Anjali Fall Web Series OTT Release Date: అంజలి నటించిన ఫాల్ వెబ్‌సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే
Anjali Fall OTT Release Date: అంజలి నటించిన ఫాల్ వెబ్‌సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ తమిళ థ్రిల్లర్ సిరీస్ తెలుగుతోపాటు హిందీలోనూ రాబోతోంది.
Anjali Fall OTT Release Date: టాలీవుడ్ నటి అంజలి ఇప్పుడు పూర్తిగా ఓటీటీపైనే దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఈ మధ్యే డిస్నీ హాట్‌స్టార్‌లో వచ్చిన ఝాన్సీ వెబ్‌సిరీస్‌లో కనిపించిన ఆమె.. ఇప్పుడు మరో సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆమె నటించిన తమిళ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఫాల్ (Fall) కూడా హాట్‌స్టార్‌లోనే రిలీజ్ కాబోతోంది.
ఈ సిరీస్ డిసెంబర్ 9 నుంచి స్ట్రీమ్ అవనుంది. సిద్ధార్థ్ రంగస్వామి డైరెక్ట్ చేసిన ఈ వెబ్‌సిరీస్.. పాపులర్ కెనడా మినీ సిరీస్ వెర్టిజ్ ఆధారంగా తెరకెక్కింది. ఈ సిరీస్‌లో అంజలితోపాటు సంతోష్ ప్రతాప్, తలైవాసల్ విజయ్, ఎస్‌పీబీ చరణ్, సోనియా అగర్వాల్ ఇతర ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. సర్కిల్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్, బనిజయ్ ఆసియా సంయుక్తంగా ఈ సిరీస్‌ను నిర్మించాయి.
కొన్ని వారాల కిందటే ఈ సిరీస్ ఫస్ట్ లుక్, ట్రైలర్ రిలీజ్ అయ్యాయి. ఓ ప్రమాదంలో గాయపడి తన గతాన్ని మరచిపోయిన ఓ అమ్మాయి చుట్టూ తిరిగే కథే ఈ ఫాల్. తన గతాన్ని తిరిగి పొందే క్రమంలో కొన్ని విషయాలు ఆమెను మరింత దారుణంగా దెబ్బతీస్తాయి. దీంతో ఆమె మానసిక ఆరోగ్యం మరింత దెబ్బ తింటుంది. వీటిని ఆమె ఎలా అధిగమిస్తుందనేది అసలు స్టోరీ.
ఈ ఫాల్ సిరీస్ తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ రిలీజ్ కానుండటం విశేషం. ఈ ఏడాది నితిన్‌తో మాచర్ల నియోజకవర్గం మూవీలో ఓ స్పెషల్ సాంగ్ చేసిన అంజలి.. కన్నడ మూవీ భైరాగీలోనూ కనిపించింది. ఇక రామ్‌చరణ్, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఆర్సీ15లోనూ అంజలి కనిపించింది.