజనాలు చేయడం, అర్థరాత్రి సమయంలో తినడం
- ఆరోగ్యకరం కాని ఆహార పదార్థాలను తీసుకోవడం
- తిన్న ఆహారం జీర్ణం కాకముందే మరొక ఆహారం తీసుకోవడం
- ఎక్కువగా తినేయడం, అతిగా తినడం
- అవసరానికి మించి నీటిని తాగటం
- మద్యం సేవించడం
- అలవాటు లేని ఆహారాన్ని తినడం
- కలుషిత ఆహారాలు తినడం
- మృదువైన పొడులను తీసుకోవడం
- కొత్తగా పండించిన తృణధాన్యాలు తినడం
అలాగే తేలికపాటి వ్యాయామాలు చేయాలి. అంతేకాని తీవ్రమైన వ్యాయామం, అధిక సమయం పాటు నడక, ఎక్కువసేపు నిలబడి ఉండటం వంటివి చేయకూడదని ఆయుర్వేద నిపుణులు తెలిపారు.
మంచి జీవక్రియ కోసం ఏం చేయాలి?
చురుకైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేలా సమయానికి భోజనం చేయాలి. ఒక రోజులో రెండు సార్లు మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. ఉదయం పూట అల్పాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అలాగే భోజనానికి ముందు పండ్లు తినాలని డాక్టర్ కల్పనా దిలీప్ తెలిపారు. ప్రకృతి, రుతువులు, వయస్సు ప్రకారంగా ఆహారం అలాగే జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఇంట్లో వండినది తాజా ఆహారం తీసుకోవాలి. ఆయుర్వేదం ప్రకారం ప్యాక్ చేసిన, టిన్ లలో వచ్చిన ఇన్ స్టంట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఎక్కువ కాలం నిల్వచేసిన, రిఫ్రిజిరేటె చేసిన ఫుడ్, కలుషిత బయటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే చేపలు- పాలు, పండ్లు- పాలు ఒకేసారి తీసుకోవద్దు. అతిగా పుల్లని, ఉప్పగా ఉండే ఆహారం, చేదు, క్షార పదార్ధాలను తీసుకోకూడదని చరక సంహితంలో పేర్కొనడం జరిగింది.
అంతేకాదు పగటిపూట నిద్రపోవడం, అధికంగా సెక్స్ చేయడం, తీవ్రమైన కోరికలు, కోపం, దుఃఖం వంటి భావోద్వేగాలు జీవక్రియనే కాదు ఆయుష్షును తగ్గిస్తాయని చరక సంహితంలో పేర్కొన్నట్లు డాక్టర్ కల్పనా దిలీప్ స్పష్టంచేశారు.
సంబంధిత కథనం