Kaun Pravin Tambe? Review | క్రికెట్ లవర్స్ ను మెప్పించే సినిమా
41 ఏళ్ల వయసులో ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసి చరిత్రను సృష్టించాడు ముంబై ఆటగాడు ప్రవీణ్ తాంబే. అతడి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం కౌన్ ప్రవీణ్ తాంబే. ఈ సినిమా ఎలా ఉందంటే..
క్రికెటర్లకు నలభై ఏళ్ల వయసు వచ్చిందంటే కెరీర్ ముగిసిపోయినట్లుగానే భావిస్తుంటారు.ఆటకు రిటైర్ మెంట్ ప్రకటించి కోచ్ గా మారి యువ ఆటగాళ్లకు శిక్షణ ఇస్తూ జీవితాన్ని గడుపుతుంటారు. కానీ నలభై ఏళ్ల వయసులో ఆటగాడు అరంగేట్రం చేస్తే అద్భుతమనే చెప్పాలి. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు ప్రవీణ్ తాంబే. 41 ఏళ్ల లో ఐపీఎల్ అరంగేట్రం చేసి అత్యధిక వయస్కుడైన ఆటగాడిగా చరిత్రను సృష్టించాడు ప్రవీణ్ తాంబే. 2014లో కోల్ కతా నైట్ రైడర్స్ పై హ్యాట్రిక్ తీయడమే కాకుండా ఆ సీజన్ లో అత్యధిక వికెట్లను తీసి పరుపుల్ క్యాప్ అందుకున్నాడు. ఆ తర్వాత ఐపీఎల్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ కు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ తర్వాత టీ10 లీగ్ లు ఆడి మరో హ్యాట్రిక్ తీశాడు. ప్రవీణ్ తాంబే జీవితం ఆధారంగ రూపొందిన చిత్ర కౌన్ ప్రవీణ్ తాంబే. శ్రేయాస్ తల్ఫడే టైటిల్ పాత్రలో నటించారు. జయప్రద్ దేశాయ్ దర్శకత్వం వహించారు. డిస్నీ హాట్ స్టార్ ద్వారా ఈ సినిమా రిలీజ్ అయ్యింది. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందంటే...
ప్రవీణ్ తాంబే (శ్రేయాస్ తల్ఫడే) కు చిన్నతనం నుంచి క్రికెట్ అంటే ప్రాణం. 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు జరిగిన ఓ సంఘటన కారణంగా ఎప్పటికైనా రంజీ క్రికెట్ లో ఆడాలని బలంగా నిర్ణయించుకుంటాడు. దిగువ మధ్యతరగతి కుటుంబం కావడంతో అతడి తల్లిదండ్రలు మాత్రం ఏదైనా ఉద్యోగం చేసుకోమని క్రికెట్‌ను వదిలేయమని బలవంతపెడుతుంటారు. క్రికెట్ ఆటకారణంగానే షిప్పింగ్ కంపెనీలో అతడికి ఉద్యోగం వస్తుంది. వైశాలి(అంజలి పాటిల్) తో పెళ్లి జరుగుతుంది. కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు రంజీ జట్టులో స్థానం కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు తాంబే. 35 ఏళ్లు దాటిన అతడికి రంజీ జట్టులో అవకాశం మాత్రం రాదు. మరోవైపు ఉద్యోగం పోవడంతో బార్ లో వెయిటర్ గా పనిచేస్తుంటాడు. పేస్ బౌలింగ్ లో పదను తగ్గడంతో అతడి మణికట్టుకు స్పిన్ కరెక్ట్ అని కోచ్ సలహా ఇస్తాడు. కోచ్ సలహాను ప్రవీణ్ పాటించాడా? ఐపీఎల్ లోకి అతడు ఎలా అరంగేట్రం చేశాడు? రంజీ ఆడాలనే తాంబే కల నెరవేరిందా? తాంబే ప్రతిభను తక్కువగా అంచనా వేసిన రజత్ సన్యాల్(పరమబ్రత ఛటర్జీ) అనే స్పోర్ట్స్ రైటర్ తన తప్పును ఎలా గ్రహించాడు అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.
ప్రతిభకు వయసు అడ్డంకి కాదనే పాయింట్ తో రూపొందిన స్పోర్ట్స్ బయోపిక్ ఇది. గల్లీ క్రికెట్ నుంచి ప్రయాణాన్ని మొదలుపెట్టి అంతర్జాలీయ లీగ్ లు ఆడేస్థాయికి ప్రవీణ్ తాంబే ఎలా ఎదిగాడు? ఈ క్రమంలో అతడికి ఎలాంటి కష్టాలు, సమస్యలు ఎదురయ్యాయనే పాయింట్ తో దర్శకుడు జయప్రద్ దేశాయ్ ఈ సినిమాను తెరకెక్కించారు. కుటుంబ బంధాలు, క్రికెట్ రెండింటికి సమ ప్రాధాన్యతనిస్తూ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా డ్రామాగా ఈ సినిమా సాగుతుంది. తాంబే జీవితాన్నిఓ జర్నలిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం ఆసక్తిని రేకెత్తించింది.
తాంబేకు క్రికెట్ పట్ల ఉన్న ఇష్టాన్ని, అతడి కుటుంబ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ ప్రథమార్థం సినిమాను దర్శకుడు సరదాగా తెరకెక్కించారు. క్రికెట్ ఆడే అవకాశం ఉన్న ఉద్యోగం వెతికే క్రమంలో అతడు చేసే ప్రయత్నాలు ఆసక్తిని పంచుతాయి. పెళ్లి చూపుల్లో నువ్వు ఏం చేస్తుంటావు అని అడిగిన ప్రశ్నకు బౌలింగ్, బ్యాటింగ్ అంటూ ప్రవీణ్ సమాధానం చెప్పడం, క్రికెట్ తన ఫస్ట్ లవ్ అంటూ కాబోయే భార్యకు చెప్పే డైలాగ్స్ క్రికెట్ పట్ల అతడికి ఉన్న ఇష్టాన్ని చాటిచెబుతాయి.
ద్వితీయార్థం పూర్తిగా ఎమోషనల్ రైడ్ గా సినిమా సాగుతుంది. జీవితంలో ఒక్కసారిగా ప్రవీణ్ ను కష్టాలు చుట్టుముట్టడం, వాటిని ఎదురించి ధైర్యంగా నిలబడే సన్నివేశాలు మనసుల్ని కదిలిస్తాయి. బార్ లో వెయిటర్ గా పనిచేస్తూనే మరోవైపు క్రికెట్ ప్రాక్టీస్ చేసే సన్నివేశాలను దర్శకుడు హృద్యంగా చూపించారు. బార్ లో జర్నలిస్ట్ రజత్ సన్యాల్‌కు ప్రవీణ్ తాంబేకు మధ్య వచ్చే సీన్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. ఐపీఎల్ రియల్ మ్యాచ్ నేపథ్యంలో తెరకెక్కించిన పతాక ఘట్టాలు ఆసక్తిని పంచుతాయి. నిజమైన ప్లేయర్స్ ను చూపిస్తూ కన్వీన్సింగ్ గా సినిమాను ఎండ్ చేయడం బాగుంది.
ప్రవీణ్ తాంబే పాత్రలో జీవించాడు బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే. తాంబే బాడీలాంగ్వేజ్, బౌలింగ్ శైలిని అనుకరిస్తూ చక్కటి నటనను కనబరిచాడు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైన చిరునవ్వుతో వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగిన ఆటగాడిగా స్ఫూర్తిదాయకంగా అతడి పాత్ర సాగింది. తాంబే భార్యగా అంజటి పాటిల్ చక్కటి నటనను కనబరిచింది. తాంబేతో వ్యక్తిగతంగా ఎలాంటి పగ, ప్రతీకారాలు లేకపోయినా అకారణంగా అతడిని ద్వేషించే జర్నలిస్ట్ రజత్ సన్యాల్ గా పరమబ్రత ఛటర్జీ నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలో కనిపించారు. ప్రవీణ్ కోచ్ గా ఆశిష్ విద్యార్థి నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించారు.
తాంబే జీవితాన్ని వాస్తవిక కోణంలో ఎంటర్‌టైనింగ్ చెప్పడంలో దర్శకుడు జయప్రద్ దేశాయ్ సక్సెస్ అయ్యాడు.
క్రికెట్ ప్రేమికులతో పాటు రెగ్యులర్ సినిమా లవర్స్ ను మెప్పించే సినిమా ఇది. ప్రతిభ తో పాటు లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల ఉంటే గమ్యానికి వయసు, కష్టాలు అడ్డంకి కాదని చక్కటి సందేశంతో సినిమా ఆకట్టుకుంటుంది.