Seperate Regional Demands in AP : ఏపీలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు.. ఇది ఎక్కడి వరకు ? -seperate regional demands in andhra pradesh from uttarandhra and rayalaseema leaders ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Seperate Regional Demands In Andhra Pradesh From Uttarandhra And Rayalaseema Leaders

Seperate Regional Demands in AP : ఏపీలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు.. ఇది ఎక్కడి వరకు ?

Thiru Chilukuri HT Telugu
Jan 02, 2023 03:43 PM IST

Seperate Regional Demands in AP : ఆంధ్రప్రదేశ్ లో రాజధాని వివాదం .. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లకు ఆజ్యం పోసింది. మంత్రి ధర్మాన చేసిన వ్యాఖ్యలు.. రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. తమ ప్రాంతాలను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలంటున్న ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతల ప్రకటనలు.. రానున్న రోజుల్లో పార్టీలకు అగ్నిపరీక్ష కానున్నాయి.

ఏపీలో కొత్త రాష్ట్ర డిమాండ్లు
ఏపీలో కొత్త రాష్ట్ర డిమాండ్లు

Seperate Regional Demands in AP : సుదీర్ఘ కాలంగా ఏదైనా ఓ వాదన వినిపిస్తూ ఉండి.. దానికి ప్రజల మద్దతు కూడా బలంగా ఉంటే.. అది తాత్కాలిక ఉపశమనాలతో సద్దుమణిగిపోదు. ఎన్నాళ్లయినా, ఎన్నేళ్లయినా.. ఆకాంక్షలు నెరవేరే వరకూ ఆ వాదన ఓ సమూహం లేదా ప్రాంతం నుంచి వస్తూనే ఉంటుంది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, పరిణామాలు సానుకూలంగా మారినప్పుడు.. అంతకముందు ఉన్న బలానికి అదనపు శక్తిని కూడగట్టుకుని.. మరింత దృఢంగా దూసుకొస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అలాంటి వాదనే.. రెండు ప్రాంతాల నుంచి వస్తోంది. 1972లో ఉవ్వెత్తున లేచిన జై ఆంధ్రా ఉద్యమం తరహాలోనే... 50 ఏళ్ల తర్వాత మళ్లీ ఆంధ్రలో ప్రాంతీయ వాదనలు ఊపందుకున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి విషయంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందనే భావన ఈ ప్రాంత ప్రజల్లో బలంగా ఉంది. రాష్ట్ర విభజన జరిగి, ఏపీ - తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా అదే చిన్నచూపు తమ ప్రాంతాలపై కొనసాగుతోందనే వాదన ఈ ప్రాంత నేతలు, ప్రజా సంఘాల నుంచి వినిపిస్తోంది. అయితే.. ఇన్నాళ్లకు ఏపీలో మళ్లీ ప్రాంతీయ డిమాండ్లకు ఆజ్యం పోసిన అంశం... రాజధాని వివాదమే !

రాష్ట్ర విభజన తర్వాత .. ఏపీకి అమరావతిని నూతన రాజధానిగా అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. రాజధాని నిర్మాణం కోసం అంటూ 33 వేల ఎకరాల భూ సేకరణ చేపట్టింది. ప్రధాని నరేంద్ర మోదీతో శంకుస్థాపన కూడా చేయించింది. పరిపాలనా భవనాలు నిర్మించింది. ఈ మేరకు భారీ మొత్తంలో ఖర్చు చేసింది. అయితే.. అప్పుడు ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం.. రాజధానిగా అమరావతిని వ్యతిరేకిస్తూ వచ్చింది. పచ్చని భూములను రైతుల నుంచి సేకరించడాన్ని తప్పుపట్టింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ నుంచి కూడా నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఇవేమీ పట్టించుకోని టీడీపీ ముందడుగు వేసింది. 2019లో... ఏపీలో ప్రభుత్వం మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికార పీఠాన్ని అధిష్టించిన కొద్ది కాలానికే... రాజధాని అంశంపై తమ విధానమేంటో జగన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏకైక రాజధాని అమరావతి స్థానంలో... విశాఖ కార్యనిర్వాహక రాజధానిగా.. కర్నూలు న్యాయ రాజధానిగా.. అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించింది. ఈ విధానంతో... రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయన్నది వైఎస్సార్సీపీ వాదన. అయితే.. రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజధాని అని టీడీపీ, జనసేన నినదిస్తూ ప్రజా క్షేత్రంలో పోరాడుతున్నాయి. అమరావతి రైతులు కూడా పాదయాత్రలు, నిరసనలు, ధర్నాలతో పోరాటాలకు పిలుపునిచ్చారు. ఈ అంశంపై రాష్ట్ర హైకోర్టు.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పుని సవాల్ చేస్తూ.. ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానంలో కేసులు నడుస్తున్నాయి.

ఇలా... రాజధాని అంశం ఏపీలో హాట్ టాపిక్ అయింది. ఈ అంశంలో పార్టీల విధానాలను ప్రజలు గమనిస్తూ వస్తున్నారు. ప్రజల భావాలకు అనుగుణంగా.. నేతలు సైతం తమ కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. వారు చేస్తున్న వ్యాఖ్యలతో.. ఏపీలో మళ్లీ ప్రాంతీయ డిమాండ్లను తెరపైకి తెస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోను... విశాఖను రాజధానిగా చేయాల్సిందేనని.. లేని పక్షంలో ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రంగానైనా ప్రకటించాలంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తేనెతుట్టెను కదిపారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రీకృతంగా మొత్తం ఖర్చు చేశామని... రాష్ట్ర విభజనతో విడిచిపెట్టి వచ్చామని అన్నారు. ఆ పొరపాటు మళ్లీ జరగకూడదని.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమాన స్థాయిలో అభివృద్ధి చెందాలన్నారు. ధర్మాన నుంచి ఈ వ్యాఖ్యలు.. ప్రత్యేక రాయలసీమ వాదనకు ఆజ్యం పోశాయి. ధర్మాన వ్యాఖ్యలపై స్పందించిన రాయలసీమ నేతలు.. ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రంగా కావాలంటే.. తమ ప్రాంతాన్ని కూడా గ్రేటర్ రాయలసీమ పేరిట ప్రత్యేక రాష్ట్రం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే నేతల నుంచి ఈ డిమాండ్లు వచ్చినట్లు స్పష్టం అవుతోంది.

అయితే.. రాజధానిగా అమరావతిని సమర్థిస్తున్న వారు.. వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, కరవు కోరల్లో చిక్కిన రాయలసీమ అభివృద్ధి కోసం ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలనే డిమాండ్ ఆ ప్రాంతాల ప్రజల నుంచి వ్యక్తం అవుతోంది. భాషా ప్రాతిపదికన మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి.. హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నుంచి అభివృద్ధి మొత్తం కేవలం ఒక్క నగరానికే పరిమితం అయిందన్న వాదన ఉంది. మౌలిక వసతుల కల్పన మొత్తం హైదరాబాద్ నగరంలోనే జరిగిందనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఈ విషయంలో తాము తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యామనే భావన.. ఉత్తరాంధ్ర, రాయలసీమ వాసుల నుంచి తరచూ వ్యక్తం అవుతూనే ఉంది. తర్వాత జరిగే పరిణామాలపై దూర దృష్టి లేకుండా ఒకే చోట కేంద్రీకృత అభివృద్ధి చేశారని.. రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రస్తుత ఏపీలో మళ్లీ అలా జరగకూడదనే వాదన ఈ ప్రాంతాల నుంచి ఆది నుంచి వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా.. అమరావతి రాజధానితో కృష్ణా, గోదావరి ప్రాంతాలకే మేలు జరుగుతుందని... ఇతర ప్రాంతాలకు అంతగా ఒనగూరే ప్రయోజనాలు ఏమీ ఉండవన్న రాజకీయ విమర్శలు ఉన్నాయి.

ఈ మొత్తం.. పరిణామాలు గమనిస్తే.. వచ్చే ఏడాది జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో.. రాజధాని అంశమే కీలకం కానుందని స్పష్టం అవుతోంది. ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, జనసేన .. తమ తమ వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. అయితే.. రాజధాని వికేంద్రీకరణ వెనుక తమ ఉద్దేశం అన్ని ప్రాంతాల అభివృద్ధే అని జగన్ పార్టీ ప్రజలకు వివరిస్తూ వస్తోంది. వెనకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమలో.. కార్యనిర్వాహక, న్యాయ రాజధానులు ఏర్పాటు చేయడం ద్వారా మౌలిక వసతుల కల్పన పెరుగుతుందని, తద్వారా ప్రజలు ఆశించిన అభివృద్ధి జరుగుతుందని చెబుతోంది. ఈ మాటలను తిప్పికొడుతోన్న టీడీపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ కు రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని.. కేవలం ప్రజల మధ్య ప్రాంతీయ విభేదాలు సృష్టించి, రాజకీయంగా లబ్ధి పొందేందుకే మూడు రాజధానుల పేరిట డ్రామాలు ఆడుతున్నారని ఆరోపిస్తోంది. అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవమని.. అన్ని అనుకూలతలు ఉన్న ఈ చోటి నుంచి పాలన జరిగితే.. రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందని అంటోంది. సీఎం జగన్ దూర దృష్టి లేని నిర్ణయాలతో.. ఏపీ ప్రజల కలలు కల్లలుగానే మిగిలిపోయే పరిస్థితి ఏర్పడిందని విమర్శిస్తోంది. తాజాగా.. మంత్రి ధర్మాన వ్యాఖ్యలపైనా టీడీపీ ఘాటుగానే స్పందించింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలను రెచ్చగొట్టేందుకే మంత్రి ఇలా మాట్లాడారని.. దీని వెనుక కుట్ర దాగి ఉందని విమర్శిస్తోంది. రాజధాని అంశంలో జనసేన నుంచి దాదాపుగా ఇదే విధానం వ్యక్తం అవుతోంది. ఇలా ఏపీలోని ప్రధాన పార్టీలు.. ఏపీ కేపిటల్ పై తమ పాలసీ ఇదంటూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో.. ఏపీలో మళ్లీ ఊపందుకున్న ప్రాంతీయ డిమాండ్లు.. ఎంత వరకు వెళతాయన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం నేతల నుంచి వ్యక్తం అవుతోన్న కోరికలు... ప్రజల్లోకి బలంగా వెళ్లి.. ఉద్యమంగా రూపుదిద్దుకుంటే.. వాటిపై ఏపీ పొలిటికల్ పార్టీలు ఏ స్టాండ్ తీసుకుంటాయో చూడాలి !

IPL_Entry_Point