Minister Harish Rao : తెలంగాణలో బీజేపీకి రెండు, మూడు సీట్లు కూడా రావు- మంత్రి హరీశ్ రావు-dubbaka news in telugu minister harish rao says bjp wont get two seats in elections ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Minister Harish Rao : తెలంగాణలో బీజేపీకి రెండు, మూడు సీట్లు కూడా రావు- మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao : తెలంగాణలో బీజేపీకి రెండు, మూడు సీట్లు కూడా రావు- మంత్రి హరీశ్ రావు

HT Telugu Desk HT Telugu
Nov 22, 2023 07:28 PM IST

Minister Harish Rao : దుబ్బాక అభివృద్ధికి ప్రభాకర్ రెడ్డి నిధులు తెస్తే, రిబ్బన్ కటింగ్ లు రఘునందన్ రావు చేశారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. దుబ్బాకలో మాటల మనిషి కావాలా? చేతల మనిషి కావాలా? ప్రజలు ఆలోచించాలన్నారు.

మంత్రి హరీశ్ రావు
మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao : దుబ్బాక మీద సీఎం కేసీఆర్ కు ఉన్న ప్రేమ ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీలకు ఉంటుందా? అని ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు ఇచ్చిన వధువుకు పుస్తె మట్టెలు, బీడీ, చేనేత కార్మికుల కు పింఛన్, నిరుద్యోగ భృతి, ఎడ్ల బండి, డిగ్రీ కళాశాలలు, రైలు బండి, పరిశ్రమల ఏర్పాటు ఏమయ్యాయన్నారు. దుబ్బాక అభివృద్ధి కోసం కేంద్రం నుంచి ఒక్క పైసా నిధులన్నా రఘునందన్ రావు తెచ్చారా అని ప్రశ్నించారు. బుధవారం మిరుదొడ్డి అక్బర్ పేట- భూంపల్లిలో జరిగిన రోడ్ షో లో మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మాట్లాడారు. దుబ్బాక అభివృద్ధి కోసం ప్రభాకర్ రెడ్డి నిధులు తెస్తే, కొబ్బరికాయలు, రిబ్బన్ కటింగ్ లు రఘునందన్ చేశారన్నారు. గత హామీలు మరిచిపోయిన ఎమ్మెల్యే నేడు ఊర్లు, భూములు పోతాయని కొత్త పుకార్లకు శ్రీకారం చుట్టారన్నారు. గుంట భూమి, ఊరు కూడా పోదని, జూటా మాటలు నమ్మవద్దన్నారు. నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టి వస్తుందన్నారు. ప్రభుత్వ భూములకు సైతం పట్టాలు అందిస్తామన్నారు.

గత ఎన్నికలలో బీజేపీకి రాష్ట్రంలో 1 సీటు మాత్రమే వచ్చిందని, బీజేపీకి ఓటేస్తే ఒరిగేదేమిలేదన్నారు. అన్ని సర్వేలు కేసీఆర్ వైపే ఉన్నాయని గుర్తు చేశారు. దుబ్బాకలో ఉప ఎన్నికల తర్వాత పాలు నీళ్లు తెలిపోయాయి. కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ నిజం చెప్పారు. మీటర్లు పెట్టనందుకు 25 వేల కోట్లు ఇవ్వలేదు అని చెప్పారు. రైతుల కోసమే సీఎం కేసీఆర్ మీటర్లు పెట్టడానికి ఒప్పు కోలేదని, కాంగ్రెస్, బీజేపీ దొందు దొందే అని, తెలంగాణలో అన్ని సంక్షేమ పథకాలు అమలు కావాలి అంటే అక్కడ కేసీఆర్, ఇక్కడ ప్రభాకరన్న గెలవాలన్నారు. మాటల మనిషి కావాలా? చేతల మనిషి కావాలా దుబ్బాక ప్రజలే ఆలోచించుకోవలన్నారు.

కాంగ్రెస్ చేతిలో పడితే ఆగం అవుతారు

బ్రహ్మాం గారు కాలజ్ఞానంలో చెప్పని పనులను సీఎం కేసీఆర్ చేసి చూపించారని హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో మంచి నీళ్లు పొయ్యి కాడికి వచ్చాయన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని కరెంటు కష్టాలే, ఎంతో గోసపడ్డాము. ఎరువులు, విత్తనాలు, ధాన్యం కొనుగోలు, రైతుబంధు బీమా, చెరువుల అభివృద్ధి ఎంతో అభివృద్ధి చేశామన్నారు. సద్ది తిన్న రేయి తలవాలి. బీజేపీ వాళ్లు చెప్పింది ఏమైనా చేశారా? అని ప్రశ్నించారు. పుట్టిన బిడ్డ తల్లి చేతుల్లో ఉంటేనే భద్రం, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చేతుల్లోనే తెలంగాణ ఉంటే భద్రమని, శ్రుతి లేని కాంగ్రెస్ చేతిలో పడితే ఆగం అవుతామన్నారు. రేవంత్, భట్టి, కోమటిరెడ్డి, జగ్గారెడ్డి అందరూ లీడర్లే. రైతుబంధును బీఆర్ఎస్ నుంచి కాపీ చేసిన కాంగ్రెస్ ప్రతి రైతుకు రూ.15 వేలు మాత్రమే ఇస్తామంటున్నారు. ఇందులో మోసం ఉంది. రెండెకరాలు దాటిన వారికి ఇయ్యరటా అని హరీశ్ రావు దుయ్యబట్టారు. తెలంగాణలో బీజేపీకి రెండు మూడు సీట్లు కూడా రావని, తెలంగాణను కష్టాల పాలు చేసిన కాంగ్రెస్ వాళ్లను ప్రజలు నమ్మరని, మరోసారి సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం ఖాయమని హరీశ్ రావు పేర్కొన్నారు.

Whats_app_banner