Gaami 3 days Box Office Collections: గామి సూపర్ హిట్.. మూడు రోజుల్లోనే బడ్జెట్ కంటే మూడు రెట్లు ఎక్కువ వసూళ్లు
Gaami 3 day Box Office Collections: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్ నటించిన గామి మూవీ సూపర్ హిట్ అయింది. మూడు రోజుల్లోనే బడ్జెట్ కంటే మూడు రెట్లు ఎక్కువ వసూళ్లతో గామి దూసుకెళ్తోంది.
Gaami 3 day Box Office Collections: టాలీవుడ్‌లో ఈ ఏడాది మరో సూపర్ డూపర్ హిట్ సొంతం చేసుకుంది గామి మూవీ. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ లోనే ఏకంగా రూ.20 కోట్లకుపైగా వసూలు చేయడం విశేషం. ఈ విషయాన్ని మేకర్స్ తమ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించారు. విశ్వక్‌సేన్ నటించిన ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావడం కూడా బాగా కలిసొచ్చింది.
గామి బాక్సాఫీస్ కలెక్షన్లు
గామి మూవీ గత శుక్రవారం (మార్చి 8) ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. అంతకు మూడు రోజుల ముందే వచ్చిన ట్రైలరే సినిమాపై అంచనాలను పెంచేసింది. ట్రైలర్ తోనే ఓ భిన్నమైన ఫీల్ అందించిన ఈ సినిమాకు మూవీ రిలీజ్ తర్వాత కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఫస్ట్ వీకెండ్ మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా గామి రూ.20.3 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు.
గామి బాక్సాఫీస్ కలెక్షన్లపై వి సెల్యూలాయిడ్ సోమవారం (మార్చి 11) ట్వీట్ చేసింది. "బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ వీకెండ్ గామికి బాగా కలిసి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తొలి మూడు రోజుల్లోనే రూ.20.3 కోట్లు వసూలు చేసింది. అన్ని ప్రాంతాల్లోనూ లాభాల్లోకి దూసుకెళ్లింది. తెలుగు సినిమా నుంచి వచ్చిన ఈ ఊపిరి బిగపట్టి చూసే ఎపిక్ కోసం వెంటనే టికెట్లు బుక్ చేసుకోండి" అనే క్యాప్షన్ తో మేకర్స్ ఈ విషయాన్ని వెల్లడించారు.
రెండు రోజుల్లోనే గామికి లాభాలు
గామి మూవీ తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.9 కోట్ల ఓపెనింగ్ సాధించింది. రెండో రోజే లాభాల్లోకి దూసుకెళ్లడం విశేషం. ఇండస్ట్రీ వర్గాల అంచనా మేరకు గామి మూవీ బడ్జెట్ కంటే కూడా ఇప్పటికే మూడు రెట్లు ఎక్కువ వసూలు చేసింది. అమెరికాలో ఇప్పటికే 5 లక్షల డాలర్లకుపైగా వసూలు చేసిన ఈ విశ్వక్ సేన్ మూవీ.. త్వరలోనే మిలియర్ డాలర్ల మార్క్ అందుకోనుంది.
నిజానికి ఆరేళ్లుగా ఈ గామి మూవీ ఊరిస్తూనే ఉంది. చాలా రోజుల షూటింగ్, ఆలస్యాల తర్వాత మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విశ్వక్ కు తన కెరీర్లోనే అతి పెద్ద హిట్ అందించింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో అమెరికాలో రోజురోజూ గామి స్క్రీన్ల సంఖ్య పెరిగిపోతోంది. నిజానికి గామి మూవీని కేవలం రూ.3 కోట్ల బడ్జెట్ తోనే తెరకెక్కించినట్లు సమాచారం.
ఇప్పటికే మూవీ సాధించిన షేర్ చూసుకున్నా.. బడ్జెట్ కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంది. ఈ సినిమాకు పోటీగా రిలీజైన గోపీచంద్ భీమాకు నెగటివ్ టాక్ కూడా గామికి కలిసి వచ్చింది. విద్యాధర్ కాగిత డైరెక్ట్ చేసిన గామి మూవీలో చాందిని చౌదరి ఫిమేల్ లీడ్ గా నటించింది. ఈ మూవీని ఓ విజువల్ ట్రీట్ గా మలిచిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.
హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కించారంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. గామి మూవీ ఓటీటీ హక్కులను జీ5 ఓటీటీ దక్కించుకుంది. సినిమాకు బాక్సాఫీస్ దగ్గర వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. ఏప్రిల్ చివర్లోగానీ ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.