‘సర్వే’జన సుఖీనోభవంతు.. సర్వేల పేరుతో ఆత్మవంచన-survey says it is time to talk about self deception ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Survey Says It Is Time To Talk About Self Deception

‘సర్వే’జన సుఖీనోభవంతు.. సర్వేల పేరుతో ఆత్మవంచన

HT Telugu Desk HT Telugu
Feb 16, 2024 05:33 PM IST

‘టికెట్లు ఇవ్వడానికి సర్వే. టికెట్లు ఇవ్వకుండా ఉండటానికి సర్వే. పదవులు ఇవ్వడానికి సర్వే. పదవులు ఇవ్వకుండా ఉండటానికి సర్వే. ఈ సర్వే నాటకంలో తెలుగునాట ఏ పార్టీకీ మినాహాయింపు లేదు..’ - పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ రీసెర్చర్ జి.మురళీకృష్ణ విశ్లేషణ.

సొంత సర్వేలతో రాజకీయ పార్టీల ఆత్మవంచన
సొంత సర్వేలతో రాజకీయ పార్టీల ఆత్మవంచన

టికెట్లు ఇవ్వడానికి సర్వే. టికెట్లు ఇవ్వకుండా ఉండటానికి సర్వే. పదవులు ఇవ్వడానికి సర్వే. పదవులు ఇవ్వకుండా ఉండటానికి సర్వే. ఈ సర్వే నాటకంలో తెలుగునాట ఏ పార్టీకీ మినాహాయింపు లేదు. ‘సర్వే’జన సుఖీనోభవంతు!!... ఇదే ఇప్పుడు పార్టీ అధినాయకుల పోకడ!! సకల రాజకీయ సమస్యలకూ ‘సర్వే’నే రోగ నివారిణి... ఇది వారి రాజకీయ ఎత్తుగడ!!

సర్వేలు చేయించడం, సర్వేల పేరిట రాజకీయం చేయడం.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 1980ల నుంచే మొదలైంది. ముందుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన ఈ సర్వే సంస్కృతిని తర్వాత వచ్చిన మాజీ ముఖ్యమంత్రులు వైఎస్సాఆర్, కేసీఆర్, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి వరకు కాలమాన పరిస్థితులను బట్టి తమ అవసరలకు తగ్గట్టుగా అన్వయించుకున్నారు.

ఎన్నికల ముందు ‘‘మనం సర్వే చేపిస్తున్నాం. అందులో బాగున్నవారికే టిక్కెట్టు ఇచ్చుకుంటునున్నాం’’ అని అధినేతలు పార్టీ సమావేశాల్లో చెప్పడం ఆనవాయితీగా మారింది. సర్వే చేయించారా? లేదా? అనే దానితో సంబంధం లేకుండా సొంత నిర్ణయాలు రుద్దడానికి సర్వేలను పావుగా వాడుకుంటున్నారు. సర్వే భుజమ్మీద తుపాకీ పెట్టి, నచ్చని వారిని పక్కన పెట్టి, నచ్చినవారిని పక్కకు తీసుకుంటున్నారు.

సర్వే చేయించాం కాబట్టే ఫలానా నిర్ణయం తీసుకుంటున్నామని పార్టీలు చెప్తున్నాయి. కానీ, అది ఇంటలిజెన్స్ విభాగం వంటి ప్రభుత్వ యంత్రాంగం జరిపిన సర్వేనా, ప్రయివేట్ సంస్థలతో చేయించిన సర్వేనా అనే విషయం ఎవరికీ తెలియదు! దీని గురించి అడిగేవారు ఉండరు. ఒకవేళ సాహసం చేసి అడిగినా వారి ఉరుములకు భయపడిపోతారు. నిష్పక్ష పాత ధోరణితో తీసుకునే సరైన శాంపిల్, తగిన ఉపకరణాలతో సేకరించిన డేటాకు హేతుబద్ధత ఉంటే సర్వేలన్నీ వాస్తవానికి దగ్గరగానే ఉంటాయి. కానీ, సర్వేల పేరు చెప్పి ‘మీకు ఇలా ఉంది, వారికి అలా ఉంది’ అని సొంత నిర్ణయాలు తీసుకోవడానికి సర్వే పేరు వాడుకుంటూ అన్ని రాజకీయ పార్టీలు ఆత్మవంచన చేసుకుంటున్నాయి.

విశ్వసనీయత లేని సొంత సర్వేలు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ అదినేత అనేక సర్వేలు చేయించినట్లు చెప్పుకున్నారు. సర్వేల ప్రకారమే టికెట్ల కేటాయింపు ఉంటుందని కూడా చెప్తుండేవారు. కానీ, విశ్వసనీయమైన అనేక సర్వే సంస్థలు 30 నుంచి 40 సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని చెప్పాయి. కానీ, సర్వేల పేరు చెప్పారుగానీ, మార్చకుండా నచ్చినవాళ్లకే సీట్లు ఇచ్చుకున్నారు. మారిన అభ్యర్థులు గెలవడం ఇక్కడ కొసమెరుపు!

జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో సిట్టింగ్ కార్పోరేటర్లకు ఇచ్చి తప్పు చేసిన బీఆర్ఎస్...మరోసారి అదే తప్పు చేసి భంగపడింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతూ...అభ్యర్థులను మార్చి ఉంటే గెలిచేవాళ్లమని చెప్పుకున్నారు. మరి డబ్బులు ఖర్చు పెట్టి సర్వేలు చేయించింది ఎందుకు? ఇష్టానుసారం సీట్లు కేటాయించింది ఎందుకు? సమాధానం వారికే తెలియాలి!

జగన్ ప్రయోగం సఫలమవుతుందా?

‘‘క్షేత్రాన్ని బట్టే విత్తనం మొలకెత్తుతుంది’’ అని ప్రముఖ పాత్రికేయులు, కమ్యూనిస్టు నాయకులు గజ్జెల మల్లా రెడ్డి ఎనాడో చెప్పారు. అంటే, అభ్యర్థికి అనువైన చోట పోటి చేసినప్పుడే విజయం సాధించడానికి అధిక అవకాశాలు ఉంటాయి. కానీ, క్షేత్రం, క్షేత్రస్థాయి పరిస్థితులతో సంబంధం లేకుండా జగన్ చేస్తున్న రాజకీయ బదిలీలను పరిశీలిస్తే... హేతుబద్ధత ఉన్న ఏ సర్వే సంస్థ అలా సిఫరాసు చేయదని ఇట్టే అర్థమవుతుంది. ఊరు, పేరు తెలియని ప్రాంతాలకు బదిలీలు చేయడంతో... క్రికెట్‌లో విదేశీ మైదనాల్లో ఆడటానికి భారత ఆటగాళ్లు ఎలా ఇబ్బందులు పడతారో... హోం గ్రౌండ్ నుంచి బదిలీ అయిన వైఎస్సార్సీపీ నాయకులు కూడా అచ్చం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది.

2019లో ఒకేసారి 175 మంది వైఎస్సార్సీపీ అభ్యర్థులను ప్రకటించిన జగన్, ఈసారి ఇన్ని సార్లు మార్చి, మార్చి ఎందుకు టికెట్లు ప్రకటిస్తున్నారు? ఒక సర్వేలో ఒకటి వచ్చిన తర్వాత... ఇంకో సర్వేలో తేడా వస్తుందా? ఒకటి రెండుతో ఆగకుండా పదుల సంఖ్యలో రాజకీయ బదిలీలు వల్ల జగన్ టాక్ ఆఫ్ ది నేషన్ గా మారారు.

కానీ, ఇలాంటి పనులకు కూడా చంద్రబాబే అందరికంటే ముందుగా శ్రీకారం చుట్టారు. 2019లో పాయకరావు పేటలో పోటి చేయాల్సిన సిట్టింగ్ ఎమ్మెల్యే వంగలపుడి అనితను కొవ్వూరు నుంచి పోటీ చేయించారు. కొవ్వూరు సిట్టింగ్ ఎమ్మెల్యేను శామ్యూల్ జవహర్‌ని తిరువూరు అసెంబ్లీకి మార్చారు. 2009లో గుంటూరులోని సత్తెనపల్లి నుంచి ప్రజారాజ్యం టికెట్‌పై పోటీ చేసిన బైరా దిలీప్‌ని చంద్రబాబు అనకాపల్లి నుంచి పోటికి నిలబెట్టాలని చూస్తున్నారు. ఇలాంటి ఉదంతాలు చంద్రబాబు నాయుడి రాజకీయ చరిత్రలో అనేకం ఉన్నాయి. ఒక చోట చెల్లని రూపాయి ఇంకో చోట ఎలా చెల్లుతుంది? చెల్లవనే ఈ ఉదాంతాలన్నింటిలో ఎదురైన ఓటములు నిరూపించాయి. కాబట్టి, సర్వేలను దేనికోసం వాడుతున్నారో లోతుగా అర్థం చేసుకోవాలి.

పాఠం నేర్చుకోవడానికి ఇష్టపడని నేతలు

జగన్, చంద్రబాబు సర్వేల పిచ్చితో చేసుకుంటున్న ఆత్మవంచన ఫలితాలు కూడా వెంటనే కనపడుతున్నాయి. అయినా, పాఠం నేర్చుకోవడానికి అధినేతలు ఇష్టపడటం లేదు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి బలమేలేని మంగళగిరి నియోజకవర్గంలో ఏ సర్వే ఆధారంగా లోకేశ్‌కి టికెట్టు ఇచ్చారు?

ఏ సర్వే చెప్పిందని 2014లో వైఎస్ విజయమ్మని విశాఖపట్నం నుంచి పోటి చేయించారు? పవన్ కళ్యాణ్‌కి, గాజువాకకు ఉన్న సంబంధం ఏంటి? కామారెడ్డిలో పోటీ చేయమని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏ సర్వే సలహా ఇచ్చింది? గజ్వేల్ లో ఈటెల రాజేందర్‌ని ఎవరు పోటీ చేయమన్నారు? మునుగోడు ఉప ఎన్నికల్లో రాజీనామ చేసిన వెంటనే ఎన్నికకు వెళ్లాలని బీజేపీకి ఏ సర్వే సూచించింది?

2009లో ఏ సర్వే చెప్పిందని అల్లు అరవింద్ అనకాపల్లి నుంచి పోటీ చేసి, మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు? ఏ సర్వే చెప్పిందని పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు 2019లో నర్సాపురం పార్లమెంటు నుంచి పోటి చేశారు? ఇప్పుడు ఏ సర్వే‌లో ఏం తేలిందని అనకాపల్లి పార్లమెంటు సీటు ఆశిస్తున్నారు? అంతా రాజకీయ నాయకుల ఇష్టమే!! వారు చేసే తప్పులకు సర్వేలను ఒక సాకుగా పెట్టుకుంటున్నారు.

అలిపిరి దుర్ఘటన తర్వాత లేని సానుభూతి ఉందనుకొని, కృత్రిమ సానుభూతి పుట్టించవచ్చని బలంగా నమ్మిన చంద్రబాబు సర్వేల సానుకూలతల్ని నమ్ముకుని 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఏ శాస్త్రీయత, సామాజిక అధ్యయనం లేకుండానే ముందస్తు ఎన్నికలకు తొందరపడి, బొక్క బోర్లా పడ్డారు. తమతో జట్టు కట్టిన బీజేపీని, ఎన్డీయేని కూడా ముంచారు.

ఆంధ్రా అక్టోపస్ అని తనకు తానే బిరుదు ఇచ్చుకున్న లగడపాటి రాజగోపాల్ పోల్ సర్వేలు ఏమయ్యాయి? ఆయన సర్వేలు నమ్ముకుని చంద్రబాబు 2019లో మరోసారి బొల్తాపడ్డారు. ఆ ఎన్నికల్లో ఎందుకు ఓటమిపాలయ్యారో చంద్రబాబు నాయుడు సమీక్షించుకున్నారా? ఒకవేళ సమీక్షించుకుని ఉంటే, గడిచిన నాలుగేళ్లలో టీడీపీ బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించేది! సర్వేలన్నీ వైఫల్యమయ్యాక... లగడపాటి రాజగోపాల్ తను సర్వేలు చేయనని విరమించుకున్నారు!

2018 ఎన్నికలప్పుడు తెలంగాణలో టీడీపీతో పొత్తు కాంగ్రెస్‌ని ముంచింది. మరి సర్వే సంస్థలు దీన్నెందుకు పసిగట్టలేకపోయాయి? ఆ సమయంలో ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు అయినా తన ఇంటలిజెన్స్ సర్వే ద్వారా పరిస్థితిని తెలుసుకొని ఉండాల్సింది కదా? వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి తర్వాత చంద్రబాబు, షర్మిలా, జగన్, తమ్మినేని వీరభద్రం, బండి సంజయ్, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, లోకేశ్ ఇలా చాలామంది ప్రముఖ తెలుగు నాయకులు పాదయాత్ర చేశారు. అసలు ఈ పాదయాత్రల ప్రభావాన్ని ఆ సర్వే సంస్థలు ఎందుకు పసిగట్ట లేకపోయాయి?

రాత్రికి రాత్రే పార్టీ మారి కండువా కప్పుకున్న నాయకులకు పొద్దున్నే టికెట్లు కేటాయించమని ఏ సర్వే సంస్థ ఫాస్ట్ ఫుడ్ నివేదిక వండి వారుస్తోంది? సర్వేల పేరు చెప్పి పార్టీలు తాత్కాలిక అవసరాలు తీర్చుకుంటున్నాయే తప్ప నిజమైన ప్రయోజనం పొందడం లేదు. కమ్యూనిస్టులు తప్ప అంతా సర్వే పేరు వాడుకుంటున్నారు. కమ్యూనిస్టు పార్టీలు సర్వే కాకుండా ప్రజా క్షేత్రంలో పోరాటం అంటాయి. కానీ, ఆ పోరాటాలూ తగ్గిపోతున్నాయి.

శాస్త్రీయంగా జరిపే సర్వే ఈసీజీ లాంటిది. ఉన్నదున్నట్టు, లేదా స్వల్ప వ్యత్యాసాలతో క్షేత్రంలోని వాస్తవ పరిస్థితిని యదాతథంగా చూపిస్తుంది. ఒక నాయకుడి పనితీరు, ప్రజల్లో అతనికున్న ఆధారణ తదితర వివరాలతో రాగద్వేషాలకు అతీతంగా ఒక బయోడేటా తయారు చేసి ఇస్తుంది. తద్వారా మంచి నాయకుడికి అవకాశం లభిస్తుంది. ప్రజలకు కూడా మేలు జరుగుతుంది.

బ్యాలెన్స్‌ షీట్‌కే పెద్ద పీట

రాజకీయాలను ఖరీదైన వ్యవహారంగా మార్చేసిన ఈ నాయకులు ఇప్పుడు బయోడేటాకు బదులు బ్యాలెన్స్ షీట్ చూసి టికెట్లు ఇస్తున్నారు. ఈ బ్యాలెన్స్ షీట్లను తమ వైపు తిప్పుకోవడం కోసమే సర్వే పేరిట పార్టీలు నాటకం ఆడుతున్నాయి. దీంతో డబ్బు వెంట పరుగులు తీసే కొన్ని సర్వే సంస్థలు కూడా క్లయింట్‌కి అనుకూలంగా సర్వే నివేదికలు ఇచ్చే ఫ్యాక్టరీల్లా తయారయ్యాయి. అందుకే, నాయకులు సర్వే అనుకూలంగా వస్తే ఒక విధంగా మాట్లాడాతారు. ప్రతికూలంగా వస్తే ఇంకో విధంగా మాట్లాడతారు. ఇటీవల ఇండియా టుడే ఒక సర్వే నివేదిక విడుదల చేస్తే, దానికి పోటీగా కొన్ని పార్టీలు ఇతర సర్వేల్లో తమకు ఆధిక్యత ఉన్నట్టుగా సర్వే రిపోర్ట్ విడుదల చేయించుకోవడం దేనికి సంకేతం?

సర్వే అంటే ఊహించి చెప్పే లెక్క కాదు. జ్యోతిష్యం అంత కన్నా కాదు. సర్వే ఒక సైన్స్. శాస్త్రీయ పద్ధతిలో చేసే సర్వే క్షేత్రస్థాయి పరిస్థితులకు అద్దం పడుతుంది. అలాంటి సర్వే నిర్వహించాలంటే...ఒక్క శాంపిల్‌కి కనిష్టంగా 300 రూపాయిల ఖర్చు వస్తుంది. దేశంలో, రాష్ట్రంలో నిబద్ధత కలిగిన సర్వే సంస్థలు ఈ ఖర్చును చూసే తమ విశ్వసనీయత దెబ్బతినకుండా ఆచితూచి అడుగులు వేస్తుంటాయి. కానీ, కొన్ని సర్వే సంస్థలు తమ సర్వేలో లక్షల శాంపిల్స్ సేకరించామని ప్రచారం చేసుకుంటున్నాయి. అన్ని శాంపిల్స్ తీసుకోవడం సాధ్యమేనా? ఆ సర్వేలో అంత డేటాను సేకరించడానికి అంతమంది మ్యాన్ పవర్, అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో

ఆ సంస్థలు ఎందుకు చెప్పడం లేదు? వెరసి, ఇవన్నీ సర్వేల విశ్వసనీయతపై ప్రభావం చూపిస్తున్నాయి. పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం సర్వేలను వాడుకున్నంత కాలం సర్వేల విశ్వసనీయత సన్నగిల్లుతూనే ఉంటుంది. నాయకుల ఆత్మవంచనా కొనసాగుతూనే ఉంటుంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత నాటి ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రకాశం జిల్లాలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఒక కార్యకర్త లేచి మాట్లాడుతూ... ‘‘పార్టీ కష్టాల్లో ఉందని మాకు కూడా తెలుసు. పదేళ్లు అధికారంలో ఉండి మాతో మాట్లాడారా?’’ అని ప్రశ్నించారు. కాబట్టి, ప్రతి నియోజకవర్గంలో ఉన్న తమ ప్రధాన కార్యకర్తలతో కూర్చొని మాట్లాడి... వారి అభిప్రాయాలకు గౌరవం ఇస్తే చాలు ... పార్టీలకు ఏ సర్వే సంస్థలూ అవసరం లేదు!

- జి.మురళికృష్ణ,

రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ,

Email: peoplespulse.hyd@gmail.com

- జి.మురళికృష్ణ, రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ,
- జి.మురళికృష్ణ, రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ,

(గమనిక: వ్యాసంలో తెలియపరిచిన అభిప్రాయాలు, విశ్లేషణలు వ్యాసకర్త వ్యక్తిగతం. హిందుస్తాన్ టైమ్స్‌వి కావు)

IPL_Entry_Point