Digestive Health | ఆహారం తేలికగా జీర్ణం అవ్వాలంటే.. ఈ మార్గాలు అనుసరించండి
తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే వివిధ అనారోగ్యాలతో పాటు అది కొలొరెక్టల్ క్యాన్సర్ కు దారితీసే ప్రమాదం ఉంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడే మార్గాలను ఇక్కడ తెలుసుకోండి.
జీర్ణవ్యవస్థ అంటే ఆహారాన్ని జీర్ణం చేసే శరీర భాగం. ఇక్కడ జీర్ణమైన ఆహారంలోని పోషకాలు రక్తంలోకి చేరతాయి. అక్కడి నుంచి కాలేయానికి చేరుతుంది. కాలేయం ఈ పోషకాలను వివిధ అవయవాలకు, శరీర భాగాలకు చేరవేస్తుంది. తద్వారా శక్తి లభిస్తుంది. ఏ పనైనా సక్రమంగా చేసుకోగలుగుతాం. మరి ఇంతటి ప్రాధాన్యత కలిగిన జీర్ణ వ్యవస్థలో పోషకాలు లేని ఆరోగ్యాన్ని చెడగొట్టే ఆహారాలతో నింపివేస్తే జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. ఆహారం జీర్ణం కాదు, తద్వార శక్తి లభించదు. వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా మారి ఏవోవో అనారోగ్యాలను కొనితెచ్చుకున్నట్లు అవుతుంది.
జీర్ణవ్యవస్థను ప్రభావితం చేసే అనేక వ్యాధులు ఉన్నాయి. కొన్నిసార్లు 'కొలొరెక్టల్ క్యాన్సర్' ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. అయితే ఆహారంలో మార్పులు, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా ప్రిలినికల్ దశల్లో ఉన్నప్పుడే కొలొరెక్టల్ క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు. దీనిపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది మే 29న ప్రపంచ జీర్ణ ఆరోగ్య దినోత్సవం (World Digestive Health Day) గా నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు పలు మార్గాలను ఇక్కడ సూచించాం. వీటిని మీరు అనుసరిస్తే మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవచ్చు.
ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని తినండి
ఎప్పుడైనా సరే ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలి. మీకు నచ్చిన ఆహారాన్ని పరిశుభ్రమైన పద్ధతుల్లో ఆరోగ్యకరంగా వండుకోండి. ప్యాకెట్లలో వచ్చే ఆహారం, ప్రాసెస్ చేసిన ఆహారం మీ జీర్ణవ్యవస్థకు బద్ధ శత్రువులు అని గ్రహించాలి. అలాంటి ఆహారాలు మీ జీర్ణవ్యవస్థను నిర్వీర్యం చేస్తాయి. కాబట్టి ఇంట్లో వండిన తాజా ఆహారాన్ని మాత్రమే తినండి. మీ భోజనంలో జీర్ణక్రియకు సహాయపడే మంచి బ్యాక్టీరియా ఉండే పెరుగు, మజ్జిగ లేదా కేఫీర్‌లను చేర్చండి.
ఫైబర్ అధికంగా ఉండే ఆహారం
మీ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉంటే అది తేలికగా జీర్ణమవుతుంది. కాబట్టి మీ కడుపుని ఎప్పటికప్పుడు క్లియర్ చేయడానికి ఇది సహాయపడుతుంది. తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. వాటిల్లో ఫైబర్ సహా ఎన్నో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. మీ పేగు ఆరోగ్యం బాగుంటుంది.
ఒత్తిడిని తగ్గించుకోండి
ఒత్తిడి కూడా జీర్ణవ్యవస్థను ప్రభావితం చేసే ఒక శత్రువే. దీర్ఘకాలిక ఒత్తిడి, ఆందోళన జీర్ణవ్యవస్థకు హాని కలిగిస్తాయి. ఆసిడిటీ, మలబద్ధకం లాంటి సమస్యలకు కారణమవుతాయి. కాబట్టి ప్రశాంతంగా ఉండండి, మంచి నిద్రను కలిగి ఉండండి. ఆహరం ఎంత ముఖ్యమో, జీర్ణ ఆరోగ్యానికి నిద్ర కూడా అంతే ముఖ్యం. అయితే తిన్న వెంటనే పడుకోకూడదు, నిద్రపోకూడదు. తిన్న తర్వాత సుమారు 10 నిమిషాలు నెమ్మదిగా నడిస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
ఆహారాన్ని బాగా నమలండి
తినేటపుడు ఆహారాన్ని బాగా నమలడం జీర్ణక్రియకు చాలా మంచిది. నెమ్మదిగా, నములుకుంటూ తింటే సగభాగం నోటిలోనే జీర్ణమవుతుంది. అదే సమయంలో కడుపులోకి చేరిన ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఎంజైమ్‌లకు తగినంత సమయం ఉంటుంది. సులువుగా ఉంటుంది. కాబట్టి ఆహారాన్ని ఆలాగే మింగేయకుండా మంచిగా నమిలి తినండి.
మలినాలు తొలగించండి
మీ జీర్ణవ్యవస్థను ఎప్పటికప్పుడు రీసెట్ చేయడానికి క్రమం తప్పకుండా డిటాక్స్ చేస్తూ ఉండంటి. గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల జీర్ణక్రియకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. సోంఫ్, జీలకర్ర నమలడం వంటివి చేయడం వలన కూడా జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
తేలికపాటి వ్యాయామం
యోగా, నడక, సైక్లింగ్ మొదలగు వ్యాయామాలు చేయడం వలన జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
సంబంధిత కథనం